ప్రజావ్యతిరేక విధానాలు ఎండగడతాం
కరీంనగర్‌సిటీ: రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడుతూ అన్నివర్గాల ప్రజలకు అండగా ఉంటామని వైఎస్సార్‌సీపీ యువజన విభాగం తెలంగాణ అధ్యక్షుడు వెల్లాల రామ్మోహన్ అన్నారు. సోమవారం కరీంనగర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా యువత అధ్యక్షుడు కంది వెంకట రమణారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ విస్మరించి ప్రజలను మభ్యపెడుతోందని ఆరోపించారు. వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తోనే బడుగు, బలహీనవర్గాల విద్యార్థులు ఉన్నత విద్యనభ్యసించారని గుర్తు చేశారు. నేటి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయకుండా విద్యార్థులను రోడ్డుకీడ్చిందన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరుగార్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ సంక్షేమ వసతి గృహాల్లో కనీసం దుప్పట్లు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. రైతుల కోసం ఉచిత విద్యుత్‌తో పాటు మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్సార్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.
వైఎస్సార్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరాయని గుర్తు చేశారు. వైఎస్సార్ హయాంలో లక్షలాది ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి సొంతింటి కల నెరవేర్చారని, కేసీఆర్ ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇళ్ల హామీ రెండున్నరేళ్లు గడిచినా అమలుకు నోచుకోవడం లేదని ఎద్దేవా చేశారు. దళితులకు మూడెకరాల భూపంపిణీ అడుగు ముందుకు పడడం లేదన్నారు. పార్టీకి విధేయతగా ఉన్నవారందరికీ సముచిత పదవులు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నగేశ్ మాట్లాడారు. అనంతరం అక్షయ్ యాదవ్, పిల్లిట్ల శంకర్, పిల్లిట్ల కుమారస్వామి, సంపతి శ్రీనివాస్‌లు 50 మంది అనుచరులతో వైఎస్సార్‌సీపీలో చేరారు. సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి సొల్లు అజయ్‌వర్మ, రాష్ట్ర యువత ప్రధాన కార్యదర్శి సిరి రవి, కార్యదర్శి దుబ్బాక సంపత్, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు గండి శ్యామ్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోగె పద్మ, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు బండమీది అంజయ్య, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సలీం పాల్గొన్నారు.