మల్కాజిగిరి సర్కిల్‌లో పింఛన్ల ప్రహసనం
జాబితాలన్నీ తప్పుల తడకే.. అధికారుల నిర్లక్ష్యం...
అర్హులకు అన్యాయం
మల్కాజిగిరి : భర్త బతికుండగానే ఒక వికలాంగురాలికి విడో పింఛన్ మంజూరు చేశారు. మరో మైనర్ బాలికకు కూడా వితంతు కోటాలోనే పింఛన్ మంజూరైంది. ఇలాంటి సంఘటనలు మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో చాలా చోటు చేసుకుంటున్నాయి. అర్హులైన పింఛన్‌దారులను గుర్తించడంలో సిబ్బంది నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపాలకు ఈ ఉదంతాలే నిదర్శనం. మల్కాజిగిరి దుర్గానగర్‌లో నివాసముంటున్న వినయ్ అలియాస్ వినేందర్, శాంతాబాయిలిద్దరూ భార్యాభర్తలు, వీరిద్దరూ అంగవైకల్యం ఉన్నవారే. సదరం సర్టిఫికెట్ అందజేసిన వైద్యాధికారులు వినయ్‌కి 89 శాతం, శాంతాబాయికి 86 శాతం అంగవైకల్యం ఉన్నట్లుగా ధృవీకరించారు. గతేడాది నవంబర్ నెల వరకు వీరిద్దరూ వికలాంగుల కోటాలో పింఛన్ పొందారు.
ఇటీవల ప్రభుత్వం మారిన తర్వాత నాలుగు నెలల నుంచి వారికి పింఛన్ రావడం లేదు. ఇటీవల ఫిబ్రవరి నెల జాబితాలో మాత్రం శాంతాబాయి పేరు నమోదు అయింది. అయితే, ఆమెకు వికలాంగుల కోటాలో కాకుండా భర్త చనిపోయారని పేర్కొంటూ వితంతు పింఛన్ మంజూరు చేశారు. ఇక వినయ్‌కుమార్ పేరు జాబితాలో లేనేలేదు. ఆశ్చర్యకర విషయమేమిటంటే... వినయ్‌కుమార్ వికలాంగుల హక్కుల పోరాట సమితి మల్కాజిగిరి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.
వికలాంగురాలికి వితంతు పింఛన్!
Published Wed, Feb 25 2015 11:57 PM | Last Updated on Mon, Oct 8 2018 8:52 PM
Advertisement