హైకోర్టుకు దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసు
హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్ల కేసు హైకోర్టుకు చేరింది. ఈ కేసు తీర్పు ధ్రువీకరణ కోసం ఎన్‌ఐఏ కోర్టు సోమవారం హైకోర్టుకు పంపగా, రెఫర్ ట్రయల్ కేసు నమోదు చేసింది. మరోవైపు ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు తీర్పును నిందితులు సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఎన్‌ఐఏ కోర్టు అయిదుగురిని దోషులుగా తేల్చి ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే.
కాగా దిల్‌సుఖ్‌నగర్‌లో 2013 ఫిబ్రవరి 21న జరిగిన జంట పేలుళ్ల ఘటనలో ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు గత సోమవారం తీర్పునిచ్చిన విషయం విదితమే. ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులుండగా ప్రధాన సూత్రధారి రియాజ్ భత్కల్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాద సంస్థ దేశంలో పాల్పడిన ఘాతుకాలకు సంబంధించి విచారణ పూర్తయి తీర్పు వెలువడిన తొలి కేసు ఇదే!