ఉస్మానియాలో డిప్యూటీ సీఎం రాత్రి బస | Deputy Chief rajaiah visit to osmania hospital | Sakshi
Sakshi News home page

ఉస్మానియాలో డిప్యూటీ సీఎం రాత్రి బస

Published Tue, Dec 2 2014 1:43 AM | Last Updated on Tue, Oct 9 2018 7:11 PM

ఉస్మానియాలో డిప్యూటీ సీఎం రాత్రి బస - Sakshi

ఉస్మానియాలో డిప్యూటీ సీఎం రాత్రి బస

అఫ్జల్‌గంజ్: ‘‘రోగులను ఆస్పత్రిలోనికి తీసుకువచ్చేందుకు చైర్లు, స్ట్రెచర్లు లేవు.. ఆస్పత్రిలో పట్టించుకోవడం లేదు..ఒక వార్డునుంచి మరొక వార్డుకు తీసుకువెళ్లేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారు. తమను చిన్న చూపు చూస్తున్నారు’’ అంటూ రోగులు ఉపముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ పి.రాజయ్యకు ఫిర్యాదు చేశారు.

ఉస్మానియా ఆస్పత్రికి పూర్వవైభవం తీసుకువచ్చే కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సోమవారం రాజయ్య రాత్రి బస చేశారు. సాయంత్రం ఆరు గంటలకు చేరుకున్నారు.  రెండున్నర గంటలపాటు పలు వార్డుల్లో పర్యటించి రోగులకు అందుతున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు.  వైద్య సేవలను, పరికరాల పనితీరు, కల్పిస్తున్న వైద్య సదుపాయాలను పరిశీలించారు.

డీఎంఈ డాక్టర్ పుట్టా శ్రీనివాస్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘురాం, అదనపు సూపరింటెండెంట్ డాక్టర్ మైదలీ, ఆర్‌ఎంవో-1 డాక్టర్ అంజయ్యలతో పాటు కలిసి ఆస్పత్రి పాలక వర్గంలోని ఎంఎం-3 వార్డును సందర్శించారు.

తనను ఎలాగైనా బతికించాలని అనారోగ్యంతో ఐఎంసీ విభాగంలో చికిత్స పొందుతున్న వెంకటేశ్వర్లు ఉప ముఖ్యమంత్రిని వేడుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించాలని సూపరింటెండెంట్‌కు సూచించారు.

తన భర్తను బతికించాలని కాలేయ వ్యాధితో చికిత్స పొందుతున్న కరీంనగర్ జిల్లాకు చెందిన రాజయ్య భార్య బక్కమ్మ  ఉప ముఖ్యమంత్రి కాళ్లపై పడి వేడుకుంది. రక్తం ఇచ్చేందుకు బంధువులు సైతం ముందుకు రావడం లేదు. ఆస్పత్రి వైద్యులు రక్తం అందించేలా చేయాలని కోరింది. వెంటనే రక్తం అందజేయాలని వైద్యాధికారులకు సూచించారు.

కులీకుతుబ్‌షా భవనంలోని సిటీ సర్జరీ, కార్డియాలజీ పురుషుల విభాగం, డయాలజిస్ కేంద్రం, సిటీ ట్రాన్స్‌మెంటేషన్ విభాగాలను సందర్శించారు.  అక్కడ చికిత్స పొందుతున్న రోగులకు వైద్యం అందుతున్నతీరును పరిశీలించారు.

డయాలసిస్ కేంద్రం 3వ అంతస్తులో ఉండగా లిఫ్టు సౌకర్యం లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారని రాజయ్య దృష్టికి తీసుకువచ్చారు. లిఫ్టు ఏర్పాటు విషయాన్ని  పరిశీలించాలని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.

ఎఎన్‌ఎర్సీ, ఎఎంజీ వార్డులను సందర్శించి రోగులకు అందుతున్న వైద ్య సేవల వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఆర్‌ఎంవో కార్యాలయంలో సర్వీసు పీజీల సంఘం ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రికి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.

వసతి సౌకర్యాన్ని కల్పించాలని బీఎస్సీ నర్సింగ్ విద్యార్థినులు ఉప ముఖ్యమంత్రిని కోరారు.

ఆస్పత్రి లోపలికి తీసుకువచ్చేందుకు చైర్లు అందుబాటులో లేవని, స్ట్రచర్లకోసం వెళ్తే తిట్టుకుని ఇస్తున్నారని ఫిర్యాదు చేశారు.

ఎవరూ తమను పట్టించుకోవడం లేదని  ఒక వార్డునుంచి మరొక వార్డుకు తీసుకువెళ్లేందుకు డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదు చేశారు.

పెండింగ్ వేతనాలను చెల్లించాలని  కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బంది కోరారు.
 
‘కార్పొరేట్’కు దీటుగా ప్రభుత్వాస్పత్రులు
సాక్షి, సిటీబ్యూరో/అఫ్జల్‌గంజ్: కార్పొరేట్ ఆస్పత్రులకు దీటుగా ఉస్మానియా, గాంధీ ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దనున్నట్లు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్య చెప్పారు. ఆస్పత్రుల అభివృద్ధి కోసం తాజాగా ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్‌ను మార్చి చివరికల్లా ఖర్చు చేసి, సేవలను మెరుగుపరుస్తామన్నారు. ఆస్పత్రుల వారిగా వైద్య పరికరాల కొనుగోలు, కొత్త భవనాల నిర్మాణం, ఇతర అభివృద్ధి పనులకు సంబంధించిన  ప్రతిపాదనలను వారంలోగా పూర్తి చేసి, వెంటనే ఆయా వైద్య పరికరాల కొనుగోలుకు టెండర్లు ఆహ్వానించనున్నట్లు తెలిపారు.

నాసిరకమైన వస్తువులు కాకుండా నాణ్యమైన వైద్య పరికరాల కొనుగోలుకే అధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. వైద్యరంగంలో తెలంగాణ అస్థిత్వాన్ని కాపాడటంతో పాటు ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు భరోసా కల్పించేందుకు సోమవారం రాత్రి ఉస్మానియా జన రల్ ఆస్పత్రిలో బస చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలోని ఆయా వార్డులను సందర్శించారు. రోగులకు అందుతున్న వైద్య సేవలు, ఇబ్బందులపై ఆరా తీశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఉస్మానియా ఆస్పత్రిలో ఇప్పటికే మూత్ర పిండాల మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా జరుగుతున్నాయని, వైద్యుల కోరిక మేరకు త్వరలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలకు అనుమతులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఉస్మానియా ఆస్పత్రిలో పారిశుద్ధ్య పనులను మెరుగుపర్చి ఆస్పత్రిని అద్ధంలా తీర్చిదిద్దుతామన్నారు. ఆయా జిల్లాల కలెక్టర్లు, వైద్యాధికారులు, కో ఆర్డినేటర్లు రాత్రి బస కార్యక్రమంలో భాగంగా ఆయా ఆస్పత్రుల్లో పర్యటించి సమస్యలపై నివేదికలు తయారు చేయాలని సూచించారు.
 
కొత్త భవనం ఫైలు సీఎం వద్ద...
ఉస్మానియా ఆస్పత్రిలో నూతన భవన నిర్మాణంపై ఇంకా ఓ స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. దీన్ని చంచల్‌గూడ జైలు సమీపంలో నిర్మించాలా...లేక ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలో నిర్మించాలా అనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు. దీనికి సంబంధించిన ఫైలు సీఎం కేసీఆర్ వద్ద ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 500 మెడికల్ సీట్లు కొత్తగా వచ్చాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే చరిత్రలోనే మొదటిసారిగా తెలంగాణ ప్రభుత్వం ఆస్పత్రుల వారీగా భారీ బడ్జెట్‌ను కేటాయించిందని చెప్పారు.
 
కాలి గోటికి శస్త్రచికిత్స
డిప్యూటీ సీఎం రాజయ్య ఉస్మానియా ఆస్పత్రిలో బీపీ, షుగర్, ఈసీజీ పరీక్షలు చేయించుకున్నారు. క్యాజువాల్టీని సందర్శించిన అనంతరం ఆయన ఎంఓటీకి వెళ్లారు. కాలి బొటనవేలి గోరు గుచ్చుకోవడంతో ఇన్‌ఫెక్షన్ సోకిన  భాగానికి జనరల్ సర్జన్ డాక్టర్ నాగేందర్ శస్త్రచికిత్స చేశారు. మంగళవారం ఉదయం బీపీ, షుగర్ పరీక్షలతో పాటు లిక్విడ్ ప్రొఫైల్, కిడ్నీ, లివర్ పనితీరుకు సంబంధించిన పరీక్షలు కూడా చేయించుకోనున్నట్లు ఆయన చెప్పారు. మంత్రి వెంట డీఎంఈ పుట్టాశ్రీనివాస్‌తో పాటు సూపరింటిండెంట్ రఘురామ్, తెలంగాణ వైద్యుల సంఘం అధ్యక్షుడు రమేష్, ఉస్మానియా విభాగం అధ్యక్షుడు డాక్టర్ నాగేందర్ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement