దేవి గీసిన బొమ్మ | Devi-drawn doll | Sakshi
Sakshi News home page

దేవి గీసిన బొమ్మ

Published Tue, Jan 20 2015 11:55 PM | Last Updated on Sat, Sep 2 2017 7:59 PM

దేవి గీసిన బొమ్మ

దేవి గీసిన బొమ్మ

దేవి ప్రసాద్...  డెరైక్టర్‌గా మెగాఫోన్ పట్టుకుని వెండితెరపై చిత్రాలను సృష్టించినంత అలవోకగా.. కుంచెతో అందమైన చిత్రాలు ఆవిష్కరిస్తాడు. ఆరు సినిమాలతో హిట్ డెరైక్టర్‌గా అనతి కాలంలోనే మంచి టాక్ సంపాదించిన దేవిలో... ‘బాపు’ బొమ్మ గీసి ఆయనకే బహుమతిగా ఇచ్చేంత మంచి ఆర్టిస్ట్ దాగున్నాడు. సినిమా సినిమాకు మధ్య ఖాళీని తన కుంచెతో పూరిస్తున్న దేవీప్రసాద్ ‘సిటీప్లస్’తో పంచుకున్న ముచ్చట్లు...
 
మా సొంతూరు గుంటూరు జిల్లా కనగాల గ్రామం. నాన్న కోటేశ్వర్‌రావు ప్రభుత్వ విభాగంలో ఫార్మాసిస్ట్. వృత్తి రీత్యా ప్రాంతాలు మారుతుండటంతో నా చదువు కూడా డిఫరెంట్ లొకేషన్స్‌లో సాగింది. చిన్నప్పటి నుంచే పెయింటింగ్ అంటే ఇష్టం. పాఠశాల స్థాయిలోనే బొమ్మలు గీస్తుండేవాడిని. మాచర్ల సత్యనపల్లి హైస్కూల్‌లో ఎనిమిదో తరగతి చదివేటప్పుడు బాపూతో పాటు సినీ దర్శకులు, నటుల బొమ్మలు గీస్తుంటే నాన్న గారు చూశారు. ‘ఏంటిరా ఈ బొమ్మలు గీస్తున్నావు’ అంటే.. ‘పెద్దయ్యాక మద్రాస్‌లో వీళ్లను కలిసి ఈ బొమ్మలు ఇస్తా’ అని చెప్పా. అంతే నాన్న సెలవుపెట్టి మరుసటి రోజే మద్రాసు తీసుకెళ్లారు.
 
అరుదైన సమయాలు...
మొదట బాపు ఇంటికి వెళ్లాం. అప్పుడే నేను గీసిన బొమ్మ బాపూగారికి ఇచ్చాను. అప్పటివరకు ఆయనంటే నాకు తెలియని ఇష్టం ఉండేది. ఆయన్ని ప్రత్యక్షంగా చూశాక బాపూగారి గొప్పతనం అర్ధమైంది. ఆయన బొమ్మలు గీసే గది చూపించారు. అది నా లైఫ్‌లో స్వీట్ మెమరీ. ఆ తర్వాత పుండరీకాక్షయ్య ఆఫీసుకెళ్లాం. అక్కడ పాటల రచయిత కొసరాజు రాఘవయ్య గారు కలిశారు. ‘ఈ బొమ్మలు నువ్వే గీశావా?’ అని అడిగాడు.

వెంటనే ఆ ఆఫీసులోనే ఉన్న ఎన్‌టిఆర్ ఫొటో చూసి చిత్రరూపమిచ్చా. వెంటనే కౌగిలించుకొని... ప్యాడ్, పేపరు తీసుకొని నా పేరు వచ్చేలాగా పద్యం రాసి, సంతకం పెట్టి గిఫ్ట్‌గా ఇచ్చారు. అవి రెండొ అరుదైన సమయాలు. నేనెన్నటికీ మరువలేనివి. కాలేజీ చదువు బాపట్లలో సాగింది. స్కూల్, కాలేజీ రోజుల్లో నాటకాలు వేసేవాడిని. అలా సినిమాల్లోకి వెళ్లాలన్న ఆసక్తి కలిగింది.
 
పదేళ్ల విరామం...
సినిమా ఫీల్డ్‌కు వచ్చాక కోడి రామకృష్ణ గారి దగ్గర పనిచేశా. బిజీ లైఫ్. దాదాపు పదేళ్ల పాటు బొమ్మలు గీయడానికి దూరంగా ఉన్నా. హైదరాబాద్ వచ్చాక డెరైక్టర్‌గా అవకాశం వచ్చింది. సినిమా, సినిమా మధ్య ఖాళీ సమయాల్లో మళ్లీ పాతరోజుల్లాగా బొమ్మలు గీయడం ప్రారంభించాను. ఈ సమయంలోనే నా అభిమాన డెరైక్టర్ బాలచందర్‌గారు తెలుగు డెరైక్టర్ అసోసియేషన్‌కు వచ్చినప్పుడు... నేను గీసిన ఆయన చిత్రాన్ని ఇచ్చా.

అది చూసి చాలా మెచ్చుకున్నారు. అంతేకాదు... ‘ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆర్ట్‌ని వదులుకోవద్దు, అది డెరైక్షన్‌కి కూడా ఉపయోగపడుతుంది’ అని చెప్పారు. ఆ మాటలే శిరోధార్యంగా టైం దొరికితే చాలు బొమ్మలకు రూపునిచ్చే పనిలో నిమగ్నమవుతున్నా. విపరీతమైన ఒత్తిడి సమయాల్లోనూ కుంచె పట్టుకుంటే చాలు... ప్రశాంతత కలుగుతుంది. భవిష్యత్‌లో ఆర్ట్ ఎగ్జిబిషన్  ఏర్పాటు చేయాలనుకుంటున్నా.
 - వాంకె శ్రీనివాస్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement