ఉపకారం... బహుదూరం... | Delay in Disbursing Scholarships in telangana | Sakshi
Sakshi News home page

ఉపకారం... బహుదూరం...

Published Sat, Jan 21 2017 2:16 AM | Last Updated on Sat, Sep 15 2018 4:12 PM

Delay in Disbursing Scholarships in telangana

సాక్షి, హైదరాబాద్‌: పోస్టుమెట్రిక్‌ విద్యార్థులు ఉపకార వేతనాలకోసం మరికొంత కాలం నిరీక్షించాల్సిందే. ఉపకార వేతనాల కోసం విద్యార్థులు పెట్టుకున్న దరఖాస్తుల పరిశీలన  ప్రారంభం కాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది.  నెలవారీగా ఈ నిధులు విద్యార్థులకు అందాల్సినా.. దరఖాస్తు ప్రక్రియలో జాప్యం .. దరఖాస్తుల్ని పరిశీలించకపోవడం విద్యార్థు ల పాలిట శాపంగా మారింది. ఆగస్టు తొలివా రంలో దరఖాస్తుల ప్రక్రియ మొదలై సెప్టెం బర్‌ నాటికి ముగుస్తుంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఈ ప్రక్రియలో జాప్యం నెలకొంది. కొత్త జిల్లాల ఏర్పాటు క్రమంలో నెలరోజుల పాటు మీసేవా, ఈపాస్‌ వెబ్‌సైట్‌ సర్వర్లు నిలిచిపోయాయి. దీంతో దరఖాస్తులను డిసెంబర్‌ 31 వరకు స్వీకరించారు. దరఖాస్తుల సమర్పణ గడువు ముగిసి 20 రోజులైనా వాటిని పరిశీలించకపోవడం గమనార్హం.

మూడు దశల్లో పరిశీలన..
2016–17 విద్యాసంవత్సరంలో సంక్షేమ శాఖ లకు 12.97లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటి పరిశీలన 3 దశల్లో సాగుతుంది. విద్యార్థులు సమర్పించిన దరఖాస్తులన్నీ ఆయా జిల్లాల సంక్షేమాధికారుల పరిధిలో ఉన్నాయి. ప్రతి దరఖాస్తుకు ఆధార్, బ్యాంకు పాస్‌బుక్‌ వివరాలను జిల్లా సంక్షేమాధికారులు కేంద్ర సర్వర్‌లో పరిశీలించి ఆమోదించాలి. ఆమోదించిన వాటిని  కళాశాల యూజర్‌ ఐడీకి జత చేస్తారు. అక్కడ విద్యార్థి వేలిముద్రలు సేకరించిన తర్వాత సర్టిఫికెట్లను పరిశీలించి తిరిగి సంక్షేమాధికారులకు పంపాలి.

సంక్షేమాధికారులు  వివరాలను పరిశీలించి ఉపకారవేతనాన్ని మంజూరు చేస్తారు. ఈ ఏడాది కొత్త జిల్లాల కారణంగా జిల్లా సంక్షేమ శాఖల్లో సిబ్బంది కొరత ఉండటంతో వీటి పరిశీలన నెమ్మదిగా సాగనుంది. ప్రక్రియ ఇప్పటికిప్పుడు ప్రారంభించినా ఏప్రిల్‌ చివరి వారానికి ముగుస్తుంది. ఈలోపు విద్యార్థులకు వార్షిక పరీక్షలు ముగిసిపోతాయి. దీంతో పోస్టు మెట్రిక్‌ విద్యార్థులకు కోర్సు ముగిసిన తర్వాతే ఉపకార లబ్ధి కలగనుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement