ప్రత్యూష.. పాసా? ఫెయిలా..!
- పాసైయిందంటున్న డేనియల్ కళాశాల యాజమాన్యం
- ప్రాక్టికల్స్ మార్కులు లేక ఫెయిల్ లిస్ట్‌లో చేర్చిన ఇంటర్‌బోర్డు
హైదరాబాద్: సొంత తండ్రి, సవతి తల్లి చేతిలో చిత్రహింసలకు గురైన ప్రత్యూష(పావని) గుర్తుంది కదండీ!. మీడియా, ఎన్జీఓలు, కోర్టుతో పాటు సీఎం కేసీఆర్ చొరవతో పునర్జన్మ పొందిన ప్రత్యూషను అయోమయం చుట్టుముట్టింది. ఈ ఏడాది ఇంటర్ వొకేషనల్ కోర్సు పూర్తి చేసి బిఎస్సీ నర్సింగ్ కోర్సులో చేరాలన్న ప్రత్యూష కోరికపై అయోమయం నెలకొంది. శుక్రవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఆమె అన్ని సబ్జెక్టుల్లో మంచి మార్కులతో పాసైనప్పటికి, ఆమెకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించిన సెయింట్‌డేనియల్ వొకేషనల్ కళాశాల ఆ వివరాలను సకాలంలో ఇంటర్‌బోర్డుకు పంపలేదు.
ఈ క్రమంలో ఇంటర్ ఫలితాల్లో ప్రత్యూష హాల్ టికెట్ నెంబర్ కొట్టి ఫలితాలు చూడగా ఫెయిలైనట్లు వచ్చింది. ఈ విషయమై ప్రత్యూషను సాక్షి ప్రతినిధి ఫోన్‌లో సంప్రదించగా, తాను ప్రాక్టికల్స్‌తో పాటు, అన్ని పరీక్షలు బాగా రాశానని తెలిపింది. ఈ విషయమై డేనియల్ కళాశాల ప్రతినిధి విజయను ప్రశిస్తే.. ప్రత్యూషకు రెండు హాల్ టికెట్ నెంబర్లున్నాయని, ప్రాక్టికల్స్ తమ వద్ద, రాత పరీక్షలు నారాయణ కళాశాలలో రాసిందని పేర్కొన్నారు. తమ వద్ద నిర్వహించిన ప్రాక్టికల్స్‌లో పాసైందని, ఈ మార్కుల వివరాలు ఇంటర్ బోర్డుకు అందజేస్తామని ఆమె చెప్పారు.