Mohammed Ali
-
‘ఉస్మానియా’ లోగోను ప్రభుత్వం మార్చలేదు
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ లోగోను తమ ప్రభుత్వం మార్చలేదని రాష్ట్ర హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. లోగోను టీఆర్ఎస్ ప్రభుత్వం మార్చిందని కొందరు నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సెక్యులర్ నాయకుడని, అన్ని మతాలను సమానంగా గౌరవించే వ్యక్తి అని పేర్కొన్నారు. లోగోపై నిగ్గు తేల్చే బాధ్యతలను ఉస్మానియా ఉర్దూ విభాగం అధిపతి ప్రొఫెసర్ ఎస్.ఎ.షుకూర్‌కు అప్పగించగా ఆయన పలు వివరాలు వెల్లడించారని తెలిపారు. 1951 సంవత్సరంలో లోగోలో కొంతమార్పు జరిగిందని, 1960లో లోగోను పూర్తిగా మార్చేశారని, ఐతే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉందని ఆయన పేర్కొన్నారు. 1960 సంవత్సరం తరువాత వర్సిటీ ధ్రువపత్రాలు ఉన్నవారు ‘లోగో’ను గమనించవచ్చని, నిరాధారమైన వార్తలను నమ్మవద్దని హోంమంత్రి ముహమ్మద్ మహమూద్ అలీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
పరిశుభ్రతతో వ్యాధులు దూరం: హోంమంత్రి
సాక్షి, హైదరాబాద్: వ్యక్తిగత పరిశుభ్రతతోనే వ్యాధులు దరిచేరవని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిమిషాలు శుభ్రతను పాటించాలన్న మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బంజారాహిల్స్‌లోని తన ఇంటి పరిసరాలను మహమూద్ అలీ శుభ్రంచేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఓవైపు కరోనా విజృంభణ, మరోవైపు సీజనల్ వ్యాధులు విస్తరిస్తున్న క్రమంలో అందరూ వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలని పిలుపునిచ్చారు. బయటికి వెళ్లేవారు తప్పకుండా మాస్కు, శానిటైజర్ వెంట తీసుకెళ్లాలని, సామాజిక దూరం పాటించాలని కోరారు. -
కరోనా కట్టడికే మే 7 వరకూ లాక్డౌన్
-
‘ఈనాడు’పై రూ.వెయ్యి కోట్ల దావా వేస్తాం
సాక్షి, హైదరాబాద్: పోలీసు శాఖపై నిరాధార కథనం ప్రచురించిన ‘ఈనాడు’పత్రిక బేషరతుగా పోలీసు శాఖకు క్షమాపణ చెప్పాలని, లేదంటే రూ.వెయ్యి కోట్లకు కోర్టులో దావా వేస్తామని హోంమంత్రి మహమూద్ అలీ హెచ్చరించారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం రాష్ట్ర పోలీస్ శాఖ అనేక సంస్కరణలతో ఉగ్రవాదాన్ని, తీవ్రవాదాన్ని అణచివేసి దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని, అలాంటి శాఖపై నిరాధార కథనాలతో బురదజల్లడం సబబు కాదన్నారు. అధికారుల పోస్టింగులు, బదిలీలపై కథనంలో పేర్కొన్నట్లుగా ఎవరెవరు ఎంత తీసుకున్నారో రుజువు చేయాలని డిమాండ్ చేశారు. ఆధారాలు లేని పక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. శనివారం లక్డీకాపూల్‌లోని తన కార్యాలయంలో మాట్లాడుతూ.. తెలంగాణ పురోగతిని జీర్ణించుకోలేని కొన్ని మీడియా సంస్థలు అక్కసు వెళ్లగక్కుతున్నాయని మండిపడ్డారు. ఇప్పటివరకు ఓపిక పట్టామని, ఇకపై కఠినంగా ఉంటామని చెప్పారు. అసత్య ప్రచారాలు చేస్తున్న పత్రికలు, చానళ్లను ఉపేక్షించబోమని ప్రకటించారు. హుస్నాబాద్ ఏకే47 మిస్సింగ్ కేసు విచారణ జరుగుతోందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. సివిల్ తగాదాల్లో పోలీసులు నేరుగా తలదూర్చట్లేదని స్పష్టం చేశారు. డిపార్ట్మెంట్ పూర్తి పారదర్శకంగా పనిచేస్తోంది: ఏడీజీ పోలీసుశాఖ పూర్తి పారదర్శకంగా, విధుల్లో రాజీపడకుండా 24 గంటలపాటు ప్రజాసంక్షేమం కోసం పాటుపడుతోందని అడిషనల్ డీజీ (లా అండ్ ఆర్డర్) జితేంద్ర అన్నారు. శనివారం డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసుశాఖలో అవినీతి అంటూ ఓ పత్రిక (సాక్షి కాదు)లో ప్రచురితమైన కథనం నిరాధారమని ఖండించారు. తమ శాఖపై ఎలాంటి అవినీతి, రాజకీయ ఒత్తిళ్లులేవని స్పష్టంచేశారు. డిపార్ట్మెంట్లో పోస్టింగులు, ట్రాన్స్ఫర్లు పూర్తి పారదర్శకంగా అధికారి ట్రాక్ రికార్డుపై ఆధారపడి జరుగుతున్నాయన్నా రు. ఆ కథనం పూర్తి నిరాధారమని, వారిపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. -
ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన కేంద్రం
సాక్షి, హైదరాబాద్ : ఏక కాలంలో లక్ష మంది ధ్యానం చేసేలా ‘హార్ట్ఫుల్నెస్’అనే సంస్థ అత్యాధునిక వసతులతో హైదరాబాద్ శివార్లలో నిర్మించిన ప్రపంచంలోనే అతి పెద్ద ధ్యాన కేంద్రం 28న ప్రారంభం కానున్నది. సంస్థ అంతర్జాతీయ మార్గదర్శకులు దాజీ ఈ కేంద్రాన్ని సంస్థ మొదటి మార్గదర్శి లాలాజీ పేరిట అంకితం చేస్తారు. 30 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ధ్యాన కేంద్రంలో సెంట్రల్ హాల్, మరో 8 అనుబంధ హాళ్లు ఉన్నాయి. ఈ నిర్మాణం రాత్రి వేళల్లో విద్యుద్దీపాల వెలుగులో సిడ్నీ హార్బర్‌తో పాటు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన కట్టడాలతో పోటీ పడుతుందని నిర్వాహకులు చెప్తున్నారు. ‘హార్ట్ఫుల్నెస్’75వ వార్షికోత్సవం సందర్భంగా జనవరి 28 నుంచి 30, ఫిబ్రవరి 2 నుంచి 4, ఫిబ్రవరి 7నుంచి 9వ తేదీ నడుమ జరిగే సమావేశాల్లో 1.2లక్షల మంది ధ్యానంలో పాల్గొంటారు. ఫిబ్రవరి 2న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, 7న అన్నా హజారే ధ్యాన సాధకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జనవరి 29న జరిగే కార్యక్రమంలో బాబా రాందేవ్ పాల్గొంటారు. 1400 ఎకరాల్లో విస్తరించిన ఈ ధ్యాన కేంద్రం 40వేలకు మందికి పైగా వసతి కల్పించడంతో పాటు, రోజుకు లక్ష మందికి వండి వార్చేలా వంట గది నిర్మించినట్లు సంస్థ మార్గదర్శి దాజీ వెల్లడించారు. 6 లక్షల మొక్కలతో నర్సరీ ఏర్పాటు చేశారు. త్వరలో 350 పడకల ఆయుష్ ఆస్పత్రి అందుబాటులోకి రానుంది. -
సీఏఏపై వెనక్కి తగ్గం
సాక్షి, హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై వెనక్కి తగ్గేది లేదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ స్పష్టంచేశారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన చట్టం దేశమంతటా వర్తిస్తుందని, భారత్‌లో అంతర్భాగమైన రాష్ట్రాలన్నీ ఈ చట్టాన్ని అమలు చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ‘హునర్ హాట్’ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నక్వీ మీడియాతో మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం వల్ల ఎవరి పౌరసత్వం కోల్పోయే పరిస్థితి ఉండదని, అయినా ఈ చట్టంపై విపక్షాలు అనవసరంగా తప్పుడు ప్రచారం సాగిస్తున్నాయన్నా రు. దేశంలోని ముస్లింలకు ఈ చట్టం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవని, అన్ని మతాల ప్రజలకు భద్రత ఉంటుందని స్పష్టం చేశారు. వాళ్లు సుపారీ గ్యాంగ్స్టర్లు... సీఏఏపై ప్రజలను తప్పుదోవ పటిస్తున్న గ్యాంగ్స్టర్లలో పోటీ నెలకొందని, వాళ్లు సుపారీ తీసుకొని హారర్ షో.. హారర్ హంగామా సృష్టిస్తున్నారని నక్వీ దుయ్యబట్టారు. పౌరసత్వ సవరణ చట్టం కొత్తదేమీ కాదని, గతంలోనూ ఈ చట్టానికి సవరణలు జరిగాయని గుర్తుచేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై అన్ని పార్టీలతో కూడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నివేదిక కూడా సమర్పించిందని, కానీ 2019లో 16వ లోక్‌సభ కాలపరిమితి ముగియడంతో సీఏఏ బిల్లు ఆమోదం పెండింగ్‌లో పడిందని గుర్తుచేశారు. పార్లమెంటులో సీఏఏకు మద్దతిచ్చిన పార్టీలు కూడా ఈరోజు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయని నక్వీ విమర్శించారు. జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) కార్యక్రమాలు అస్సాంలో తప్ప మరెక్కడా అమలు కావడం లేదన్నారు. జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్) నమోదు ప్రతి పదేళ్లకు ఒకసారి జరుగుతుందని, ఈ విషయంలో రాజకీయ నేతల ఉచ్చులో పడొద్దని ప్రజలకు నక్వీ పిలుపునిచ్చారు. సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. -
చౌకీదార్ కాదు.. జిమ్మేదార్ కావాలి
సాక్షి, మహబూబ్‌నగర్: ప్రధాని మోదీ లాంటి చౌకీదార్.. రాహుల్ లాగ టేకేదార్ వ్యక్తులు దేశానికి అవసరం లేదని.. జిమ్మేదార్ లాంటి సీఎం కేసీఆర్ అవసరమని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. మంగళవారం స్థానిక మోతీనగర్, మోటర్‌లైన్ ప్రాంతాల్లో నిర్వహించిన ఇంటింటి ప్రచారం, షాలీమార్ ఫంక్షన్హాల్లో నిర్వహించిన మైనార్టీల సమావేశంలో రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రజలను నేరుగా కలుస్తు టీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డిని గెలిపించాలని విజ్ఙప్తి చేశారు. అంతకుముందు మోతీనగర్‌లో ఏర్పాటుచేసిన సభలో హోంమంత్రి మహమూద్‌అలీ మాట్లాడుతూ.. జిల్లాకు ఇటీవల వచ్చిన ప్రధాని మోదీ నేను చౌకీదార్ అంటూ మా టలు చెప్పాడేగానీ జిల్లా గురించి ఏమీ మాట్లాడలేదని ఆరోపించారు. 70ఏళ్ల చరిత్రలో ముస్లింలు ఎక్కవ ఉన్న కశ్మీర్లో కూడా తెలంగాణలో అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో షాదీముబారక్ కింద లక్ష 24 వేల మందికి రూ.624కోట్లు ఖర్చు చేసినట్లు తె లిపారు. ఓ ముస్లింకు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగానే ఇతర పార్టీలు చూశాయని సీఎం కేసీఆర్ మాత్రమే ముస్లింల çబా ధలను తీర్చారని చెప్పారు. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మచ్చలేని వ్యక్తిత్వమని ఆయన్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేశంలోనే నంబర్‌వన్ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల ప్రజల సం క్షేమానికి కృషిచేస్తున్నారని, దేశంలోనే నంబర్ వన్ సీఎం కేసీఆర్ అని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఏర్పడనున్న ఫెడరల్ ఫ్రంట్‌తోనే దేశంలోని అన్ని వర్గాలకు స మన్యాయం లభిస్తుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో సాగుతున్నదని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడినప్పుడే ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న విషయాన్ని పొందుపరచడం జరిగిందని అన్నారు. 12 శా తం రిజర్వేషన్లకు టీఆర్ఎస్ కట్టుబడి ఉందని, అందుకే అసెంబ్లీ, మండలిలో బిల్లుపాస్ చేయించినట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ను మైనార్టీలు ఆదరించాలని పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. మహబూబ్‌నగర్ లో ఐటీపార్క్ ఏర్పడనుందని, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ‘పాలమూరు’కు జాతీయ హోదా పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటేనే పాలమూర్–రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా వస్తుందని రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ప్రధాని మోదీ వచ్చి జిల్లాకు ఒక్క హామీ కూడా ఇవ్వకుండా మోసం చేశారని, 2014 ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని ఇచ్చిన హామీ గురించి కూడా ప్రస్తావించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ, నల్లద్వారా మంచి నీల్లు ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరేనన్నారు. తమ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు బహుమతి ఇద్దామన్నారు. పట్టణంలో ముస్లింల శ్మశానవాటిక కోసం 15ఎకరాలు కేటాయించడం జరిగిందని అన్నారు. మైనార్టీలు ఇతర పార్టీల ప్రలోభాలకు లొంగవద్దని సూచించారు. -మంత్రి శ్రీనివాస్‌గౌడ్ -
