అ‘ధనం’పై పట్టువీడని మంత్రి | devineni uma seek extra money to avuku tunnel contractor | Sakshi
Sakshi News home page

అ‘ధనం’పై పట్టువీడని మంత్రి

Published Sun, Mar 13 2016 8:43 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM

అ‘ధనం’పై పట్టువీడని మంత్రి

అ‘ధనం’పై పట్టువీడని మంత్రి

‘అవుకు’ కాంట్రాక్టర్‌కు అదనపు సొమ్ము చెల్లింపు దిశగా మళ్లీ చర్యలు
రూ. 44 కోట్లు అప్పనంగా ఇచ్చేయడానికి దారులు వెతుకుతున్న మంత్రి?

సాక్షి, హైదరాబాద్: ఇరిగేషన్‌లో ఓ ఫైలు ఇద్దరు సీఎస్‌లు తిరస్కరించినా కేబినెట్ ఆమోదం పొంది ఉత్తర్వులు కూడా జారీ అయిపోవడాన్ని మనం చూశాం. అదే శాఖలో అలాంటిదే మరో ఉదంతమిది. అవుకు సొరంగం పనుల్లో అదనపు చెల్లింపుల వ్యవహారం స్టాండింగ్ కమిటీ ముందుకు పదేపదే వస్తున్నది. ఒకసారి కూడదు అని సిఫార్సు చేసినా మరలా అదే కమిటీకి పరిశీలన నిమిత్తం జలవనరుల శాఖ ఎందుకు పంపుతోంది అనేది గ్రహించడానికి ఎక్కువ శ్రమించనక్కరలేదు. అందులో ఎందరో ‘ప్రయోజనాలు’ ఇమిడి ఉంటాయి మరి.. ఆ సంగతేమిటో చూద్దామా..
 

కర్నూలు జిల్లాలోని అవుకు సొరంగంలో అవినీతి ప్రవహించాల్సిందేనని జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పట్టుబడుతున్నారని ఆ శాఖలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. కాంట్రాక్టర్‌కు రూ. 44 కోట్లు అదనంగా చెల్లించే దిశగా పావులు కదుపుతుండడమే అందుకు ప్రత్యక్ష నిదర్శనమంటున్నారు. అవుకు సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌కు అదనపు చెల్లింపులు చేయడానికి ప్రభుత్వం సమాయత్తం కావడాన్ని తప్పుబడుతూ అధికార పార్టీ ఎంపీ సీఎం రమేష్ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం విదితమే. అదనపు చెల్లింపులు అంశంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలో సిఫారసు చేయాలంటూ సీఎం రమేష్ రాసిన లేఖను రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ(ఎస్‌ఎల్‌ఎస్‌సీ)కి ప్రభుత్వం నేవిదించింది.


అదనంగా కాంక్రీట్ పనులు చేసినా ఐబీఎం(ఇంటర్నల్ బెంచ్ మార్క్) పరిమాణం కంటే పెరగనందున.. అదనంగా చెల్లించడానికి నిబంధనలు అంగీకరించవని, చెల్లించాలనుకుంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని ఎస్‌ఎల్‌ఎస్‌సీ.. ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఎస్‌ఎల్‌ఎస్‌సీ సిఫారసుతో సంతృప్తి చెందని మంత్రి.. ఏదో విధంగా చెల్లింపులు చేయడానికి దారులు వెతికారు.

అడ్డదారిలో చెల్లిస్తే అవినీతి బయటపడుతుందని జంకినట్లు సాగునీటి శాఖ అధికార వర్గాల సమాచారం. దాంతో ఎస్‌ఎల్‌ఎస్‌సీకి మరోసారి ఇదే అంశాన్ని నివేదించాలని నిర్ణయించారు. ఈసారి సానుకూలంగా సిఫారసు వచ్చే విధంగా ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. ఎస్‌ఎల్‌ఎస్‌సీ సిఫారసు మేరకే అదనపు చెల్లింపులు చేయాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పుకోవడానికి వీలు ఉంటుందని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.
 

రూ. 44 కోట్లు అదనం
గాలేరు-నగరి సుజల స్రవంతి(జీఎన్‌ఎస్‌ఎస్) వరద కాల్వ ద్వారా 20,000 క్యూసెక్కుల నీటిని అవుకు రిజర్వాయర్‌కు తరలించడానికి వీలుగా రూ. 401 కోట్ల విలువైన అవుకు టన్నెల్-2 పనిని ప్యాకేజీ 30 కింద ఈపీసీ(ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్) విధానంలో ఎన్‌సీసీ-మేటాస్ జాయింట్‌వెంచర్‌కు 2007లో ప్రభుత్వం అప్పగించింది. సొరంగం తవ్వకంలో ఎలాంటి ప్రతికూల అంశాలు, ప్రతిబంధకాలు ఎదురైనా పూర్తి బాధ్యత తీసుకొని పని పూర్తి చేస్తామని ప్రభుత్వానికి కాంట్రాక్టర్ అండర్ టేకింగ్ కూడా ఇచ్చారు.


ఒప్పందంలో ఉన్న దానికంటే 1.20 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ అదనంగా చేయాల్సిన పరిస్థితి వచ్చిందని, దానికి ఒప్పంద విలువ కంటే రూ. 44 కోట్లు అదనంగా చెల్లించాలని కాంట్రాక్టర్‌ను ప్రభుత్వాన్ని కోరితే.. ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమయింది. సాధారణంగా ఈపీసీ విధానంలో అదనపు చెల్లింపులకు అవకాశం లేదు. ఇదే విషయాన్ని.. నిబంధనలకు విరుద్ధంగా అదనపు చెల్లింపులు చేయడానికి ప్రభుత్వం సిద్ధమయిందని పేర్కొంటూ అధికార పార్టీ ఎంపీ సీఎం రమేష్ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం విదితమే.

అధికార పార్టీ ఎంపీ రాసిన లేఖ బయటకు పొక్కిన నేపథ్యంలోనే గత ఏడాది ఈ అంశాన్ని ప్రభుత్వం ఎస్‌ఎల్‌ఎస్‌సీకి నివేదించింది. ప్రభుత్వం ఆశించినట్లుగా కాకుండా, భిన్నంగా సిఫారసు రావడంతో, కొంతకాలం ఆగి మళ్లీ ఇప్పుడు తాజాగా రెండోసారి ఎస్‌ఎల్‌ఎస్‌సీకి నివేదించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement