ఫీజులు పైపైకి | fees to be hike in engineering courses | Sakshi
Sakshi News home page

ఫీజులు పైపైకి

Published Mon, Jan 18 2016 1:35 AM | Last Updated on Mon, Oct 1 2018 5:40 PM

ఫీజులు పైపైకి - Sakshi

ఫీజులు పైపైకి

ఇంజనీరింగ్, ఫార్మసీ కాలేజీల్లో భారీగా పెరగనున్న ఫీజులు
 
* కనీసంగా 15 శాతం పెంపునకు కసరత్తు
* కాలేజీల ఆదాయ వ్యయాలను బట్టి గరిష్ట ఫీజు
* 2016-17 నుంచి మూడేళ్ల పాటు వసూలు చేసే ఫీజుల నిర్ణయానికి కసరత్తు
* కాలేజీల ఆదాయ, వ్యయాల సమర్పణకు
* 22వ తేదీతో ముగియనున్న గడువు
* వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఫీజులు భారమే

 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ తదితర వృత్తి విద్యా కాలేజీల్లో ఫీజులు భారీగా పెరగనున్నాయి. ఇప్పటివరకు వసూలు చేస్తున్న ఫీజులపై వచ్చే విద్యా సంవత్సరం నుంచి (2016-17) కనిష్టంగా 15%, గరిష్టంగా కాలేజీ ఆదాయ వ్యయాలను బట్టి ఫీజు పెరగనుంది. 2016-17 నుంచి 2018-19 వరకు (మూడేళ్ల పాటు) వృత్తి విద్యా కాలేజీల్లో వసూలు చేసే ఫీజుల ఖరారు కోసం ‘ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్సీ)’ ప్రస్తుతం యాజమాన్యాల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో మూడేళ్ల కింద ఏఎఫ్‌ఆర్సీ నిర్ణయించిన ఫీజుల గడువు ప్రస్తుత విద్యా సంవత్సరంతో ముగియనుండడంతో ఈ చర్యలు చేపట్టింది. అయితే ఏటా 5 శాతం ద్రవ్యోల్బణం ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ఫీజుల్లో కనీసం 15 శాతం పెంపు మొదటి సంవత్సరం నుంచే ఉండనుంది. ఇక కాలేజీల ఆదాయ వ్యయాలను బట్టి ఫీజు గరిష్టంగా పెరగనుంది. దీంతో మొత్తానికి ఇటు ప్రభుత్వంతోపాటు అటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులపైనా 2016-17 విద్యా సంవత్సరం నుంచి ‘ఫీజు’ భారం పడనుంది.

 కనీస ఫీజు తీసుకుంటున్నవాటిలోనూ పెంపు!
 ప్రస్తుతం రాష్ట్రంలో 266 ఇంజనీరింగ్ కాలేజీలు ఉండగా టాప్, ఓ మోస్తరు కాలేజీలు మినహా మిగతా 150కి పైగా కాలేజీల్లో కనీస ఫీజు అమలవుతోంది. ఆ కాలేజీల యాజమాన్యాలు 2013-14 నుంచి 2016-17 వరకు ఫీజుల పెంపు కోసం ప్రతిపాదనలు ఇవ్వలేదు. తమ కాలేజీల్లో లోపాలున్న కారణంగా అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి... రూ. 35 వేల కనీస ఫీజు తీసుకునేందుకు అంగీకరించాయి. ప్రస్తుతం ఆయా కాలేజీలు కూడా తమ ఆదాయ వ్యయాలను బట్టి ఫీజుల పెంపును కోరేందుకు సిద్ధమవుతున్నాయి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రమాణాల పెంపు కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

లోపాలున్న కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చేందుకు జేఎన్టీయూహెచ్ నిరాకరించింది. దీంతో ఆయా కాలేజీల యాజమాన్యాలు నిధులు వెచ్చించి ల్యాబ్‌లు, కంప్యూటర్లు, లైబ్రరీ సహా ఇతర సౌకర్యాలను, ఫ్యాకల్టీని సమకూర్చుకున్నాయి. తాజాగా ఈ వ్యయాన్ని, ఆదాయ వ్యయాలను చూపి ఎక్కువ మొత్తంలో ఫీజు పెంపు కోరేందుకు ఈ కాలేజీలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు జాతీయ స్థాయి విద్యాసంస్థలైన ఎన్‌ఐటీ, ఐఐటీల్లో ఫీజులను కేంద్రం ఏకంగా మూడింతలు పెంచేందుకు సిద్ధమైంది. ఫ్యాకల్టీల వేతనాలు, నిర్వహణ వ్యయం పెరిగిన కారణంగా.. ఫీజులు పెంచుతున్నామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనూ ఫీజులు భారీగా పెంచాలని ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు కోరుతున్నాయి.

 ముగుస్తున్న గడువు..
 వచ్చే మూడేళ్ల పాటు వృత్తి విద్యా కాలేజీల్లో వసూలు చేయాల్సిన ఫీజుల ఖరారు కోసం... ఆయా కాలేజీల ఆదాయ వ్యయాలను సమర్పించేందుకు ఏఎఫ్‌ఆర్సీ నవంబర్ 23న నోటిఫికేషన్ జారీ చేసింది. నెల రోజులు గడువిచ్చినా ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. గడువు పెంచాలన్న యాజమాన్యాల విజ్ఞప్తి మేరకు జనవరి 7వ తేదీ వరకు పొడిగించారు. ఆ తర్వాత మళ్లీ ఈనెల 22 వరకు గడువు పొడగించారు. అయితే ఇదే చివరి అవకాశమని, ఇకపై దరఖాస్తుల గడువు పొడగించేది లేదని ఏఎఫ్‌ఆర్సీ స్పష్టం చేసింది. ఇప్పటివరకు 20 కాలేజీల్లోపే తమ ఆదాయ వ్యయాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశాయి. గడువు ముగుస్తుండడంతో సోమవారం నుంచి కాలేజీలన్నీ దరఖాస్తులను అప్‌లోడ్ చేసే అవకాశం ఉంది.
 
ఫీజుల పెంపు ఉండే కాలేజీలు, సీట్ల వివరాలు
 కోర్సు        కాలేజీలు    సీట్లు
 ఇంజనీరింగ్    266      1,26,468
 ఫార్మసీ        145      11,438
 బీఈడీ        225      22,670
 ఎంఈ/ఎంటెక్    171     15,152
 ఎం ఫార్మసీ     130     7,820
 లా                17     2,850
 ఎంబీఏ        347     41,796
 ఎంసీఏ        49     2,966
 (మెడికల్, డెంటల్, నర్సింగ్ సీట్లు వీటికి అదనం)
 
కొన్ని ప్రధాన ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రస్తుత ఫీజులు..
 విద్యా సంస్థ    ఫీజు (రూ.లలో)
 సీబీఐటీ        1,13,300
 వాసవి         1,09,300
 వీఎన్‌ఆర్ విజ్ఞాన్‌జ్యోతి    97,500
 ఎంజేఐటీ            82,200
 ఎంవీఎస్‌ఆర్    83,100
 శ్రీనిధి            79,000
 గోకరాజు రంగరాజు    75,200
 కాకతీయ ఇనిస్టిట్యూట్(కిట్స్) 85,600

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement