వీణావాణిలకు శస్త్ర చికిత్స చేయించండి
నిలోఫర్ ఆస్పత్రి వర్గాలకు తల్లిదండ్రుల లేఖ
సాక్షి, హైదరాబాద్ : అవిభక్త కవలలు వీణావాణిల ఆపరేషన్‌కు తల్లిదండ్రులు మురళి, నాగలక్ష్మి అంగీకరించడంతో ఎట్టకేలకు మార్గం సుగమమైంది. ఈ మేరకు శస్త్రచికిత్స మొదలు పెట్టాలని కోరుతూ నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సురేశ్ కుమార్, ప్రొఫెసర్ రమేశ్‌రెడ్డికి ఆ దంపతులు లేఖ రాశారు. 2003లో పుట్టిన ఈ అవిభక్త కవలలకు పదమూడేళ్లు నిండాయి. దీంతో నిలోఫర్ ఆస్పత్రిలో వారిని ఉంచేందుకు వర్గాలు అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పిల్లలను ఇంటికి తీసుకెళ్లి సాకే స్తోమత తమకు లేదని, ప్రభుత్వమే తమకు ఏదైనా మార్గం చూపించాలని తల్లిదండ్రులు వేడుకున్నారు.
అయితే ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతోనే.. తాము శస్త్రచికిత్సకు ఒప్పుకున్నట్లు వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా వీణావాణిల తల్లిదండ్రులు రాసిన లేఖ అందినట్లు నిలోఫర్ ఆస్పత్రి సూపరింటెండెంట్ సురేశ్ కుమార్ తెలిపారు. ఈ లేఖను డీఎంఈకు చేరవేస్తామని చెప్పారు. వారిద్దరిని శస్త్రచికిత్స ద్వారా వేరుచేసేందుకు లండన్, ఆస్ట్రేలియా వైద్య బృందం సానుకూలంగా ఉందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఆయన వివరించారు. అప్పటివరకు కవలలు తమ ఆస్పత్రిలోనే ఉంటారని ప్రకటించారు.