ఫీజుకు బూజు | Fee mildew | Sakshi
Sakshi News home page

ఫీజుకు బూజు

Published Mon, Sep 29 2014 1:26 AM | Last Updated on Mon, Oct 1 2018 5:41 PM

ఫీజుకు బూజు - Sakshi

ఫీజుకు బూజు

ఫీజు బకాయి రూ.44.80 కోట్లు
 కర్నూలు(అృర్బన్): కొత్త ప్రభుత్వం కొలువుదీరి వంద రోజులు పూర్తయినా ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలపై దృష్టి సారించకపోవడం విమర్శలకు తావిస్తోంది. గత ఏడాదికి సంబంధించిన ఫీజుల విషయంలోనూ చొరవ చూపకపోవడంతో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. కళాశాలలు పునఃప్రారంభమై మూడు నెలలు గడుస్తున్నా జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన దాదాపు 41,442 మంది విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాల రూపంలో రూ.44.80 కోట్లు బకాయి పడింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సాకుగా చూపి దాటవేస్తుండటం పట్ల విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, మెడికల్, ఇంజనీరింగ్ తదితర ఉన్నత చదువులతో పాటు ఐటీఐ, పాలిటెక్నిక్, నర్సింగ్, బీఎడ్ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఉపకార వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. రెన్యూవల్ విద్యార్థులతో పాటు ఈ ఏడాది వివిధ కోర్సుల్లో చేరిన ఫ్రెష్ విద్యార్థులదీ అదే పరిస్థితి. జిల్లాలోని పలు కళాశాలల ప్రిన్సిపాళ్లు విద్యార్థులకు సంబంధించిన హార్డ్ కాపీలను పంపడంలో జాప్యం కూడా అర్హులైన విద్యార్థులకు శాపంగా మారుతోంది. దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, బడ్జెట్ విడుదల తదితర విషయాల్లో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కూడా ఫీజుల విషయంలో ప్రభావం చూపుతోంది. నిధుల విడుదలలో అలసత్వం కారణంగా ఆయా కోర్సులు పూర్తి చేసినప్పటికీ కళాశాలల యాజమాన్యాలు సర్టిఫికెట్లు అందించేందుకు సుముఖత చూపని పరిస్థితి నెలకొంది. మరికొన్ని యాజమాన్యాలు రెన్యూవల్ విద్యార్థులను ఫీజులు చెల్లించాలని.. ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే మీ ఫీజులు తిరిగిస్తామని నమ్మబలుకుతున్నట్లు తెలుస్తోంది. 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించి 3,550 మంది ఎస్సీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, మెయింటెనెన్స్ ఆఫ్ ట్యూషన్ ఫీజెస్ కింద రూ.4 కోట్ల బకాయి ఉంది. కాగా 1,030 మంది ఎస్సీ విద్యార్థులకు సంబంధించిన హార్డ్ కాపీలను పంపడంలో జిల్లాలోని వివిధ కళాశాలలు జాప్యం చేస్తున్నాయి. అదేవిధంగా 2012-13 ఏడాదికి సంబంధించి కూడా ప్రభుత్వం రూ.2 కోట్లు విడుదల చేయాల్సి ఉంది. జిల్లాలోని వివిధ కళాశాలల నుంచి 2013-14 విద్యా సంవత్సరానికి దాదాపు 600 మంది గిరిజన వర్గాలకు చెందిన విద్యార్థుల హార్డ్ కాపీలు నేటికీ అందకపోవడంతో అవసరమైన బడ్జెట్ ఉన్నా.. రూ.80 లక్షలను మంజూరు చేయలేని పరిస్థితి. జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న మైనార్టీ విద్యార్థులకు కూడా ఫీజును చెల్లించాల్సి ఉంది. 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించి 13,834 మంది విద్యార్థులకు రూ.16 కోట్ల బకాయి ఉండటం గమనార్హం.
 బీసీ, ఈబీసీలకు రూ.24 కోట్ల బకాయి
 17,573 మంది బీసీ విద్యార్థులకు 2013-14 విద్యా సంవత్సరానికి సంబంధించి రూ.14 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్.. 5,985 మంది ఈబీసీ విద్యార్థులకు ఫీజు కింద రూ.10 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అలాగే 2012-13 సంవత్సరానికి సంబంధించి 770 మంది బీసీ విద్యార్థుల ఫీజుకు రూ.85 లక్షలు, 120 మంది ఈబీసీ విద్యార్థుల ఫీజుకు రూ.35 లక్షలు కూడా ప్రభుత్వం బకాయి పడింది. బీసీ, ఈబీసీ విద్యార్థులకు సంబంధించి అనేక కళాశాలలు హార్డ్‌కాపీలను సకాలంలో అందించకపోవడం కూడా ఫీజు విడుదల జాప్యానికి కారణంగా తెలుస్తోంది.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement