
మూడు రోజుల సెలవుల అనంతరం..
హైదరాబాద్: మూడు రోజుల వరుస సెలవుల అనంతరం మంగళవారం తెరుచుకున్న బ్యాంకులకు ప్రజలు పరుగులు తీశారు. దీంతో బ్యాంకులు, ఏటీఎం సెంటర్లు కిక్కిరిసిపోయాయి. సెలవులు ముగిశాయన్న సంబరంలో ఏటీఎంలకు వెళ్లిన ప్రజలకు ఇప్పటికీ చాలా చోట్ల నో క్యాష్ బోర్డులు కనిపిస్తుండటంతో వారు నిరాశగా వెనుదిరుగుతున్నారు. చేతిలో చిల్లిగవ్వ లేక సామాన్యుల ఇక్కట్లు అన్నీ ఇన్నీ కావు.
ఓ వైపు సామాన్య ప్రజలకు ఒక్క నోటు దొరక్క ఇబ్బందులు పడుతుంటే.. అధికారుల దాడుల్లో బడా బాబుల వద్ద కోట్లాది రూపాయల కొత్త నోట్లు దొరుకుతుండటంతో నోట్ల రద్దుపై అమలవుతున్న తీరుపై జనంలో పలు సందేహాలు వ్యక్తమౌతున్నాయి. నోట్ల కష్టాలు తొలగించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్న ప్రభుత్వ పెద్దల మాటలు కేవలం మాటలకే పరిమితమయ్యాయి అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.