పోలీసులను ఆశ్రయించిన నితిన్ దర్శకుడు
హైదరాబాద్ : నితిన్ హీరోగా ‘గుండెజారి గల్లంతయిందే’ చిత్రానికి దర్శకత్వం వహించిన డైరెక్టర్ కొండా విజయ్ కుమార్ మంగళవారం ఎస్ఆర్ నగర్ పోలీసులను ఆశ్రయించాడు. తన ప్రేమ పెళ్లి విషయంలో అతడు పోలీసుల ఆశ్రయం కోరినట్లు తెలుస్తోంది. కాగా విజయ్ కుమార్ ఈ నెల 1వ తేదీన ప్రసూన అనే యువతిని వివాహం చేసుకున్నాడు. ఈ వివాహానికి విజయ్ కుటుంబంతో పాటు, సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
చాలాకాలంగా విజయ్ , ప్రసూన ప్రేమించుకున్నట్లు సమాచారం. అయితే ప్రసున కుటుంబసభ్యులకు ఈ వివాహం ఇష్టం లేనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అతడు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా తొలి చిత్రం అయినా ’గుండెజారి గల్లంతయిందే’తో విజయ్ కుమార్ హిట్ కొట్టిన విషయం తెలిసిందే. అయితే తర్వాత నాగచైతన్యతో చేసిన ’ ఒక లైలా కోసం’ నిరాశపరిచింది. త్వరలోనే వరుణ్ తేజ్ తో ఓ చిత్రం చేస్తున్నట్లు వార్తలు వచ్చినా ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ లేదు.