Reimbursements
-
ఉపకారం... బహుదూరం...
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థులు ఉపకార వేతనాలకోసం మరికొంత కాలం నిరీక్షించాల్సిందే. ఉపకార వేతనాల కోసం విద్యార్థులు పెట్టుకున్న దరఖాస్తుల పరిశీలన ప్రారంభం కాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. నెలవారీగా ఈ నిధులు విద్యార్థులకు అందాల్సినా.. దరఖాస్తు ప్రక్రియలో జాప్యం .. దరఖాస్తుల్ని పరిశీలించకపోవడం విద్యార్థు ల పాలిట శాపంగా మారింది. ఆగస్టు తొలివా రంలో దరఖాస్తుల ప్రక్రియ మొదలై సెప్టెం బర్ నాటికి ముగుస్తుంది. ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఈ ప్రక్రియలో జాప్యం నెలకొంది. కొత్త జిల్లాల ఏర్పాటు క్రమంలో నెలరోజుల పాటు మీసేవా, ఈపాస్ వెబ్సైట్ సర్వర్లు నిలిచిపోయాయి. దీంతో దరఖాస్తులను డిసెంబర్ 31 వరకు స్వీకరించారు. దరఖాస్తుల సమర్పణ గడువు ముగిసి 20 రోజులైనా వాటిని పరిశీలించకపోవడం గమనార్హం. మూడు దశల్లో పరిశీలన.. 2016–17 విద్యాసంవత్సరంలో సంక్షేమ శాఖ లకు 12.97లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీటి పరిశీలన 3 దశల్లో సాగుతుంది. విద్యార్థులు సమర్పించిన దరఖాస్తులన్నీ ఆయా జిల్లాల సంక్షేమాధికారుల పరిధిలో ఉన్నాయి. ప్రతి దరఖాస్తుకు ఆధార్, బ్యాంకు పాస్‌బుక్ వివరాలను జిల్లా సంక్షేమాధికారులు కేంద్ర సర్వర్‌లో పరిశీలించి ఆమోదించాలి. ఆమోదించిన వాటిని కళాశాల యూజర్ ఐడీకి జత చేస్తారు. అక్కడ విద్యార్థి వేలిముద్రలు సేకరించిన తర్వాత సర్టిఫికెట్లను పరిశీలించి తిరిగి సంక్షేమాధికారులకు పంపాలి. సంక్షేమాధికారులు వివరాలను పరిశీలించి ఉపకారవేతనాన్ని మంజూరు చేస్తారు. ఈ ఏడాది కొత్త జిల్లాల కారణంగా జిల్లా సంక్షేమ శాఖల్లో సిబ్బంది కొరత ఉండటంతో వీటి పరిశీలన నెమ్మదిగా సాగనుంది. ప్రక్రియ ఇప్పటికిప్పుడు ప్రారంభించినా ఏప్రిల్ చివరి వారానికి ముగుస్తుంది. ఈలోపు విద్యార్థులకు వార్షిక పరీక్షలు ముగిసిపోతాయి. దీంతో పోస్టు మెట్రిక్ విద్యార్థులకు కోర్సు ముగిసిన తర్వాతే ఉపకార లబ్ధి కలగనుంది. -
ప్రజావ్యతిరేక విధానాలు ఎండగడతాం
కరీంనగర్‌సిటీ: రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ అన్నివర్గాల ప్రజలకు అండగా ఉంటామని వైఎస్సార్సీపీ యువజన విభాగం తెలంగాణ అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్ అన్నారు. సోమవారం కరీంనగర్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువత అధ్యక్షుడు కంది వెంకట రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ విస్మరించి ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోనే బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించారని గుర్తు చేశారు. నేటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయకుండా విద్యార్థులను రోడ్డుకీడ్చిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ వసతి గృహాల్లో కనీసం దుప్పట్లు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. రైతుల కోసం ఉచిత విద్యుత్‌తో పాటు మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరాయని గుర్తు చేశారు. వైఎస్సార్ హయాంలో లక్షలాది ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి సొంతింటి కల నెరవేర్చారని, కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇళ్ల హామీ రెండున్నరేళ్లు గడిచినా అమలుకు నోచుకోవడం లేదని ఎద్దేవా చేశారు. దళితులకు మూడెకరాల భూపంపిణీ అడుగు ముందుకు పడడం లేదన్నారు. పార్టీకి విధేయతగా ఉన్నవారందరికీ సముచిత పదవులు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నగేశ్ మాట్లాడారు. అనంతరం అక్షయ్ యాదవ్, పిల్లిట్ల శంకర్, పిల్లిట్ల కుమారస్వామి, సంపతి శ్రీనివాస్‌లు 50 మంది అనుచరులతో వైఎస్సార్సీపీలో చేరారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి సొల్లు అజయ్‌వర్మ, రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి సిరి రవి, కార్యదర్శి దుబ్బాక సంపత్, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు గండి శ్యామ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోగె పద్మ, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు బండమీది అంజయ్య, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సలీం పాల్గొన్నారు. -
పెండింగ్‌లో లక్ష దరఖాస్తులు
ఉపకారవేతనాల అప్లికేషన్ల పరిశీలనలో కళాశాలల తాత్సారం సాక్షి, హైదరాబాద్: నిధుల విడుదలలో ప్రభుత్వం జాప్యానికి తోడు కళాశాల యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరి విద్యార్థులకు శాపంగా మారింది. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన దరఖాస్తులను సకాలంలో పరిశీలించకపోవడంతో వారికి లబ్ధి ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించి సంక్షేమ శాఖలు విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజులను పంపిణీ చేస్తోంది. కానీ పలు కళాశాలలు గతేడాదికి సంబంధించి పూర్తిస్థాయిలో దరఖాస్తులను కూడా సంక్షేమాధికారులకు సమర్పించకపోవడంతో వారికి స్కాలర్షిప్లు అందకుండాపోయాయి. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కేటగిరీలకు చెందిన లక్షమంది విద్యార్థులు ఉపకార వేతనాలకు నోచుకోలేకపోయారు. సాధారణంగా ఈపాస్ వెబ్సైట్లో వచ్చిన స్కాలర్షిప్ దరఖాస్తును వెంటనే సంబంధిత కళాశాల యాజమాన్యం పరిశీలించి, వాటిని సంక్షేమ శాఖ అధికారికి పంపాలి. ముందుగా వచ్చిన దరఖాస్తులను సమర్పించినప్పటికీ... ఆ తరువాత వచ్చినవాటిని మాత్రం కళాశాలలు పట్టించుకోలేదు. గత విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 14.11 లక్షల మంది ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ఇప్పటివరకు 12.3 లక్షల దరఖాస్తులు కాలేజీలు పరిశీలించి సంక్షేమ శాఖకు చేరవేశాయి. మరో 80 వేల దరఖాస్తులు కాలేజీ స్థాయిలోనే తిరస్కరణకు గురికాగా, 1.01 లక్షల దరఖాస్తులు మాత్రం కాలేజీల వద్ద పెండింగ్‌లో ఉండిపోయాయి. నిలిచిన ఈపాస్ సేవలు... ఈ విద్యాసంవత్సరంలో ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం రూ.300 కోట్లు విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సంక్షేమాధికారులకు పంపితే తప్ప కాలేజీలకు ఈ నిధులు అందే అవకాశం లేదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఈపాస్ వెబ్సైట్లో సేవలు నిలిచిపోయాయి. దీంతో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించే వీలు లేకుండా పోయింది. రెండు వారాల్లో ఈపాస్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఆ తరువాత నిధుల లభ్యతను బట్టి వారికి ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేస్తారు. -
విద్యార్థుల వెంటే కాంగ్రెస్
‘‘ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు రాబట్టుకొనే వరకు విద్యార్థుల వెంటే కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ ఉంటాయని పీసీసీ చీఫ్ ఉత్తం కుమార్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి కుంతియా, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ ఆల్ ఇండియా చైర్మన్ కొప్పుల రాజులు మూకుమ్మడిగా పేర్కొన్నారు. ఆర్మూరులో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామీణ విద్యార్థి యువ గర్జనకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. దాదాపు 200 మోటార్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. -ఆర్మూరు -
‘ఫీజు’ గోడు పట్టదా?
• ఏపీ ట్రిపుల్ ఐటీల్లో తెలంగాణ విద్యార్థుల పాట్లు • ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయని ప్రభుత్వం • కోర్సు ముగిసినా సర్టిఫికెట్లు ఇవ్వని యాజమాన్యాలు సాక్షి, హైదరాబాద్: వారంతా సరస్వతీ పుత్రులు.. కష్టపడి చదివి ట్రిపుల్ఐటీల్లో సీట్లు సాధించారు.. మంచి మార్కులతో కోర్సులూ పూర్తి చేశారు.. కానీ ‘ఫీజు’ సమస్య వారి బంగారు భవిష్యత్తును చీకట్ల పాలు చేస్తోంది.. మంచి అవకాశాలు తలుపుతడుతున్నా అందుకోలేని దుస్థితిలో ముంచేస్తోంది.. ఒకరికి ఐఐటీలో సీటు వస్తే, మరొకరికి బహుళజాతి సంస్థలో ఉద్యోగం దక్కింది.. కానీ పైచదువు చదవలేరు, ఉద్యోగంలో చేరలేరు. రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడమే దీనికి కారణం. ఫీజులు చెల్లించకపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లోని ట్రిపుల్ఐటీల్లో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఒరిజినల్ సర్టిఫికెట్లు లేకపోవడంతో పైచదువులు చదవలేని, ఉద్యోగాల్లో చేరలేని పరిస్థితిలో విద్యార్థులు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. మూడేళ్లుగా.. గ్రామీణ పేద విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించేందుకు 2008లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం మూడు ట్రిపుల్‌ఐటీలను ఏర్పాటు చేసింది. రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ) పేరిట తెలంగాణలో బాసర, ఏపీలోని నూజివీడు, ఇడుపులపాయల్లో వాటిని నెలకొల్పింది. గ్రామీణ పేద విద్యార్థులకు పదో తరగతి తర్వాత ఇంటర్+ఇంజనీరింగ్ కలిపి ఆరేళ్ల పాటు ఇంటిగ్రేటెడ్ కోర్సు బోధిస్తారు. విద్యార్థులకు ఫీజును ప్రభుత్వమే చెల్లిస్తుంది. 2013 వరకు ప్రాంతాలతో సంబంధం లేకుండా విద్యార్థులు తమ అభీష్టం మేరకు తమకు సమీపంలోని ట్రిపుల్‌ఐటీలో చేరారు. అయితే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావడంతో రాష్ట్ర విద్యార్థులు బాసర ట్రిపుల్ఐటీకి పరిమితమయ్యారు. అయితే అప్పటికే నూజివీడు, ఇడుపులపాయల్లోని ట్రిపుల్ఐటీల్లో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు కూడా ఫీజు రీయింబర్స్‌మెంటు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇందుకు సంబంధించి నిధులు మాత్రం విడుదల చేయలేదు. గత రెండేళ్లుగా వాటిలోని రాష్ట్ర విద్యార్థులు కోర్సు పూర్తిచేసుకుని బయటకు వస్తున్నారు. కానీ ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు అందకపోవడంతో ట్రిపుల్‌ఐటీలు విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఫీజులు చెల్లిస్తేనే ఇస్తామని స్పష్టం చేశాయి. అసలే గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులు ఆ ఫీజులు చెల్లించలేక, ప్రభుత్వం ఫీజు నిధులు విడుదల చేయక ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ఆరు వందల మందికి పైగా.. రాష్ట్ర విభజనకు ముందు నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన విద్యార్థులకు బాసర ట్రిపుల్ఐటీ దూరం కావడంతో... నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలను ఎంపిక చేసుకునేవారు. ఇలా నాలుగేళ్ల పాటు ఏటా సగటున 150 మందికిపైగా ఈ రెండింటిలో ప్రవేశం పొందారు. ఇప్పుడా విద్యార్థులు కోర్సు పూర్తిచేసుకుని బయటకు వస్తున్నారు. ఇలా తెలంగాణ ఏర్పాటయ్యాక రెండు బ్యాచ్‌లకు చెందిన దాదాపు మూడు వందల మంది విద్యార్థులు ఇంటిగ్రేటెడ్ కోర్సు పూర్తి చేశారు. వారిలో కొందరు చివరి సంవత్సరంలో క్యాంపస్ సెలక్షన్లలో ఉద్యోగాలకు కూడా ఎంపికయ్యారు. అయితే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ట్రిపుల్‌ఐటీలు సర్టిఫికెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. అటు ఉద్యోగాలకు ఎంపికైనా సర్టిఫికెట్లు సమర్పించకపోవడంతో కంపెనీలు విధులకు హాజరుకానివ్వడంలేదు. ఫలితంగా ఉద్యోగాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ప్రస్తుతం మరో మూడు వందల మంది విద్యార్థులు నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీల్లో విద్యనభ్యసిస్తున్నారు. ఫీజు అంశంపై వారు కూడా ఆందోళన చెందుతున్నారు. ఫీజు కట్టలేని పరిస్థితి ట్రిపుల్ఐటీల్లో చేరిన విద్యార్థి ఇంటర్+ఇంజనీరింగ్ కలిపి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు చదవాల్సి ఉంటుంది. దీనికి ఏటా రూ.35 వేలు ఫీజు. అంటే ఆరేళ్లకు కలిపి రూ.2.1 లక్షలు. అయితే ట్రిపుల్ఐటీల్లో చేరే విద్యార్థుల్లో చాలా వరకు పేదలే ఉంటుండడంతో ఫీజులను ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితి బాగానే ఉన్నా... తెలంగాణ ఏర్పాటయ్యాక కొత్త సమస్య తలెత్తింది. ఏపీలోని ట్రిపుల్ఐటీల్లో చదువుతున్న తెలంగాణ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య వచ్చింది. చెల్లింపులపై ప్రభుత్వం ఆలస్యంగా నిర్ణయం తీసుకోవడం, బకాయిలు విడుదల చేయకపోవడంతో ఒక్కో విద్యార్థి సగటున రూ.లక్ష వరకు కళాశాలకు బకాయిపడ్డారు. దీంతో కోర్సులు పూర్తి చేసినా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. పేద కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులు కావడంతో ఫీజు కట్టలేని పరిస్థితి. అవకాశాలున్నా అందుకోలేని దుస్థితి అవకాశాలు తలుపు తడుతున్నా అందిపుచ్చుకోలేని పరిస్థితి ఖమ్మం జిల్లా సిరిపురానికి చెందిన తాళ్లూరి గోపిది. తండ్రి ఆటో డ్రైవర్, తల్లి రోజు కూలీ. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో గోపి సీటు సాధించాడు. 2016లో బీటెక్ పూర్తి చేశాడు. ఇటీవల గేట్ పరీక్ష రాసి 674 ర్యాంకు సాధించాడు. ఓవైపు ఐఐటీ తిరుచ్చిలో ఎంటెక్ సీటు, మరోవైపు ఐఐటీ మద్రాస్‌లో ఓ సీనియర్ ప్రొఫెసర్ వద్ద ప్రాజెక్టు అసోసియేట్‌గా ఉద్యోగం వచ్చాయి. కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల పైచదువులు చదవలేక ఉద్యోగంలో చేరాడు. అయితే ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో నూజివీడు ట్రిపుల్ఐటీ ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. ఉద్యోగంలో చేరిన చోట మాత్రం ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పిస్తేనే నెలవారీ వేతనం ఇస్తామని షరతు పెట్టారు. దీంతో మూడు నెలలుగా ఉద్యోగం చేస్తున్నా వేతనం అందుకోలేని పరిస్థితి నెలకొంది. అప్పు చేసి కట్టినా.. ఖమ్మం జిల్లా మధిరకు చిద్రాల సృజన చదువులో మేటి. తల్లి గృహిణి, తండ్రి టైలర్. పేద కుటుంబమైనా బాగా చదివి నూజివీడు ట్రిపుల్‌ఐటీలో సీటు సంపాదించింది. 2014లోనే కోర్సు పూర్తి చేసింది. క్యాంపస్ సెలక్షన్లో భాగంగా హైదరాబాద్‌లోని సాఫ్ట్వేర్ సంస్థలో ఉద్యోగం దక్కింది. అయితే ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పిస్తేనే ఉద్యోగమని సాఫ్ట్వేర్ కంపెనీ షరతు పెట్టింది. మరోవైపు చివరి రెండేళ్లకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంట్ రాకపోవడంతో ట్రిపుల్ఐటీ ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. దీంతో ఓ వడ్డీ వ్యాపారి వద్ద రూ.60 వేలు అప్పుచేసిన సృజన.. ఆ డబ్బును ట్రిపుల్‌ఐటీలో కట్టి ఒరిజినల్ సర్టిఫికెట్లు తీసుకుని, ఉద్యోగమిచ్చిన సంస్థకు సమర్పించింది. పేద కుటుంబం కావడంతో ఆ అప్పు ఇంకా తీర్చలేక, ఇప్పటికీ వడ్డీ కడుతున్నట్లు సృజన వాపోయింది. నెల రోజులకే ఆనందం ఆవిరి ఖమ్మం జిల్లాలోని నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థి సైదులు. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. నూజివీడు ట్రిపుల్‌ఐటీలో సీటు వచ్చింది. 2016లో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. క్యాంపస్ సెలక్షన్లో వుడ్ప్లే అనే ఫర్నీచర్ కంపెనీలో ఉద్యోగం దక్కించుకున్నాడు. ఇక ముందు బంగారు భవిష్యత్తేనని ఆనందపడ్డాడు. కానీ నెలరోజులకే పరిస్థితి తలకిందులైంది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో... ట్రిపుల్ ఐటీలో రూ.1.22 లక్షల ‘ఫీజు’ బకాయిలు పేరుకుపోయాయి. దాంతో ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు. సర్టిఫికెట్లు సమర్పిస్తేనే ఉద్యోగంలో కొనసాగాల్సి ఉంటుందని కంపెనీ తేల్చి చెప్పడంతో.. ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో తీవ్ర ఆందోళనలో కూరుకుపోయాడు. ఉద్యోగం వచ్చినా.. ఖమ్మం జిల్లా మధిరకు చెందిన టి.గోపి నూజివీడు ట్రిపుల్‌ఐటీలో సీటు సంపాదించాడు. 2016 నాటికి మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేశాడు. క్యాంపస్ సెలక్షన్లో ప్రముఖ బ్యాటరీల తయారీ సంస్థ అమరాన్లో ఉద్యోగానికి ఎంపికయ్యాడు. కానీ ఈ ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు. ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించాల్సిందేనని ఆ సంస్థ స్పష్టం చేసింది. అటు ‘ఫీజు’ బకాయిల కారణంగా ఒరిజినల్ సర్టిఫికెట్లు రాలేదు. దీనిపై నూజివీడు ట్రిపుల్ ఐటీతో పాటు గచ్చిబౌలిలోని కేంద్ర కార్యాలయంలోనూ సంప్రదించాడు. అధికారులెవరిని కలసినా ఫలితం రాలేదు. చివరికి టి.గోపి రెండో నెలలోనే ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. -
ఈపాస్‌లో ‘విద్యార్థి సేవ’లకు బ్రేక్!
