జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట
హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ వ్యవస్థాపక వేడుకల్లో డిప్యూటీ సీఎం
సాక్షి, హైదరాబాద్: మీడియాకు ఎలాంటి సాయం చేయడానికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తెలిపారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటులో మీడియా కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. రాజకీయాలకు దూరంగా ఉంటేనే సమాజంలో విలువ పెరుగుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అభిప్రాయపడ్డారు.
ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణ ఆకాంక్ష త్వరలో నెరవే రుతుందని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని సమాచార శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమ నిధికి సంబంధించిన జీవో త్వరలో వెలువడనుందని పేర్కొన్నారు. రూ.100 కోట్లతో జర్నలిస్టుల కాలనీ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వచ్చేనెలలో లేదా ఆగస్టు మొదటి వారంలో 100 ఎకరాల్లో జర్నలిస్టుల కాలనీకి శంకుస్థాపన జరుగుతుందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో మీడియా పాత్ర కీలకమని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. కార్యక్రమంలో ఉత్తమ జర్నలిస్టు కవితకు సన్మానం చేశారు.