’సర్వీస్’ దోపిడీ
Published Thu, Mar 2 2017 12:05 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM
– ఇంటర్ కాలేజీల నయా దందా
– విద్యాపన్ను అంటూ రూ.1200 వసూలు
– రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందంటూ బుకాయింపు
– పరీక్షకు ముందు వసూళ్ల పర్వం
సాక్షి, రాజమహేంద్రవరం : ఇంటర్ పరీక్షలకు ముందు కొన్ని కార్పొరేట్ కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి వసూళ్ల పర్వానికి తెరతీశాయి. హాజరు శాతం తగ్గిందన్న పేరుతో పరీక్షకు ఒక్కరోజు ముందు నిబంధనలకు విరుద్ధంగా రూ.2,000 వరకు వసూలు చేసిన వైనం మంగళవారం వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. అడిగినంతా కట్టకపోతే హాల్‌టిక్కెట్లు ఇవ్వబోమని చెబుతుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు డబ్బులు కట్టేస్తున్నారు. హాజరు దోపిడీ ఇలా సాగిస్తున్న కార్పొరేట్ కాలేజీలు ‘విద్యాపన్ను’ పేరిట వసూలు చేస్తున్న విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. సర్వీస్ టాక్స్ అంటూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థుల నుంచి రూ.1200 చొప్పున వసూలు చేస్తున్నారు. అదీ హాల్‌టిక్కెట్లు ఇచ్చే ముందు ఈ తంతు కొనసాగిస్తున్నారు. ఇదేమిటీ అని అడిగిన వారికి సర్వీస్ టాక్స్ అంటూ కాలేజీ సిబ్బంది సమాధానమిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి విద్యాపన్ను పేరిట రూ.1200 చెల్లించాలని చెబుతున్నారు. ఈ విషయంపై విద్యార్థుల తల్లిదండ్రులకు, కాలేజీ సిబ్బందికి వాగ్వాదాలు చోటు చేసుకున్నాయి. రాజమహేంద్రవరంలోని కొన్ని కార్పొరేటర్ కాలేజీల్లో విద్యార్థుల నుంచి సర్వీస్ టాక్స్ పేరిట రూ.1200 వసూలు చేస్తున్నారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో హాల్‌టిక్కెట్లు ఇచ్చే ముందు కాలేజీ యాజమాన్యాలు ఈ విధంగా వ్యవహరిస్తుండడంతో విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతింటోంది. పరీక్షలకు ముందు డబ్బుల కోసం పిల్లలను ఇలా వేధించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఇంటర్ రెండో ఏడాది పరీక్షలకు హాజరు కావాల్సిన తన కుమార్తెకు హాల్‌టిక్కెట్టు ఇవ్వకుండా కాలేజీ యాజమాన్యం ఇబ్బంది పెట్టిందని, చివరికి రూ.1200 కడితేనే గాని హాల్‌టిక్కెట్టు ఇవ్వలేదని రాజమహేంద్రవరం నగరానికి చెందిన విద్యార్థిని తండ్రి దివ్యాంగుడైన ఎ.తారకేశ్వరరావు వాపోయారు.
ఎలాంటి పన్నూ లేదు...
విద్యాపన్ను వసూలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయలేదు. అలా ఎవరైనా వసూలు చేస్తున్నట్టయితే విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రులు మాకు ఫిర్యాదు చేయాలి. అలా చేస్తున్న వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. ఫీజుల వసూళ్లకు సంబంధించి ఏవైనా పెండింగ్ ఉంటే టీసీ ఇచ్చే సమయంలో వసూలు చేసుకోవాలని కాలేజీలకు చెప్పాం. హాల్‌టిక్కెట్లు ఇచ్చే సమయంలో ఈ విధంగా చేసి విద్యార్థులను ఇబ్బందులు పెట్టొద్దని స్పష్టం చేశాం.
– ఎ.వెంకటేష్, ఆర్‌ఐవో, రాజమహేంద్రవరం.
Advertisement
Advertisement