ఇంకాస్త కష్టపడాల్సింది!
వివిధ పార్టీల్లో అంతర్మథనం
కొన్ని డివిజన్లలో రెండో స్థానం
విజయానికి అడుగు దూరంలో ఆగిన వైనం
సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ముగిశాక ప్రస్తుతం వివిధ వర్గాలు.. ముఖ్యంగా రాజకీయ పరిశీలకులు ఫలితాల తీరు తెన్నులపై అధ్యయనం చేస్తున్నారు. పార్టీలు ఇంకొంచెం కష్టపడితే మరికొన్ని సీట్లు సొంతమయ్యేవని అభిప్రాయ పడుతున్నారు. జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్లలో పోటీ చేసి 99 స్థానాలు సొంతం చేసుకున్న టీఆర్‌ఎస్ అభ్యర్థులు మరికొంత కష్టపడితే మరిన్ని చోట్ల గెలిచేవారు. ఆ పార్టీ 38 డివిజన్లలో రెండో స్థానంలో ఉంది. ఇంకాస్త కష్టపడితే దాదాపు 20 డివిజన్లలో గెలవగలిగేవారని లెక్కలు కడుతున్నారు. టీడీపీ- బీజేపీలు నిజంగా పొత్తు ధర్మాన్ని పాటించి ఉంటే రెండు పార్టీల సీట్లూ గణనీయంగా పెరిగేవి. బీజేపీ గెలిచింది నాలుగు డివిజన్లలోనే అయినప్పటికీ.... 35 చోట్ల రెండో స్థానంలో నిలిచింది. మిత్రపక్షానికి టీడీపీ సహకరించి ఉంటే.. ఉభయ పార్టీలూ మరికొంత కష్టపడితే ఇందులో సగం వచ్చినా సీట్లు పెరిగేవి.
టీడీపీది కూడా ఇదే పరిస్థితి. గెలిచింది ఒక్కటే సీటు. మరికొంత చెమటోడిస్తే.. పార్టీలోని అన్ని వర్గాలనూ కలుపుకొని పోయి ఉంటే.. ఇంకొన్ని సీట్లు వచ్చి ఉండేవని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఎంఐఎం పోటీ 60 సీట్లలో పోటీ చేసి... 44 చోట్ల గెలిచింది. మరో ఐదు డివిజన్లలో రెండో స్థానంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 149 డివిజన్లలో పోటీ చేసి... రెండు సీట్లతో సరిపెట్టుకుంది. 11 డివిజన్లలో రెండో స్థానంలో ఉన్న పార్టీ ఎక్కువ చోట్ల మూడో స్థానానికి పడిపోయింది. కాంగ్రెస్ పార్టీ 79 డివిజన్లలో మూడో స్థానంలో ఉంది.