
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్: ఆమె డాక్టర్. అతను బీడీఎస్(బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జన్) విద్యార్థి. వీళ్లిద్దరికీ పన్నెండేళ్ల కిందట (2004)లో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. తర్వాత ప్రేమలో పడ్డారు. విషయం పెద్దలదాకా వెళ్లడంతో పెళ్లికి మార్గం సుగమమైంది. కొద్ది నెలల కిందట నిశ్చితార్థం కూడా జరిగింది. కట్నంగా లక్షల రూపాయలు తీసుకున్న ఆ యువకుడు ఇప్పుడు ముఖం చాటేశాడు. కొద్ది రోజుల్లో పెళ్లి జరగాల్సిఉండగా పత్తాలేకుండా పారిపోయాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఎల్ బీ నగర్ పోలీసుల కథనం ప్రకారం..
హైదరాబాద్ లోని సైదాబాద్ కాలనీకి చెందిన శివ మమత మెడికల్ కళాశాల(ఖమ్మం)లో బీడీఎస్ చదువుతున్నాడు. ఎల్‌బీనగర్‌కు చెందిన ఓ యువతి (28) వృత్తిరీత్యా డాక్టర్. వీరికి 2004లో పరిచయం ఏర్పడింది. కొంతకాలం ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో శివ తన అవసరాల కోసం యువతి నుంచి పలుమార్లు డబ్బులు తీసుకున్నాడు. ఇరు కుటుంబాలవారు వీరిద్దరికీ వివాహం చేయాలని నిర్ణయించుకుని 2016 ఫిబ్రవరి 14న నిశ్చితార్థం చేశారు.
నిశ్చితార్థం సందర్భంగా ఇరు కుటుంబాలవారు బంగారం, నగదును ఇచ్చి పుచ్చుకున్నారు. ఏప్రిల్ 22వ తేదీన పెళ్లి జరపాలని నిర్ణయించారు. ఇటీవలే శివ తన చదువు కోసమంటూ యువతి కుటుంబ సభ్యుల నుంచి రూ.4.5 లక్షల నగదు కూడా తీసుకున్నాడు. అయితే గత కొద్ది రోజులుగా శివ తన ప్రియురాలికి ముఖం చాటేశాడు. ఆమెతో మాట్లాడటం మానేశాడు. దీంతో ఆ యువతి విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. వారి సహకారంతో శుక్రవారం ఎల్‌బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు శివపై అత్యాచారం, నమ్మకద్రోహంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం శివ పరారీలో ఉన్నాడు.