నిలచిన ఉపకార, రీయింబర్స్మెంట్ దరఖాస్తు ప్రక్రియ.. కొత్త జిల్లాల నేపథ్యంలో వెబ్సైట్ పునరుద్ధరణ సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలు, రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఏర్పాటు చేసిన ఈపాస్ వెబ్సైట్లో ‘విద్యార్థి సేవల (స్టూడెంట్ సర్వీస్)’కు బ్రేక్ పడింది. ఫ్రెషర్స్‌తోపాటు రెన్యువల్ విద్యార్థులు తాజా విద్యా సంవత్సరానికి సంబంధించి దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. అయితే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు అందుబాటులోకి రావడంతో వెబ్సైట్లో ఈ సర్వీసులు నిలచిపోయాయి. కొత్త జిల్లాలు, మండలాల సమాచారాన్ని పాతవాటి నుంచి విడదీసి నూతన వివరాలను అప్లోడ్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తయితేనే దరఖాస్తుదారుడికి వివరాలు వెబ్‌పేజీలో ప్రత్యక్షమవుతాయి. అయితే వెబ్సైట్లో వివరాలు నమోదు చేయడంలో జాప్యం జరిగింది. దీంతో పాత వివరాల ప్రకారం దరఖాస్తు చేసుకునే వీలు లేనందున వెబ్సైట్లో విద్యార్థి సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఆరు రోజులుగా సర్వీసులకు బ్రేక్ వేయడంతో విద్యార్థులు సందిగ్ధంలో పడ్డారు. వచ్చే నెలాఖరుతో దరఖాస్తు గడువు ముగియనుంది. వెబ్సైట్లో సర్వీసులు నిలిచిపోవడం, ఎన్ని రోజుల్లో అందుబాటులోకి వస్తాయనే దానిపై స్పష్టత లేకపోవడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. కల్యాణలక్ష్మి పథకానికి సంబంధించిన సర్వీసులు సైతం నిలిచిపోయాయి. కాగా, విద్యార్థి సేవలు, కల్యాణలక్ష్మి సర్వీసులు తిరిగి ప్రారంభం కావాలంటే మరో వారం ఆగాల్సిందే. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల సమాచారాన్ని వెబ్సైట్లో నిక్షిప్తం చేసి.. వాటి పరిధిలోకి వచ్చే కళాశాలలు, హాస్టళ్ల సమాచారాన్ని విభజించి, జిల్లా అధికారులకు కొత్త లాగిన్ ఐడీ ఇవ్వాలి. ఇప్పటికే ఉన్న సమాచారాన్ని భద్రపర్చడంతోపాటు కొత్త జిల్లాల వారీగా విభజించాలి. ఈ ప్రక్రియ అంత సులువుగా జరిగేది కాదని, దీనికి కనిష్టంగా వారం సమయం పడుతుందని అధికారులు చెపుతున్నారు. -
ప్రభుత్వం మెడలు వంచుతాం
► రీయింబర్స్మెంట్ ఉద్యమాన్ని ప్రారంభించిన ఉత్తమ్ ► రాహుల్ గాంధీ చేతుల మీదుగా రాష్ట్రపతికి దరఖాస్తులు ► డిసెంబర్ 2న రాహుల్‌తో విద్యార్థుల సభ సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల ఫీజు రీయిం బర్స్‌మెంట్‌కోసం ప్రభుత్వం మెడలు వంచేవిధంగా ఉద్యమిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. విద్యార్థులకు రీయింబర్స్ చేయాలంటూ శుక్రవారం ఆయన శంషాబాద్‌లో ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సి.కుంతియా, ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజుతో కలసి దరఖాస్తుల ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యావ్యవస్థ అభివృద్ధి చెందుతుందని ఆశిస్తే, ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ చేయకపోవడంతో 3,200 ప్రైవేటు కాలేజీలు మూతపడే పరిస్థితి ఉందన్నారు. విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లిస్తామంటూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ హామీని ఇచ్చారని, అయినా అమలుచేయడం లేదని అన్నారు. పేద విద్యార్థులకు టీపీసీసీతో పాటు యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యూఐ అండగా ఉంటుందని ప్రకటిం చారు. ఫీజులను రీయింబర్స్ చేయాలనే విద్యార్థుల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా నెలరోజులపాటు దరఖాస్తులను తీసుకుంటామని తెలిపారు. డిసెంబర్ 2న విద్యార్థులతో భారీ బహిరంగసభ నిర్వహిస్తామని, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ సభకు హాజరవుతారని చెప్పారు. విద్యార్థుల నుంచి సేకరించిన దరఖాస్తులను రాహుల్‌గాంధీ చేతులమీదుగా రాష్ట్రపతికి అందిస్తామని ఉత్తమ్ ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రాధాన్యతలు అర్థంకావడంలేదా అని ప్రశ్నించారు. విద్యార్థులకు ఫీజులు, రైతులకు రుణమాఫీ చేయకుండా సచివాలయం, క్యాంపు కార్యాలయాలకు కోట్లు తగలేయడం ఎలాంటి ప్రాధాన్యతలో సీఎం కేసీఆర్ చెప్పాలన్నారు. కమీషన్లు వచ్చే కాంట్రాక్టు పనులకు ప్రతీ నెలా ఠంచనుగా బిల్లులు పోతున్నాయని, పేదలకు ఫీజులు మాత్రం ఇవ్వడంలేదని ఉత్తమ్ విమర్శించారు. విద్యార్థులతోనే తెలంగాణ వచ్చిందన్నది మరవద్దు: కుంతియా కుంతియా మాట్లాడుతూ, విద్యార్థుల ఉద్యమంతోనే తెలంగాణ వచ్చిందనే విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తుంచుకుంటే మంచిదని హెచ్చరించారు. సాగునీటి కాంట్రాక్టులు, మిషన్ భగీరథ వంటివాటితో వేలకోట్లను కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని ఆరోపిం చారు. కాంగ్రెస్ తెచ్చిన రీయింబర్స్మెంట్ పథకాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సంపత్, టి.