బక్రీద్ పండుగ సందర్భంగా తయారయ్యే వ్యర్థాలను ప్లాస్టిక్ కవర్లలో మాత్రమే పడేయాలని చాంద్రాయణగుట్ట ఎస్సై చంద్రమోహన్ అన్నారు. స్టేషన్ పరిధిలోని అల్ జుబేల్ కాలనీలో స్థానిక నాయకులతో కలిసి సోమవారం ఆయన ప్లాస్టిక్ కవర్లను ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ....బక్రీద్ పండుగ సందర్భంగా ఖుర్బానీ నిర్వహించే వ్యర్థాలను రోడ్లపై పడేస్తే ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తాము అందజేసే కవర్లలో వ్యర్థాలను పడేసి చెత్త కుండీలలో, లేకుండే జీహెచ్‌ఎంసీ వాహనాలలో పడేయాలని ఆయన సూచించారు. తమ కార్యక్రమానికి స్థానికుల నుంచి మంచి స్పందన వచ్చిందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.