దేశానికే తలమానికం
- ‘టాటా-బోయింగ్ ఏరోస్పేస్’ యూనిట్‌పై రక్షణ మంత్రి మనోహర్ పరీకర్
- ఆదిబట్లలో వైమానిక విడిభాగాల తయారీ సంస్థకు శంకుస్థాపన
- రక్షణ రంగంలో దశల వారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు
- తెలంగాణ ప్రభుత్వ విధానాలు బాగున్నాయని ప్రశంస
- ‘ఏరోస్పేస్’ యూనిట్‌తో తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తం
- పెట్టుబడులకు రాష్ట్రం ఆకర్షణీయ గమ్యస్థానంగా మారింది: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: దేశ వైమానిక రంగానికి ‘టాటా-బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్’ తలమానికంగా నిలుస్తుందని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పరీకర్ పేర్కొన్నారు. దేశ రక్షణ రంగంలో దశల వారీగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రవేశపెడుతున్నామని.. ఏరోస్పేస్ యూనిట్‌తో దానికి తొలి అడుగు పడుతోందని చెప్పారు. సుమారు 13 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.200 కోట్లతో ఏర్పాటవుతున్న ఈ యూనిట్‌ను మూడు నెలల్లో పూర్తిచేసి విడిభాగాల ఉత్పత్తి ప్రారంభించేలా టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ చర్యలు చేపడుతోందన్నారు. శనివారం హైదరాబాద్ శివార్లలోని ఆదిబట్లలో ఉన్న టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ (టీఏఎస్‌ఎల్) ప్రాంగణంలో ‘టాటా-బోయింగ్ ఏరోస్పేస్ లిమిటెడ్’ యూనిట్‌కు కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. ఎయిర్‌క్రాఫ్ట్‌లు, హెలికాప్టర్ల ప్రధాన భాగాలను తయారు చేయడానికి బోయింగ్, టీఎఎస్‌ఎల్‌ల మధ్య అవగాహనా ఒప్పందం కుదిరిందని పరీకర్ చెప్పారు.
రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను దశల వారీగా ప్రవేశపెడుతున్నామని... టాటా బోయింగ్ యూనిట్‌తో ఈ ప్రక్రియకు తొలి అడుగు పడినట్లయిందని పేర్కొన్నారు. దీనితో ప్రపంచవ్యాప్తంగా అపాచీ హెలికాప్టర్లకు విడిభాగాలను అందించే 15 దేశాల్లో భారత్ ఒకటిగా నిలవనుందని వెల్లడించారు. విదేశీ పెట్టుబడుల విషయంలో కేంద్రం సరళీకృత విధానాలను అవలంబిస్తోం దని..ఆ విధానాలకు న్యాయశాఖ ఆమోదం లభించిందని చెప్పారు. రక్షణ రంగంలో ప్రైవేటు పెట్టుబడులపై సహజంగానే ఏదో ఒక చర్చ జరుగుతుందని.. భారత మీడియాకు సృజనాత్మకత (క్రియేటివిటీ) ఎక్కువగా ఉండడం వల్లే ఇలా జరుగుతోందని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. కేంద్రం చేపట్టిన మేకిన్ ఇండియా కార్యక్రమం ఫలితాలు త్వరలోనే చూడబోతున్నామని పేర్కొన్నారు.
టీఎస్‌ఐపాస్, ఐటీ పాలసీ భేష్..
తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్, ఐటీ పాలసీలు బాగున్నాయని కేంద్ర రక్షణ శాఖ మంత్రి పరీకర్ ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆలోచనలకు అనుగుణంగా ఆకర్షణీయ పాలసీలను ప్రకటి స్తుంటాయని, అవన్నీ ఆచరణలో విజయవంతం కావని పేర్కొన్నారు. కానీ తెలంగాణ ప్రకటించిన విధానాలు పెట్టుబడులను ఆకర్షించేవిగా ఉన్నాయని.. తెలంగాణకు వస్తున్న పెట్టుబడులు చూస్తే అవి విజయవంతమైనట్లు స్పష్టమవుతోందని అభినందించారు. పెట్టుబడుల విషయంలో స్పష్టమైన విధానాలు అవసరమని, ఆ దిశగా తెలంగాణ ముందుకు సాగుతోందని కితాబిచ్చారు.
టీ-హబ్‌పై ప్రశంసల జల్లు
సార్టప్‌లను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన టీ-హబ్‌పై పరీకర్ ప్రశంసల జల్లు కురిపించారు. శనివారం టీ-హబ్‌ను సంద ర్శించిన కేంద్రమంత్రికి మంత్రి కేటీఆర్ స్వాగతం పలికారు. టీ-హబ్‌లోని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలనుద్దేశించి పరీకర్ మాట్లాడారు. కేటీఆర్ టీ-హబ్‌కు రూపకల్పన చేయడం ఆయన నాయకత్వ ప్రతిభకు అద్దం పడుతోందన్నారు. ప్రతి ఒక్కరూ కలలు కంటారని, ఆ కలలను నిజం చేసుకునేందుకు పనిచేసేవారు తక్కువగా ఉంటారని... కేటీఆర్ బృం దంలో పనిచేసే వ్యక్తులు ఎక్కువగా ఉన్నారని అభినందించారు. టెక్నాలజీ ద్వారా ప్రజల జీవితాల్లో వెలుగులు వస్తాయని, ఆ మేరకు టెక్నాలజీని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో క్లీన్‌టెక్, శానిటేషన్ రంగాల్లో మంచి అవకాశాలు ఉంటాయని, ఆ దిశగా కృషి చేయాలని స్టార్టప్‌లకు పరీకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఐటీశాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, టీ-హబ్ సీఈవో క్రిష్ణన్ తదితరులు పాల్గొన్నారు.
విశ్వవ్యాప్తంగా తెలంగాణ ఖ్యాతి: కేటీఆర్
టాటా-బోయింగ్ వైమానిక విడిభాగాల ఉత్పత్తి సంస్థ రాష్ట్రానికి రావడం సంతోషకరమని... దీనితో తెలంగాణ ఖ్యాతి విశ్వవ్యాప్తమైందని మం త్రి కేటీఆర్ పేర్కొన్నారు. పెట్టుబడులకు తెలంగాణ ఆకర్షణీయ గమ్యంగా మారినందునే అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టేం దుకు ముందుకు వస్తున్నాయన్నారు. టీఎస్‌ఐపాస్ ద్వారా రాష్ట్రాన్ని పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని, గత 10నెలల్లో 2,130 పరిశ్రమలకు అనుమతులివ్వడమే ఇందుకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ చైర్మన్ ఎస్.రమదొరై, సీఈవో సుకరాన్‌సింగ్, ఏరోస్ట్రక్చర్స్ హెడ్ మసూద్ హుస్సేనీ, బోయింగ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ ప్రత్యూష్ కుమార్, బోయింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ దేవ్ కూపర్‌స్మిత్, ఎంపీలు బూర నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలు పాల్గొన్నారు.