ఘనంగా లాల్ దర్వాజ బోనాలు
హైదరాబాద్: చారిత్రక పాతనగరంలో లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా సాగుతోంది. ఉదయం నుంచే మహిళా భక్తులు అమ్మవారికి బోనాలు, నైవేద్యం సమర్పించేందుకు బారులు తీరారు. టీఆర్‌ఎస్ ఎంపీ కవిత, తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ తదితరులు అమ్మవారికి బోనం సమర్పించారు. ఉదయం నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుండటంతో ఆలయం వద్ద కోలాహలం నెలకొంది. మరోవైపు పాతబస్తీ అంతటా బోనాల జాతర సందడి నెలకొంది. అమ్మవారి జానపద గీతాలు, బోనాల ఊరేగింపు, పోతురాజుల విన్యాసాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది.
ఆషాఢమాసం బోనాల ఉత్సవాలలో ప్రధాన ఘట్టమైన లాల్‌దర్వాజ సింహవాహిని మహంకాళి అమ్మవారిని మహిమాన్వితమైన శక్తిప్రదానియిగా భక్తులు కొలుస్తారు. నిజాం నవాబుల కాలం నుంచి లాల్ దర్వాజ్ సింహవాహిని అమ్మవారు పూజలందుకుంటున్నారు. పెద్ద ఎత్తున భక్తులు తరలిరావడంతో ఆలయం వద్ద, పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మూడు వందల సీసీ కెమరాలు ఏర్పాట్లను చేశామని, వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించి ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నామని సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు.