
ఆదివారం ‘హునర్ హాట్’ను ప్రారంభించిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసిన చెక్క పడవలో కేంద్ర మంత్రి నక్వీ, మహమూద్ అలీ
సాక్షి, హైదరాబాద్: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై వెనక్కి తగ్గేది లేదని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ స్పష్టంచేశారు. పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందిన చట్టం దేశమంతటా వర్తిస్తుందని, భారత్‌లో అంతర్భాగమైన రాష్ట్రాలన్నీ ఈ చట్టాన్ని అమలు చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. ఆదివారం హైదరాబాద్‌లో కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన ‘హునర్ హాట్’ప్రదర్శనను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నక్వీ మీడియాతో మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం వల్ల ఎవరి పౌరసత్వం కోల్పోయే పరిస్థితి ఉండదని, అయినా ఈ చట్టంపై విపక్షాలు అనవసరంగా తప్పుడు ప్రచారం సాగిస్తున్నాయన్నా రు. దేశంలోని ముస్లింలకు ఈ చట్టం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవని, అన్ని మతాల ప్రజలకు భద్రత ఉంటుందని స్పష్టం చేశారు.
వాళ్లు సుపారీ గ్యాంగ్‌స్టర్‌లు...
సీఏఏపై ప్రజలను తప్పుదోవ పటిస్తున్న గ్యాంగ్‌స్టర్‌లలో పోటీ నెలకొందని, వాళ్లు సుపారీ తీసుకొని హారర్ షో.. హారర్ హంగామా సృష్టిస్తున్నారని నక్వీ దుయ్యబట్టారు. పౌరసత్వ సవరణ చట్టం కొత్తదేమీ కాదని, గతంలోనూ ఈ చట్టానికి సవరణలు జరిగాయని గుర్తుచేశారు. పౌరసత్వ సవరణ చట్టంపై అన్ని పార్టీలతో కూడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) నివేదిక కూడా సమర్పించిందని, కానీ 2019లో 16వ లోక్‌సభ కాలపరిమితి ముగియడంతో సీఏఏ బిల్లు ఆమోదం పెండింగ్‌లో పడిందని గుర్తుచేశారు.
పార్లమెంటులో సీఏఏకు మద్దతిచ్చిన పార్టీలు కూడా ఈరోజు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయని నక్వీ విమర్శించారు. జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ) కార్యక్రమాలు అస్సాంలో తప్ప మరెక్కడా అమలు కావడం లేదన్నారు. జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్) నమోదు ప్రతి పదేళ్లకు ఒకసారి జరుగుతుందని, ఈ విషయంలో రాజకీయ నేతల ఉచ్చులో పడొద్దని ప్రజలకు నక్వీ పిలుపునిచ్చారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీ, ఎన్‌పీఆర్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.