రామ్మోహన్‌రెడ్డి, వంశీచందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మాగం రంగారెడ్డి, సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, కూన శ్రీశైలం, మల్రెడ్డి రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, పార్టీ నాయకులు మల్లు రవి, కార్తీక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ పుణ్యమే.. ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు మాట్లాడుతూ, అవసరంలేని సచివాలయ నిర్మాణానికి వందలకోట్లు ఖర్చుచేయాలనుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పేద విద్యార్థుల ఆక్రందనలు వినబడటం లేదా అని ప్రశ్నించారు. ప్రతీ విద్యార్థి చదువుకోవాలన్న మంచి ఆశయంతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని, ఎన్ని ఇబ్బం దులు వచ్చినా నిధుల విడుదలను ఆపలేదని గుర్తుచేశారు. విద్యార్థులకు కాంగ్రెస్‌పార్టీ అండగా ఉంటుందన్నారు. మాజీ మంత్రి డి.కె.అరుణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తన కుటుంబ సంపాదన తప్ప ప్రజలు, రైతులు, విద్యార్థులు కనిపించడంలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ కుటుంబం తప్ప రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరన్నారు. ప్రశ్నించిన వారిని అణగదొక్కాలనే కుటిల బుద్ధితో సీఎం వ్యవహరిస్తున్నారని అరుణ విమర్శించారు. కేసీఆర్ మెడలు వంచైనా ఫీజు రీరుుంబర్స్‌మెంట్ నిధులు రాబడతామని ఆమె వ్యాఖ్యానించారు. మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్మెంట్ లేక కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, ఇతర సిబ్బందికి యాజమాన్యాలు జీతా లు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. -
20 నుంచి కాంగ్రెస్ పోరుబాట
రుణమాఫీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ఉద్యమిస్తాం: ఉత్తమ్ కుమార్ సాక్షి, హైదరాబాద్: ‘రుణమాఫీ చేయండి సీఎం సారూ..’ అంటూ ఈ నెల 20 నుంచి పెద్దఎత్తున రైతులతో ఉద్యమిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు. టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ ముఖ్యులతో శుక్రవారమిక్కడ గాంధీభవన్‌లో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... రైతు, విద్యార్థి సమస్యలపై నెలరోజుల ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు. ఈ నెల 20న మహబూబాబాద్(మానుకోట) నుంచి రైతు ఉద్యమాన్ని రైతుగర్జనతో ప్రారంభిస్తామని చెప్పారు. రుణమాఫీ చేయాలంటూ రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, వాటిని సీఎం కార్యాలయానికి పంపుతామని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ఈ నెల 21న ఫీజు రీయంబర్స్మెంట్ చేయాలంటూ విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. అధికారంలోకి ఎలాగైనా రావాలనే దుర్బుద్ధితో అభూత కల్పనలు, అబద్ధాలు చెప్పి కేసీఆర్ రైతులను మోసం చేశారని ఉత్తమ్ విమర్శించారు. రుణమాఫీ చేయకపోవడంతో రాష్ట్రంలో 40 లక్షల మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రైతులను మోసం చేసిన సీఎంపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ‘‘అప్పుల బారిన పడి ఇప్పటికే దాదాపు 4 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడితే సీఎంకు కనిపించడంలేదు. పైగా రైతులు సంతోషంగా ఉన్నారని, పండుగలు చేసుకుంటున్నారని పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. కేంద్రం ఇచ్చిన రూ.700 కోట్లను కూడా కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు ఇచ్చారు. కాలేజీలకు ఫీజులను రీయింబర్స్ చేయకపోవడంతో 3 లక్షల మంది బోధనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది జీతాలు అందక తిప్పలు పడుతున్నారు. ఫీజులు వచ్చేదాకా సర్టిఫికెట్లు ఇచ్చేది లేదంటున్న కాలేజీల తీరుతో 14 లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు’’ అని ఉత్తమ్ పేర్కొన్నారు. ప్రతీ విద్యార్థి, రైతు నుంచి దరఖాస్తులు తీసుకోవాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ సమావేశంలో పీసీసీ మాజీ అధ్యక్షులు వి.హనుమంతరావు, పొన్నాల లక్ష్మయ్య, నేతలు మల్లు రవి, ఎం.కోదండరెడ్డి, పొన్నం ప్రభాకర్, సబితా ఇంద్రారెడ్డి, ఉద్దెమర్రి నర్సింహ్మారెడ్డి ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. -
ఫీజుల లెక్కల్లేవ్...!
ఇందూరు : జిల్లాలో ప్రతి సంవత్సరం వందలాది విద్యా సంస్థల్లో వేలాది మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం బోధన రుసుముల రూపంలో కోట్లాది రూపాయలను చెల్లిస్తోంది. ఈ నిధులను నేరుగా బీసీ సంక్షేమ శాఖ నుంచి విద్యార్థులు చదివే కళాశాలల బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతాయి. అయితే విద్యార్థులకు చెల్లిస్తున్న బోధన రుసుముల వివరాలను విద్యార్థుల వారీగా వినియోగపత్రాలను(యూసీ) సంబంధిత కళాశాల యాజమాన్యాలు బీసీ సంక్షేమ శాఖలో అందజేయాలి. ఈ నిబంధనలను కళాశాల యాజమాన్యాలు లెక్కచేయడం లేదు. ఇటు బీసీ సంక్షేమ అధికారులు, ఆడిట్ అధికారులు పట్టించుకోకపోవడంతో కళాశాల యాజమాన్యాలది ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. డ్రాపౌట్ విద్యార్థులను చూపిస్తూ కోట్లాది రూపాయలను జేబుల్లో వేసుకుంటున్నట్లు యూసీలు సమర్పించకపోవడంతో స్పష్టమవుతోంది. నాలుగేళ్లలో బోధన రుసుముల కింద చెల్లించిన కోట్లాది రూపాయలకు ప్రస్తుతం లెక్కలు లేకుండా పోయాయి. యూసీలను సమర్పించడంతో పాటు ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ 2013–14 సంవత్సరం నుంచి అమలవుతోంది. అయితే వినియోగపత్రాలు ఇవ్వడంలో కళాశాల యాజమాన్యాలు పారదర్శకంగా వ్యవహరించడం లేదు. ఇదే అదనుగా తీసుకొని జిల్లాలోని కొన్ని కళాశాలలు బోధన రుసుముల నిధులను పక్కదారి పట్టిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగేళ్లు రూ. 123.98 కోట్లు జిల్లాలో ప్రతి ఏటా సగటున 50 వేల మంది బీసీ విద్యార్థులకు బీసీ సంక్షేమ శాఖ నుంచి బోధన రుసుములను చెల్లిస్తోంది. గడిచిన నాలుగేళ్లలో జిల్లాకు రూ. 123.98 కోట్లు విడుదలయ్యాయి. అయితే ఇప్పటి వరకు రూ. 86.68 కోట్లు మాత్రమే కళాశాలలు వినియోగ పత్రాలు సమర్పించాయి. 2012–13 నుంచి 2014 వరకు రూ. 13.03 కోట్లకు వినియోగపత్రాలు లేకపోవడంతో వీటికి లెక్కలు లేకుండా పోయాయి. 2015–16 సంవత్సరానికి సంబంధించి బోధన రుసుములు విడుదలయి రెండు నెలలు కావస్తోంది. ఇంత వరకు ఒక్క కళాశాల కూడా వినియోగపత్రాలు సమర్పించలేదు. బీసీ సంక్షేమ అధికారులు కూడా ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆడిట్ జనరల్ అధికారులు అప్పుడప్పుడూ అభ్యంతరాలు చెబుతున్నా సిబ్బంది తమకేమీ పట్లనట్లు వ్యవహరిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం బోధన రుసుములు మంజూరు చేస్తున్నా అక్కడక్కడా కొన్ని విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా చెల్లింపులు ప్రారంభమైన తరువాత అక్రమాలకు కొంత అడ్డుకట్టపడినప్పటికీ వినియోగపత్రాలు సమర్పించడంలో కళాశాలల యాజమాన్యాలు తీవ్ర జాప్యం చేయడంతో ఈ నిధులు ఏమయ్యాయని సందేహాలు కలుగుతున్నాయి. రూ. 13.03 కోట్లు ఎక్కడ.. జిల్లాలో 2012–13 నుంచి 2014–15 వరకు రూ. 99.71 కోట్లు విడుదల కాగా రూ. 86.68 కోట్లకు వినియోగపత్రాలు వివిధ కళాశాలలు సమర్పించాయి. ఇంకా రూ. 13.03 కోట్లకు లెక్కలు లేకుండా పోయాయి. 2014–15 సంవత్సరంలో అధికంగా రూ. 12.81 కోట్లు ఉండడం విశేషం. ఈ నిధులకు వినియోగపత్రాలు సమర్పించకపోవడానికి గల కారణాలు అంతుచిక్కడం లేదు. కళాశాల యాజమాన్యాలతో బీసీ సంక్షేమ శాఖ అధికారులు కుమ్మక్కై బోధన రుసుముల నిధులను స్వాహా చేస్తున్నట్లు సమాచారం. అందుకే ప్రతి సంవత్సరం బోధన రుసుములపై కళాశాలల్లో తనిఖీలు నిర్వహించాల్సి ఉండగా నిలిపివేశారు. సకాలంలో యూసీలు సమర్పించని కళాశాలలపై ఆడిట్ విభాగం అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. తగ్గుతున్న శాతం జిల్లాలో గత నాలుగేళ్లలో విద్యార్థులకు అందుతున్న బోధన రుసుములు భారీగా తగ్గుతున్నాయి. నాలుగేళ్లలో 20,3,228 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా 17,9565 మంది విద్యార్థులకు బోధన రుసుములు మంజూరు అయ్యాయి. 2015–16లో 50,951 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా 34,668 మంది విద్యార్థులకు మాత్రమే బోధన రుసుములు మంజూరు అయ్యాయి. నాలుగేళ్లలో 23,663 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ బోధన రుసుములు అందలేదు. ఇందులో డబుల్ పీజీతో బోధన రుసుములు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. గతంలో బోధన రుసుములు ఉన్నత విద్య కోసం ఎన్నిసార్లు అయినా మంజూరు చేసేవారు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్య అభ్యాసనలో ఒక్క డిగ్రీకి మాత్రమే బోధన రుసుములు అందజేస్తోంది. ఈ నిబంధన ఉన్నత విద్యను అభ్యసించే నిరుపేద విద్యార్థులకు విఘాతంగా మారింది -
పైవేటు డిగ్రీకళాశాలల బంద్..
డిగ్రీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ ప్రైవేటు డిగ్రీ కళాశాలలు గురువారం బంద్ పాటించాయి. మలక్‌పేట్, చంపాపేట్, దిల్సుఖ్నగర్, సైదాబాద్‌లో పరిధిలో అన్ని కళాశాలలు స్వచ్ఛందంగా బంద్ పాటించాయి.ఈ సందర్భంగా కళాశాలల సిబ్బంది, విద్యార్థులు చంపాపేట చౌరస్తా నుంచి ఐఎస్ సదన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయాలని, లేకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఫీజురీయింబర్స్‌మెంట్ రాక అసంపూర్తిగా జరుగుతుండటంతో కళాశాలలు నిర్వహించడం భారంగా మారాయని కళాశాలల యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. ఈ ర్యాలీలో సుమారు 1500 మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
ఫీజు రీయింబర్స్ మెంట్ మరింత ఆలస్యం
అఫిలియేషన్ నిబంధనతో సమస్య సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల సమస్యకు ఇప్పట్లో పరిష్కారం దొరికే సూచనలు కనిపించడం లేదు. గత రెండేళ్ల ఫీజు బకాయిలు అందక విద్యార్థులతో పాటు, కాలేజీల యాజమాన్యాలూ ఇబ్బందులెదుర్కొంటున్నాయి. 2014-15, 2015-16కు సంబంధించిన ఫీజు బకాయిలను మొత్తంగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినా అది వాస్తవరూపం దాల్చడం లేదు. కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపు (ఆర్టీఎఫ్)నకు అనుసరిస్తున్న విధానంలో మార్పు వల్ల ఈ సమస్య మరి న్ని నెలలు కొనసాగే పరిస్థితి ఏర్పడింది. అప్పుడలా.. ఇప్పుడిలా... 2014-15 విద్యా సంవత్సరం వరకు కాలేజీల అనుబంధ గుర్తింపు (అఫిలియేషన్) వారీగా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఇచ్చేవా రు. అయితే 2015-16కు సంబంధించి కొత్త సమస్యలు ముందుకు రావడంతో కాలేజీల అఫిలియేషన్ కాకుండా, ఆయా కాలేజీల్లో కోర్సుల వారీగా అఫిలియేషన్ ఉంటేనే ఫీజు రీయింబర్స్చేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఈ పరిణామంతో కాలేజీలు, కోర్సు ల వారీగా అనుబంధ గుర్తింపును పరిశీలించడం అధికారులకు సమస్యగా మారింది. ముందు 2014-15 బకాయిలు చెల్లింపు ఈ నేపథ్యంలో 2014-15కు సంబంధించి ముందుగా కాలేజీలకు ఆర్టీఎఫ్, విద్యార్థులకు మెయింటెనెన్స్ ఫీజు ఈ నెలాఖరు లోగా చెల్లించనున్నారు. 2015-16కు సం బంధించి పూర్తి బకాయిల చెల్లింపునకు మరో రెండు, మూడు నెలలు పట్టవచ్చని సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. జూలై నుంచి నెల నెలా స్కాలర్షిప్.. ఇదిలా ఉండగా 2016-17 విద్యాసంవత్సరం మొదలయ్యాక జూలై నుంచి ఏ నెలకు ఆ నెల విద్యార్థులకు స్కాలర్షిప్లు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.