బాత్రూమ్ కిటికీ నుంచి జంప్
నకిలీ పాస్‌పోర్టు కేసులో తప్పించుకున్న బ్రిటిషర్ ఢిల్లీ కోర్టు నుంచి హైదరాబాద్‌కు తీసుకొస్తుండగా ఘటన సాక్షి, హైదరాబాద్: నకిలీ పాస్‌పోర్టు, చీటింగ్ కేసుల్లో నిందితుడిగా ఉన్న బ్రిటన్ దేశస్తుడు మహ్మద్ అలీ రాష్ట్ర పోలీసుల కళ్లుగప్పి ఢిల్లీలోని రైల్వే స్టేషన్ బాత్రూమ్ కిటీకి నుంచి పరారయ్యాడు. స్కాట్లాండ్ పోలీసులకు పలు చీటింగ్ కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న అలీ నాలుగేళ్ల క్రితం నకిలీ పాస్పోర్టుతో హైదరాబాద్ వచ్చి బస చేశాడు. అప్పుడు టాస్క్‌ఫోర్స్ పోలీసులు అలీని అరెస్ట్ చేసి సీఐడీకి అప్పగించారు. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో విచారణ ఖైదీగా ఉన్న అతడిని ఢిల్లీలోని పాటియాల కోర్టులో పీటీ వారెంట్‌పై బుధవారం రాష్ట్ర సీఐడీ పోలీసులు హాజరు పరిచారు. తిరుగు ప్రయాణంలో భాగంగా ఢిల్లీలోని హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. బాత్రూమ్కు వెళ్లాలని చెప్పడంతో మహ్మద్ అలీని ఎస్కార్ట్ పోలీసులు తీసుకెళ్లారు. లోపలికి వెళ్లిన అతడు... బాత్రూమ్ కిటికీ నుంచి బయటకు దూకి తప్పిం చుకున్నట్టు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. ఢిల్లీలో అతడిని పట్టుకొనేందుకు సీఐడీ రెండు బృందాలను రంగంలోకి దింపింది. ఎస్కార్ట్‌గా వెళ్లిన నగర పోలీస్ ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించామని సిటీ పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. వేషాలు మార్చడంలో దిట్టయిన మహ్మద్ అలీని పట్టుకొనేందుకు ఢిల్లీ పోలీసులతో కలిసి రాష్ట్ర పోలీసులు వేట సాగిస్తున్నట్టు తెలిసింది. -
ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన
- రాష్ట్ర పథకాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు: మహమూద్ అలీ - అభివృద్ధిలో ప్రపంచ స్థాయిలో మా పోటీ - స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీ-ఫండ్ ఏర్పాటు చేస్తాం - కొత్త పారిశ్రామిక విధానం ఉత్తమ ఫలితాలు ఇస్తోంది: మంత్రి కేటీఆర్ - ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రసంగించిన నేతలు సాక్షి, హైదరాబాద్ : ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఫిక్కీ) జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపేం దుకు వివిధ రంగాలకు ప్రత్యేక పాలసీలను రూపొందించామని చెప్పారు. రెండేళ్ల పాలనలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు ప్రధాని మోదీ నుంచి సహా దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయన్నారు. అభివృద్ధి విషయంలో ప్రపంచ స్థాయి నగరాలతో తాము పోటీ పడుతున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. ‘స్మార్ట్‌సిటీస్’ అంశంపై ప్రసంగిస్తూ.. స్మార్ట్‌సిటీ అంటే పౌరులకవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించడమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 14 రంగాలకు ప్రాధాన్యం ఇస్తుండగా.. అందులో హైదరాబాద్ కేంద్రంగా మూడు ప్రధాన రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఐటీ, అనుబంధ సేవలతో పాటు భవిష్యత్ ఆవిష్కరణలకు అవకాశమున్న ఇన్నోవేషన్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, గేమింగ్, యానిమేషన్ తదితర రంగాల్లో భారీ వృద్ధికి అవకాశాలున్నాయని చెప్పారు. 200కు పైగా స్టార్టప్‌లతో టీ-హబ్ దేశంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్‌గా అవతరించిందని కేటీఆర్ వెల్లడించారు. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ‘టీ-ఫండ్’ ఏర్పాటు యోచనలో ఉన్నామని తెలిపారు. ఏడాదిలో 50వేల కోట్ల పెట్టుబడులు సింగపూర్, మలేసియా తదితర ఈశాన్య ఆసియా దేశాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన పారిశ్రామిక విధానం మంచి ఫలితాన్ని ఇస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. ఏడాది వ్యవధిలో 2,300పైగా పరిశ్రమలకు అనుమతులివ్వడం ద్వారా రూ.50వేల కోట్ల పెట్టుబడులు, 1.30 లక్షల మందికి ఉద్యోగాల కల్పన సాధ్యమైందన్నారు. బల్క్‌డ్రగ్, వ్యాక్సిన్ల తయారీలో హైదరాబాద్ ప్రపంచ వ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోందని... ఐదింట ఒక వంతు వ్యాక్సిన్లు ఇక్కడే తయారవుతున్నాయని చెప్పారు. లైఫ్ సెన్సైస్, ఫార్మా, ఏరోస్పేస్ రంగాల్లో హైదరాబాద్‌కున్న అనుకూలతలను మంత్రి కేటీఆర్ వివరించారు. ఫిక్కీ జాతీయాధ్యక్షుడు హర్షవర్ధన్ నియోటియా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఫిక్కీ సెక్రెటరీ జనరల్ దీదర్ సింగ్, ఫిక్కీ ఆంధ్ర, తెలంగాణ చైర్పర్సన్ సంగీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీకి ఇప్పుడే కాదు.. ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ను పలువురు ప్రతినిధులు అభినందనలతో ముంచెత్తారు. ఈ నెల 24న 40వ ఏట అడుగిడుతున్న సందర్భంగా కేటీఆర్‌కు ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘మీలాంటి చురుకైన మంత్రి ఢిల్లీకి వస్తే బాగుంటుంద’ని ఓ ప్రతినిధి వ్యాఖ్యానించగా... తాను ఇంకా 40వ ఏట అడుగుపెడుతున్నానని.. తెలంగాణ రాష్ట్రం, తమ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లే అయిందని, కొత్త రాష్ట్రంలో ఇంకా చేయాల్సిన పని ఎంతో ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో చేయాల్సిన పనులు పూర్తయిన తర్వాత ఢిల్లీకి వస్తానని వ్యాఖ్యానించారు. -
జర్నలిస్టుల సంక్షేమానికి పెద్దపీట
హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ వ్యవస్థాపక వేడుకల్లో డిప్యూటీ సీఎం సాక్షి, హైదరాబాద్: మీడియాకు ఎలాంటి సాయం చేయడానికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ తెలిపారు. ఆదివారం హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. తెలంగాణ ఏర్పాటులో మీడియా కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని చెప్పారు. రాజకీయాలకు దూరంగా ఉంటేనే సమాజంలో విలువ పెరుగుతుందని ఈ కార్యక్రమంలో పాల్గొన్న హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అభిప్రాయపడ్డారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణ ఆకాంక్ష త్వరలో నెరవే రుతుందని చెప్పారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో జర్నలిస్టులకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని సమాచార శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమ నిధికి సంబంధించిన జీవో త్వరలో వెలువడనుందని పేర్కొన్నారు. రూ.100 కోట్లతో జర్నలిస్టుల కాలనీ ఏర్పాటుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వచ్చేనెలలో లేదా ఆగస్టు మొదటి వారంలో 100 ఎకరాల్లో జర్నలిస్టుల కాలనీకి శంకుస్థాపన జరుగుతుందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. రాష్ట్రాభివృద్ధిలో మీడియా పాత్ర కీలకమని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. కార్యక్రమంలో ఉత్తమ జర్నలిస్టు కవితకు సన్మానం చేశారు. -
గ్రామాల్లో అందుబాటులో ఉండండి
