ప్రభుత్వం మెడలు వంచుతాం
► రీయింబర్స్‌మెంట్ ఉద్యమాన్ని ప్రారంభించిన ఉత్తమ్
► రాహుల్ గాంధీ చేతుల మీదుగా రాష్ట్రపతికి దరఖాస్తులు
► డిసెంబర్ 2న రాహుల్‌తో విద్యార్థుల సభ
సాక్షి, హైదరాబాద్: విద్యార్థుల ఫీజు రీయిం బర్స్‌మెంట్‌కోసం ప్రభుత్వం మెడలు వంచేవిధంగా ఉద్యమిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. విద్యార్థులకు రీయింబర్స్ చేయాలంటూ శుక్రవారం ఆయన శంషాబాద్‌లో ఏఐసీసీ కార్యదర్శి ఆర్.సి.కుంతియా, ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజుతో కలసి దరఖాస్తుల ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యావ్యవస్థ అభివృద్ధి చెందుతుందని ఆశిస్తే, ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయకపోవడంతో 3,200 ప్రైవేటు కాలేజీలు మూతపడే పరిస్థితి ఉందన్నారు. విద్యార్థులకు ఫీజు బకాయిలు చెల్లిస్తామంటూ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ హామీని ఇచ్చారని, అయినా అమలుచేయడం లేదని అన్నారు.
పేద విద్యార్థులకు టీపీసీసీతో పాటు యువజన కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐ అండగా ఉంటుందని ప్రకటిం చారు. ఫీజులను రీయింబర్స్ చేయాలనే విద్యార్థుల దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా నెలరోజులపాటు దరఖాస్తులను తీసుకుంటామని తెలిపారు. డిసెంబర్ 2న విద్యార్థులతో భారీ బహిరంగసభ నిర్వహిస్తామని, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈ సభకు హాజరవుతారని చెప్పారు. విద్యార్థుల నుంచి సేకరించిన దరఖాస్తులను రాహుల్‌గాంధీ చేతులమీదుగా రాష్ట్రపతికి అందిస్తామని ఉత్తమ్ ప్రకటించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రాధాన్యతలు అర్థంకావడంలేదా అని ప్రశ్నించారు. విద్యార్థులకు ఫీజులు, రైతులకు రుణమాఫీ చేయకుండా సచివాలయం, క్యాంపు కార్యాలయాలకు కోట్లు తగలేయడం ఎలాంటి ప్రాధాన్యతలో సీఎం కేసీఆర్ చెప్పాలన్నారు. కమీషన్లు వచ్చే కాంట్రాక్టు పనులకు ప్రతీ నెలా ఠంచనుగా బిల్లులు పోతున్నాయని, పేదలకు ఫీజులు మాత్రం ఇవ్వడంలేదని ఉత్తమ్ విమర్శించారు.
విద్యార్థులతోనే తెలంగాణ వచ్చిందన్నది మరవద్దు: కుంతియా
కుంతియా మాట్లాడుతూ, విద్యార్థుల ఉద్యమంతోనే తెలంగాణ వచ్చిందనే విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తుంచుకుంటే మంచిదని హెచ్చరించారు. సాగునీటి కాంట్రాక్టులు, మిషన్ భగీరథ వంటివాటితో వేలకోట్లను కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని ఆరోపిం చారు. కాంగ్రెస్ తెచ్చిన రీయింబర్స్‌మెంట్ పథకాన్ని టీఆర్‌ఎస్ ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు సంపత్, టి.రామ్మోహన్‌రెడ్డి, వంశీచందర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మాగం రంగారెడ్డి, సుధాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, కూన శ్రీశైలం, మల్‌రెడ్డి రంగారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేశ్, పార్టీ నాయకులు మల్లు రవి, కార్తీక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ పుణ్యమే..
ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు మాట్లాడుతూ, అవసరంలేని సచివాలయ నిర్మాణానికి వందలకోట్లు ఖర్చుచేయాలనుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పేద విద్యార్థుల ఆక్రందనలు వినబడటం లేదా అని ప్రశ్నించారు. ప్రతీ విద్యార్థి చదువుకోవాలన్న మంచి ఆశయంతో దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారని, ఎన్ని ఇబ్బం దులు వచ్చినా నిధుల విడుదలను ఆపలేదని గుర్తుచేశారు. విద్యార్థులకు కాంగ్రెస్‌పార్టీ అండగా ఉంటుందన్నారు.
మాజీ మంత్రి డి.కె.అరుణ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తన కుటుంబ సంపాదన తప్ప ప్రజలు, రైతులు, విద్యార్థులు కనిపించడంలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ కుటుంబం తప్ప రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా లేరన్నారు. ప్రశ్నించిన వారిని అణగదొక్కాలనే కుటిల బుద్ధితో సీఎం వ్యవహరిస్తున్నారని అరుణ విమర్శించారు. కేసీఆర్ మెడలు వంచైనా ఫీజు రీరుుంబర్స్‌మెంట్ నిధులు రాబడతామని ఆమె వ్యాఖ్యానించారు. మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్ లేక కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, ఇతర సిబ్బందికి యాజమాన్యాలు జీతా లు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు.