![ఖాతాదారుడికే క్యాష్!](/styles/webp/s3/article_images/2017/09/5/81483566400_625x300.jpg.webp?itok=7ReBlZCx)
ఖాతాదారుడికే క్యాష్!
సొంత బ్రాంచి ఖాతాదారులకే పరిమితమవుతున్న బ్యాంకు సేవలు
సాక్షి, హైదరాబాద్: సామాన్యుడిని నోట్ల కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. నోట్లు రద్దు చేసి 55 రోజులవుతున్నా సరిపడ నగదు అందక జనం ఇబ్బందులపాలవుతున్నారు. అటు బ్యాంకులు కూడా సొంత ఖాతాదారులకే సేవలను పరిమితం చేస్తున్నాయి. ఏటీఎంల్లో ఎక్కడా క్యాష్ అందుబాటులో ఉండడం లేదు. అక్కడక్కడ కొన్ని ఏటీఎంలు పనిచేస్తున్నా అందులో వేరే బ్యాంకుకు చెందిన కార్డుల ద్వారా డబ్బులు రావడం లేదు. దీంతో ఖాతాదారులంతా కచ్చితంగా తమ బ్యాంకుకు వెళ్లి డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. నెల ప్రారంభం కావడంతో వేతన జీవులు సైతం జీతం డబ్బు తీసుకునేందుకు బ్యాంకుల వద్ద పడిగాపులు కాస్తున్నారు.
బుధవారం హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకుల వద్ద భారీ క్యూలైన్లు కనిపించాయి. వారానికి రూ.24 వేలు తీసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ.. బ్యాంకుల వద్ద నగదు నిల్వలు లేకపోవడంతో ఖాతాదారులకు రూ.10 వేలతో సరిపెడుతున్నారు. హైదరాబాద్‌లోని దాదాపు అన్ని స్టేట్ బ్యాంకు శాఖల్లో ఖాతాదారులకు బుధవారం రూ.10 వేలే ఇచ్చారు. ఐసీఐసీఐ తదితర ప్రైవేటు బ్యాంకుల్లో మాత్రం మధ్యాహ్నం వరకు ఒక్కో ఖాతాదారుడికి రూ.24 వేలు ఇచ్చారు. గ్రామీణ ప్రాంత బ్యాంకుల్లో ఒక్కో ఖాతాదారుడికి రూ.4 వేలు, మండల కేంద్రాల్లోని బ్యాంకుల్లో రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు ఇస్తున్నారు.
బ్యాంకులకు తిరిగి రాని కొత్త నోట్లు
బ్యాంకుల్లో నగదు లావాదేవీల్లో డిపాజిట్లు, విత్‌డ్రాల నిష్పత్తి దాదాపు సమానంగా ఉంటుంది. ఈ నిష్పత్తిలో వ్యత్యాసం ఉంటేనే ప్రధాన కార్యాలయం లేదా ప్రధాన బ్రాంచి నుంచి నగదును తెచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే పెద్దనోట్ల రద్దుతో ఈ నిష్పత్తిలో భారీ వ్యత్యాసం వచ్చింది. పాతనోట్లు డిపాజిట్ చేసిన ఖాతాదారులంతా తిరిగి వాటిని తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నారు. డిపాజిట్ అయిన మొత్తంలో కేవలం 35 శాతం మాత్రమే బ్యాంకులకు కొత్త నోట్ల రూపంలో నగదు వచ్చింది. దీంతో బ్యాంకులు వాటినే ఖాతాదారులకు పంపిణీ చేస్తున్నారు. మార్కెట్‌లోకి చేరిన కొత్త నోట్లు బ్యాంకుల్లో జమకావడం లేదు.
మణికొండలోని ల్యాంకో హిల్స్ ఎస్‌బీఐలో నవంబర్ 8కి ముందు రోజుకు సగటున రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు డిపాజిట్ అయ్యేది. ప్రస్తుతం డిపాజిట్లు రూ.10 లక్షలు కూడా దాటడం లేదని బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి. అలాగే రాజేంద్రనగర్ ఎస్‌బీహెచ్‌లో రోజుకు రూ.60 లక్షల డిపాజిట్లు ఉండేవి. ఇప్పుడు కేవలం రూ.5 లక్షలు మాత్రమే వస్తున్నట్లు బ్యాంకు అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రతి రోజూ ప్రధాన బ్యాంకు నుంచి నగదును తెచ్చుకోవాల్సి వస్తోందని, దీంతో సెక్యూరిటీ ఇబ్బందులు తలెత్తుతున్నట్లు బ్యాంకర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఏటీఎంలలో క్యాష్ నిల్
ఏటీఎం మెషీన్లలో క్యాష్‌ను అందుబాటులో ఉంచేందుకు బ్యాంకులు ఆసక్తి చూపడం లేదు. దీంతో బ్యాంకుకు అనుసంధానంగా ఉన్న ఏటీఎంలు గత రెండు నెలలుగా మూతబడే ఉంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సంబంధించి 7,548 ఏటీఎంలున్నాయి. వీటిలో కొత్తనోట్లకు అనువుగా ఉండేలా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయడంతో పాటు క్యాష్‌ట్రేలు మార్చేశారు. కానీ క్యాష్ లేకపోవడంతో ఈ మెషీన్లు ఔటాఫ్ సర్వీస్, నో క్యాష్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. ఏటీఎం మెషీన్లలో నగదు అందుబాటులో ఉంచితే ఇతర బ్యాంకులకు చెందిన ఖాతాదారులు సైతం విత్‌డ్రా చేస్తారని బ్యాంకర్లు భావిస్తున్నారు. బ్రాంచికి చెందిన ఖాతాదారులకు నేరుగా నగదు ఇస్తే తమపై ఒత్తిడి తగ్గుతుందన్న ఉద్దేశంతో.. ఏటీఎం మెషీన్లలో నగదును పెట్టడం లేదు. ఈ నేపథ్యంలో బ్యాంకులకు సంతృప్తికర స్థాయిలో నగదు వచ్చిన తర్వాతే ఏటీఎం మెషీన్లు పనిచేసే అవకాశం ఉంది.