ఫీజుల లెక్కల్లేవ్‌...! | Fee | Sakshi
Sakshi News home page

ఫీజుల లెక్కల్లేవ్‌...!

Published Wed, Sep 14 2016 12:33 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM

ఫీజుల లెక్కల్లేవ్‌...! - Sakshi

ఫీజుల లెక్కల్లేవ్‌...!

ఇందూరు :
జిల్లాలో ప్రతి సంవత్సరం వందలాది విద్యా సంస్థల్లో వేలాది మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం బోధన రుసుముల రూపంలో  కోట్లాది రూపాయలను చెల్లిస్తోంది. ఈ నిధులను నేరుగా బీసీ సంక్షేమ శాఖ నుంచి విద్యార్థులు చదివే కళాశాలల బ్యాంకు ఖాతాల్లోకి జమ అవుతాయి. అయితే విద్యార్థులకు చెల్లిస్తున్న బోధన రుసుముల వివరాలను విద్యార్థుల వారీగా వినియోగపత్రాలను(యూసీ) సంబంధిత కళాశాల యాజమాన్యాలు బీసీ సంక్షేమ శాఖలో అందజేయాలి. ఈ నిబంధనలను కళాశాల యాజమాన్యాలు లెక్కచేయడం లేదు. ఇటు బీసీ సంక్షేమ అధికారులు, ఆడిట్‌ అధికారులు పట్టించుకోకపోవడంతో  కళాశాల యాజమాన్యాలది ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. డ్రాపౌట్‌ విద్యార్థులను చూపిస్తూ కోట్లాది  రూపాయలను జేబుల్లో వేసుకుంటున్నట్లు యూసీలు సమర్పించకపోవడంతో స్పష్టమవుతోంది. నాలుగేళ్లలో బోధన రుసుముల కింద చెల్లించిన కోట్లాది రూపాయలకు ప్రస్తుతం లెక్కలు  లేకుండా పోయాయి. యూసీలను సమర్పించడంతో పాటు ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియ 2013–14 సంవత్సరం నుంచి అమలవుతోంది. అయితే వినియోగపత్రాలు ఇవ్వడంలో కళాశాల యాజమాన్యాలు పారదర్శకంగా వ్యవహరించడం లేదు. ఇదే అదనుగా తీసుకొని జిల్లాలోని కొన్ని కళాశాలలు బోధన రుసుముల నిధులను పక్కదారి పట్టిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
నాలుగేళ్లు రూ. 123.98 కోట్లు
జిల్లాలో ప్రతి ఏటా సగటున 50 వేల మంది బీసీ విద్యార్థులకు బీసీ సంక్షేమ శాఖ నుంచి బోధన రుసుములను చెల్లిస్తోంది. గడిచిన నాలుగేళ్లలో జిల్లాకు రూ. 123.98 కోట్లు విడుదలయ్యాయి. అయితే ఇప్పటి వరకు రూ. 86.68 కోట్లు మాత్రమే కళాశాలలు వినియోగ పత్రాలు సమర్పించాయి. 2012–13 నుంచి 2014 వరకు రూ. 13.03 కోట్లకు వినియోగపత్రాలు లేకపోవడంతో వీటికి లెక్కలు లేకుండా పోయాయి. 2015–16 సంవత్సరానికి సంబంధించి బోధన రుసుములు విడుదలయి రెండు నెలలు కావస్తోంది. ఇంత వరకు ఒక్క కళాశాల కూడా వినియోగపత్రాలు సమర్పించలేదు. బీసీ సంక్షేమ అధికారులు కూడా ఈ విషయాన్ని  పెద్దగా పట్టించుకోవడం లేదు. ఆడిట్‌ జనరల్‌ అధికారులు అప్పుడప్పుడూ అభ్యంతరాలు చెబుతున్నా సిబ్బంది తమకేమీ పట్లనట్లు వ్యవహరిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం బోధన రుసుములు మంజూరు చేస్తున్నా అక్కడక్కడా కొన్ని విద్యాసంస్థలు విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు ప్రారంభమైన తరువాత అక్రమాలకు కొంత అడ్డుకట్టపడినప్పటికీ వినియోగపత్రాలు సమర్పించడంలో కళాశాలల యాజమాన్యాలు తీవ్ర జాప్యం చేయడంతో ఈ నిధులు ఏమయ్యాయని సందేహాలు కలుగుతున్నాయి.
రూ. 13.03 కోట్లు ఎక్కడ..
జిల్లాలో 2012–13 నుంచి 2014–15 వరకు  రూ. 99.71 కోట్లు విడుదల కాగా రూ. 86.68 కోట్లకు వినియోగపత్రాలు వివిధ కళాశాలలు సమర్పించాయి. ఇంకా రూ. 13.03 కోట్లకు లెక్కలు లేకుండా పోయాయి. 2014–15 సంవత్సరంలో అధికంగా రూ.  12.81 కోట్లు  ఉండడం విశేషం. ఈ నిధులకు వినియోగపత్రాలు సమర్పించకపోవడానికి గల కారణాలు అంతుచిక్కడం లేదు. కళాశాల యాజమాన్యాలతో బీసీ సంక్షేమ శాఖ అధికారులు కుమ్మక్కై బోధన రుసుముల నిధులను స్వాహా చేస్తున్నట్లు సమాచారం. అందుకే ప్రతి సంవత్సరం బోధన రుసుములపై కళాశాలల్లో తనిఖీలు నిర్వహించాల్సి ఉండగా నిలిపివేశారు. సకాలంలో యూసీలు  సమర్పించని కళాశాలలపై ఆడిట్‌ విభాగం అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. 
తగ్గుతున్న శాతం
జిల్లాలో గత నాలుగేళ్లలో విద్యార్థులకు అందుతున్న బోధన రుసుములు భారీగా తగ్గుతున్నాయి. నాలుగేళ్లలో 20,3,228  మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా 17,9565 మంది విద్యార్థులకు బోధన రుసుములు మంజూరు అయ్యాయి. 2015–16లో 50,951 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకోగా 34,668 మంది విద్యార్థులకు మాత్రమే బోధన రుసుములు మంజూరు అయ్యాయి. నాలుగేళ్లలో  23,663 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ బోధన రుసుములు అందలేదు. ఇందులో డబుల్‌ పీజీతో బోధన రుసుములు కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. గతంలో  బోధన రుసుములు ఉన్నత విద్య కోసం ఎన్నిసార్లు అయినా మంజూరు చేసేవారు. తెలంగాణ ప్రభుత్వం ఉన్నత విద్య అభ్యాసనలో ఒక్క డిగ్రీకి మాత్రమే బోధన రుసుములు అందజేస్తోంది. ఈ నిబంధన  ఉన్నత విద్యను అభ్యసించే నిరుపేద విద్యార్థులకు  విఘాతంగా మారింది 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement