కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది కంటితుడుపు చర్యే
వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రైతులను ఆదుకునే విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం కంటి తుడుపు చర్యలు చేపడుతు న్నాయని వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలది రైతులపై కపట ప్రేమన్నారు. మిర్చి రైతులను ఆదుకునేందుకు కేంద్రం ప్రకటించిన రూ.5 వేలు ఏమాత్రం సరిపోదన్నారు. రాష్ట్రంలో 7లక్షల మెట్రిక్ టన్నుల మిర్చి పండిస్తే, 33,700 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తే మిగతా రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. ఈ ధరతో ఎఫ్‌ఏక్యూ నాణ్యమైన మిర్చిని మాత్రమే కొనుగోలు చేయాలని నిబంధన విధించడం సరికాదన్నారు. ఎఫ్‌ఏక్యూ మిర్చి కాకుండా క్వాలిటీ లేని లేదా రంగు వెలిసిన మిర్చిని ఎవరు కొనుగోలు చేస్తారని ప్రశ్నించారు. కేవలం 33,700 మెట్రిక్ టన్నులకే సరిపె ట్టకుండా మిర్చి చివరి స్టాక్ వరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.