ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన
- రాష్ట్ర పథకాలకు దేశవ్యాప్తంగా ప్రశంసలు: మహమూద్ అలీ
- అభివృద్ధిలో ప్రపంచ స్థాయిలో మా పోటీ
- స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు టీ-ఫండ్ ఏర్పాటు చేస్తాం
- కొత్త పారిశ్రామిక విధానం ఉత్తమ ఫలితాలు ఇస్తోంది: మంత్రి కేటీఆర్
- ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రసంగించిన నేతలు
సాక్షి, హైదరాబాద్ : ప్రజల ఆకాంక్షల మేరకు తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సోమవారం జరిగిన భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఫిక్కీ) జాతీయ కార్యవర్గ సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపేం దుకు వివిధ రంగాలకు ప్రత్యేక పాలసీలను రూపొందించామని చెప్పారు. రెండేళ్ల పాలనలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందని, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు ప్రధాని మోదీ నుంచి సహా దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయన్నారు. అభివృద్ధి విషయంలో ప్రపంచ స్థాయి నగరాలతో తాము పోటీ పడుతున్నట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు.
‘స్మార్ట్‌సిటీస్’ అంశంపై ప్రసంగిస్తూ.. స్మార్ట్‌సిటీ అంటే పౌరులకవసరమైన మౌలిక సౌకర్యాలు కల్పించడమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 14 రంగాలకు ప్రాధాన్యం ఇస్తుండగా.. అందులో హైదరాబాద్ కేంద్రంగా మూడు ప్రధాన రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఐటీ, అనుబంధ సేవలతో పాటు భవిష్యత్ ఆవిష్కరణలకు అవకాశమున్న ఇన్నోవేషన్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, గేమింగ్, యానిమేషన్ తదితర రంగాల్లో భారీ వృద్ధికి అవకాశాలున్నాయని చెప్పారు. 200కు పైగా స్టార్టప్‌లతో టీ-హబ్ దేశంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్‌గా అవతరించిందని కేటీఆర్ వెల్లడించారు. స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు ‘టీ-ఫండ్’ ఏర్పాటు యోచనలో ఉన్నామని తెలిపారు.
ఏడాదిలో 50వేల కోట్ల పెట్టుబడులు
సింగపూర్, మలేసియా తదితర ఈశాన్య ఆసియా దేశాల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన పారిశ్రామిక విధానం మంచి ఫలితాన్ని ఇస్తోందని కేటీఆర్ పేర్కొన్నారు. ఏడాది వ్యవధిలో 2,300పైగా పరిశ్రమలకు అనుమతులివ్వడం ద్వారా రూ.50వేల కోట్ల పెట్టుబడులు, 1.30 లక్షల మందికి ఉద్యోగాల కల్పన సాధ్యమైందన్నారు. బల్క్‌డ్రగ్, వ్యాక్సిన్ల తయారీలో హైదరాబాద్ ప్రపంచ వ్యాప్తంగా దృష్టిని ఆకర్షిస్తోందని... ఐదింట ఒక వంతు వ్యాక్సిన్లు ఇక్కడే తయారవుతున్నాయని చెప్పారు. లైఫ్ సెన్సైస్, ఫార్మా, ఏరోస్పేస్ రంగాల్లో హైదరాబాద్‌కున్న అనుకూలతలను మంత్రి కేటీఆర్ వివరించారు. ఫిక్కీ జాతీయాధ్యక్షుడు హర్షవర్ధన్ నియోటియా అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎంజీ గోపాల్, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఫిక్కీ సెక్రెటరీ జనరల్ దీదర్ సింగ్, ఫిక్కీ ఆంధ్ర, తెలంగాణ చైర్‌పర్సన్ సంగీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీకి ఇప్పుడే కాదు..
ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్‌ను పలువురు ప్రతినిధులు అభినందనలతో ముంచెత్తారు. ఈ నెల 24న 40వ ఏట అడుగిడుతున్న సందర్భంగా కేటీఆర్‌కు ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘మీలాంటి చురుకైన మంత్రి ఢిల్లీకి వస్తే బాగుంటుంద’ని ఓ ప్రతినిధి వ్యాఖ్యానించగా... తాను ఇంకా 40వ ఏట అడుగుపెడుతున్నానని.. తెలంగాణ రాష్ట్రం, తమ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లే అయిందని, కొత్త రాష్ట్రంలో ఇంకా చేయాల్సిన పని ఎంతో ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో చేయాల్సిన పనులు పూర్తయిన తర్వాత ఢిల్లీకి వస్తానని వ్యాఖ్యానించారు.