పెండింగ్‌లో లక్ష దరఖాస్తులు
ఉపకారవేతనాల అప్లికేషన్ల పరిశీలనలో కళాశాలల తాత్సారం
సాక్షి, హైదరాబాద్: నిధుల విడుదలలో ప్రభుత్వం జాప్యానికి తోడు కళాశాల యాజమాన్యాల నిర్లక్ష్య వైఖరి విద్యార్థులకు శాపంగా మారింది. ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన దరఖాస్తులను సకాలంలో పరిశీలించకపోవడంతో వారికి లబ్ధి ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా 2015-16 విద్యాసంవత్సరానికి సంబంధించి సంక్షేమ శాఖలు విద్యార్థుల ఉపకారవేతనాలు, ఫీజులను పంపిణీ చేస్తోంది. కానీ పలు కళాశాలలు గతేడాదికి సంబంధించి పూర్తిస్థాయిలో దరఖాస్తులను కూడా సంక్షేమాధికారులకు సమర్పించకపోవడంతో వారికి స్కాలర్‌షిప్‌లు అందకుండాపోయాయి.
దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కేటగిరీలకు చెందిన లక్షమంది విద్యార్థులు ఉపకార వేతనాలకు నోచుకోలేకపోయారు. సాధారణంగా ఈపాస్ వెబ్‌సైట్లో వచ్చిన స్కాలర్‌షిప్ దరఖాస్తును వెంటనే సంబంధిత కళాశాల యాజమాన్యం పరిశీలించి, వాటిని సంక్షేమ శాఖ అధికారికి పంపాలి. ముందుగా వచ్చిన దరఖాస్తులను సమర్పించినప్పటికీ... ఆ తరువాత వచ్చినవాటిని మాత్రం కళాశాలలు పట్టించుకోలేదు. గత విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 14.11 లక్షల మంది ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో ఇప్పటివరకు 12.3 లక్షల దరఖాస్తులు కాలేజీలు పరిశీలించి సంక్షేమ శాఖకు చేరవేశాయి. మరో 80 వేల దరఖాస్తులు కాలేజీ స్థాయిలోనే తిరస్కరణకు గురికాగా, 1.01 లక్షల దరఖాస్తులు మాత్రం కాలేజీల వద్ద పెండింగ్‌లో ఉండిపోయాయి.
నిలిచిన ఈపాస్ సేవలు...
ఈ విద్యాసంవత్సరంలో ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ప్రభుత్వం రూ.300 కోట్లు విడుదల చేసింది. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను సంక్షేమాధికారులకు పంపితే తప్ప కాలేజీలకు ఈ నిధులు అందే అవకాశం లేదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఈపాస్ వెబ్‌సైట్లో సేవలు నిలిచిపోయాయి. దీంతో పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించే వీలు లేకుండా పోయింది. రెండు వారాల్లో ఈపాస్ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఆ తరువాత నిధుల లభ్యతను బట్టి వారికి ఉపకారవేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేస్తారు.