రెవెన్యూ అధికారులకు సీసీఎల్ఏ ఆదేశం సాక్షి, హైదరాబాద్: గ్రామ స్థాయిలోనే ఫిర్యాదులను స్వీకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని రెవెన్యూ అధికారులను భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) రేమండ్ పీటర్ ఆదేశించారు. అధికారులు అందుబాటులో ఉండటం లేదంటూ.. చాలామంది గ్రామాల నుంచి హైదరాబాద్‌లోని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల వద్దకు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గ్రామ రెవెన్యూ అధికారులంతా వారికి పోస్టింగ్ ఇచ్చిన గ్రామంలోనే నివాసం ఉండాలని స్పష్టం చేశారు. వివిధ అంశాలపై అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లతో బుధవారం డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బీఆర్‌మీనా, రేమండ్ పీటర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పీటర్ మాట్లాడుతూ.. రెవెన్యూ ఇన్స్పెక్టర్ తన పరిధిలోని గ్రామాలను వారానికి ఒకసారి, తహసీల్దారు నెలకు ఒకసారైనా త నిఖీ చేయాలని, డివిజన్ పరిధిలోని గ్రామాల్లో గ్రీవెన్స్, మ్యుటేషన్ దరఖాస్తుల పెండెన్సీని ఆర్డీవోలు ఎప్పటికప్పడు సమీక్షించాలని ఆదేశించారు. సమీక్షలు నిర్వహించని ఆర్డీవోలకు చార్జిమెమోలు జారీ చేయాలని జేసీలకు సూచించారు. -
రెవెన్యూలో ప్రజా పోర్టల్
నేడు ఆవిష్కరించనున్న మహమూద్ అలీ సాక్షి, హైదరాబాద్: రెవెన్యూ శాఖలో పారదర్శకతను పెంపొందించేందుకు భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) చర్యలు చేపట్టారు.తమ భూమి రికార్డుల కోసం యజమానులు ఇకపై తహసీల్దార్ కార్యాలయాలు, ‘మీ సేవా’ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. రాష్ట్రంలోని ఏప్రాంతంలో ఉండే రైతు అయినా తన భూమికి సంబంధించిన వివరాలను ఆన్లైన్లో ఇట్టే చూసుకునేలా కొత్తగా ‘మా భూమి’ ప్రజా పోర్టల్‌ను సీసీఎల్ఏ రూపొందించారు. ‘మా భూమి’ పోర్టల్‌ను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ఆవిష్కరిస్తారు. అంతకు ముందు మధ్యాహ్నం 3 గంటలకు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తారని సీసీఎల్ఏ తెలిపింది. -
మహమూద్ అలీకి డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్
సాక్షి, హైదరాబాద్: ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ డిప్లొమాటిక్ పాస్‌పోర్టు తీసుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం సికింద్రాబాద్‌లోని రీజనల్ పాస్‌పోర్టు కార్యాలయంలో మహమూద్ అలీతో పాటు ఆయన భార్య డిప్లొమాటిక్ పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోవడంతో అధికారులు వెంటనే ఆ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ సందర్భంగా పాస్‌పోర్టు కార్యాలయం పనితీరు అద్భుతంగా ఉందని డిప్యూటీ సీఎం ప్రశంసించారు. ముఖ్యంగా హజ్‌యాత్రకు వెళ్లే యాత్రికుల పాస్‌పోర్టుల జారీ ప్రక్రియ త్వరగా పూర్తి చేయడం అభినందనీయమన్నారు. -
మరో 22 మంది విద్యార్థులు వెనక్కి
ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి తిరుగుముఖం పడుతున్న విద్యార్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే పదుల సంఖ్యలో విద్యార్థులు అక్కడి వెళ్లి తిరిగొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో 22మంది విద్యార్థులు న్యూయార్క్ వెళ్లి.. అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో తిరుగుముఖం పట్టారు. వీరందరు శనివారం అర్ధరాత్రి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఓ ఎయిర్‌లైన్స్ సంస్థ విద్యార్థులను బయటకు పంపడానికి చాలా సమయం తీసుకోవడంతో అదే సమయంలో ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం మహమూద్ అలీ చొరవ తీసుకుని అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కారం చేశారు.