పర్యాటక కేంద్రాల్లో ‘విజయ’ ఔట్‌లెట్లు
పశుసంవర్థక శాఖ మంత్రిగా తలసాని బాధ్యతల స్వీకరణ
సాక్షి, హైదరాబాద్: పర్యాటక కేంద్రాలు, దేవాలయ ప్రాంతాలు, జాతీయ రహదారులపై విజయ డెయిరీ ఉత్పత్తుల అమ్మకపు కౌంటర్ల(ఔట్‌లెట్లు)ను ఏర్పాటు చేస్తామని పశు సంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పశుసంవర్థకశాఖ మం త్రిగా శుక్రవారం సచివాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా తలసాని విలేకరులతో మాట్లాడుతూ విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు ప్రోత్సాహక బకాయిలు వీలైనంత త్వరలో విడుదల చేస్తామన్నారు. తమ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామన్నారు.
వెటర్నరీ పోస్టులను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారానే భర్తీ చేయాలని సర్కారు నిర్ణయించిందన్నారు. అయితే వెటర్నరీ వర్సిటీ ద్వారానే భర్తీ చేయాలన్న విద్యార్థుల సూచనపై ఆయా ప్రతినిధులతో చర్చిస్తామని చెప్పారు. గొర్రెల పెంపకందారులకు ఎన్‌సీడీసీ ద్వారా ఇచ్చే రుణాల మంజూరులో జాప్యాన్ని నివారిస్తామన్నారు. ఈ పథకం కోసం రూ. 398 కోట్లు సిద్ధంగా ఉన్నాయని... ఇందులో రుణం పొందినవారికి 20 శాతం సబ్సిడీని ప్రభుత్వం ఇస్తుందన్నారు. సమావేశంలో పశుసంవర్థకశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా, ఇన్‌చార్జి డెరైక్టర్ తిరుపతయ్య, విజయ డెయిరీ ఎండీ నిర్మల పాల్గొన్నారు.