
నోట్ల రద్దుతో సంక్షేమానికి మరిన్ని నిధులు
తెలంగాణకు ఉపాధి కింద రూ.3 వేల కోట్లు: దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: పాత నోట్ల రద్దుతో పేదల సంక్షేమానికి అధిక నిధులు సమకూరాయని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ) శుక్రవారం ‘డిజిటల్ పేమెంట్ల’పై నిర్వహించిన సదస్సులో ఆయన మా ట్లాడారు. పాత నోట్ల రద్దు తర్వాత బడ్జెట్‌లో ఉపాధి హామీకి రూ.48 వేల కోట్లు కేంద్రం కేటాయించిందని, అందులో తెలంగాణకు రూ.3వేల కోట్లు ఇచ్చిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలకు ‘స్టాండప్ ఇండియా’ కింద ఒక్కో బ్యాంకు శాఖ నుంచి ఇద్దరు చొప్పున 2.04లక్షల మందికి రూ.కోటి వరకు రుణం ఇచ్చే అవకాశం ఏర్పడిందన్నారు.
హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్‌లలో డిజీధన్ మేళాలు నిర్వహించామన్నారు. ‘లక్కీ గ్రాహక్ యో జన’ ద్వారా 15.79లక్షల మంది వినియోగదారులు, డిజీధన్ వ్యాపార్ యోజన ద్వారా 91వేల మంది వ్యాపారులు విజేతలుగా నిలిచారన్నారు. ఈ సందర్భంగా నాగ్‌పూర్‌లో భీమ్–ఆధార్ యాప్‌ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ ప్రసంగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.
శాస్త్రీయ పన్ను విధానమే ఆమోదయోగ్యం
శాస్త్రీయ పన్ను విధానమే పన్ను చెల్లింపుదారునికి, ప్రభుత్వానికి ఉభయ తారకంగా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. పన్నుల రూపంలో వచ్చే ఆదాయం పెరగాలంటే శాస్త్రీయ పన్ను విధానమే మార్గమన్నారు. జీఎస్టీ అమలుతో పన్నుల విధానంలో ఆశించిన మార్పు వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. డిజిటల్ లావాదేవీలు పెరగాలంటే... వాటిపై చార్జీలు తగ్గించాల్సిన అవస రముందన్నారు. ఈ విషయాన్ని పలుమార్లు కేంద్ర ఆర్థిక మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు.