
శిశువుల మార్పిడి వివాదానికి తెర!
హైదరాబాద్: శిశువుల మార్పిడి వివాదానికి తెర పడింది. తనకు పుట్టింది ఆడశిశువు కాదు.. మగశిశువేనని ఆందోళనకు దిగిన రజిత అనే మహిళకు ఆడశిశువు జన్మించిందని డీఎన్ఏ రిపోర్టులో వెల్లడైంది. మగశిశువు డీఎన్ఏతో మరో మహిళ రమాదేవి డీఎన్ఏ మ్యాచ్ అయినట్టు అధికారులు తెలిపారు. ఇద్దరు శిశువులు, తలిదండ్రుల డీఎన్ఏ రిపోర్టును అధికారులు బుధవారం విడుదల చేశారు.
కాగా, గత కొన్ని రోజుల క్రితం కోఠి మెటర్నిటీ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి అప్పుడే పుట్టిన శిశువుల మార్పిడి జరిగిన సంగతి తెలిసిందే. ఒకేరోజున రమాదేవి, రజిత ఇద్దరు మహిళలు ప్రసవించారు. ఈ నేపథ్యంలో బాలింత రజితకు అబ్బాయి పుట్టాడని ముందుగా చెప్పి.. కొద్దిసేపటి తరువాత వచ్చి, కాదు.. రజితకు అమ్మాయేనని ఆస్పత్రి సిబ్బంది చెప్పడంతో వివాదానికి దారి తీసిన సంగతి విధితమే.
తన భార్య(రజిత) మగబిడ్డకే జన్మనిచ్చిందని.. ఆస్పత్రి సిబ్బందే బాబును తారుమారు చేసి ఆడ శిశువును అంటగట్టారని ఆమె భర్త శత్రువు ఆస్పత్రి వర్గాలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రెండు జంటలతో పాటు ఇద్దరు చిన్నారులకు డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించారు. డీఎన్‌ఏ నివేదికలో బాబు తల్లి రమాదేవి అని తేలిందని పోలీసులు తెలిపారు.