ఓ కుక్క ముగ్గురు జీవితాల్ని మార్చేసింది..
ఓ కుక్క ముగ్గురు జీవితాల్ని మార్చేసింది..
Published Fri, Sep 1 2017 8:12 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM
► కారులో వెళ్తూ శునకాన్ని చోరీ చేసిన మిత్రులు
► కేసు దర్యాప్తు చేసిన పోలీసులు..
► ముగ్గురి అరెస్టు..
► కుక్కతో పాటు కారు స్వాధీనం
ముగ్గురు స్నేహితులు. ఒకరు విదేశంలోను, మరొకరు సిటీలో చదువుకుంటున్నారు. ఇంకొకరు ఉద్యోగం చేస్తున్నారు. ఈ ముగ్గురూ కలిసి ఓ ఇంటి ముందు కట్టేసిన పెంపుడు శునకాన్ని చోరీ చేశారు. దాని యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా ఈ మిత్ర త్రయాన్ని గుర్తించి కటకటాల్లోకి నెట్టారు. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
నాగోల్(హైదరాబాద్): ఆదాయపు పన్ను శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న నవీన్ ఎల్బీనగర్‌లోని రాక్‌హిల్స్ కాలనీలో నివసిస్తున్నారు. ఈయన బీగల్ జాతి శునకానకి స్పూపీగా పేరు పెట్టి పెంచుకుంటున్నారు. ఎప్పటిలాగే గత గురువారం ఉదయం ఈ శునకాన్ని తమ ఇంటి ముందు కట్టేశారు. అల్కాపురి రోడ్ నెం.12కు చెందిన పగిడిమర్రి ఫల్గుణ(26) యూరప్‌లో ఎంబీఏ చదువుతున్నాడు. సెలవులకు ఇటీవల సిటీకి వచ్చాడు. ఎంకామ్ చదువుతున్న సరూర్‌నగర్ న్యూహుడా కాంప్లెక్స్‌కు చెందిన పటాల ఉదయ్‌కిరణ్ (23), ఓ కాల్‌సెంటర్‌లో ఉద్యోగం చేస్తున్న సహార ఎస్టేట్ నివాసి గావిని మనోజ్(25) ఇతడికి స్నేహితులు. యూరప్ నుంచి వచ్చిన ఫల్గుణతో కలిసి ఈ ఇద్దరూ కారులో షికార్లు చేస్తున్నారు. ఫల్గుణకు శునకాలంటే మోజు. గత గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో ఈ మిత్ర త్రయం ఫల్గుణకు చెందిన ఐ 20 కారులో వచ్చి నవీన్ ఇంటి ముందు కట్టేసిన కుక్కను చూసి దాన్ని చోరీ చేయాలని నిర్ణయించుకున్నారు.
కారు నెంబర్ ప్లేట్ మూసేసి..
శునకాన్ని చోరీ చేయడం కోసం ఈ మిత్రులు తమ కారు ముందున్న నెంబర్ ప్లేట్‌కు స్టికర్ అతికించారు. గుట్టుచప్పుడు కాకుండా కుక్కను కారులో వేసుకుని ఉడాయించారు. కొద్దిసేపటికి తమ కుక్క కనిపించడం లేదని గుర్తించిన యజమాని నవీన్.. ఇంట్లోని సీసీ కెమెరాల ఫీడ్‌ను పరిశీలించారు. అందులో కుక్క చోరీ చేస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో ఆయన ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు ఆ ఇంటితో పాటు సమీపంలోని సీసీ కెమెరాల్లోని ఫీడ్‌ను అధ్యయనం చేశారు. చోరులు కారు ముందు భాగంలో ఉన్న నెంబర్ ప్లేట్‌కు స్టికర్ అతికించినా.. వెనుకున్న నెంబర్‌ను అలాగే వదిలేశారు. దీంతో కారు నెంబర్ ఆధారంగా గురువారం ముగ్గురు స్నేహితుల్నీ పట్టుకోవడంతో పాటు అల్కాపురిలోని ఫల్గుణ ఇంట్లో ఉన్న శునకం స్నూపీని స్వాధీనం చేసుకున్నారు. చోర త్రయాన్ని రిమాండ్‌కు తరలించి కుక్కను దాని యజమానికి అప్పగించారు.
‘చోరీ’ మూరెడు... ‘రికవరీ’ బారెడు..
దాదాపు ప్రతి చోరీ కేసులోనూ పోయిన సొత్తులో పోలీసుల రికవరీ తక్కువే ఉంటుంది. కానీ ఈ శునక చోరీ కేసులో మాత్రం పోయిన సొత్తుకు దాదాపు 20 రెట్లు ‘రికవరీ’ అయింది. బీగల్ జాతికి చెందిన శునకాన్ని నవీన్ రూ.29 వేలకు ఖరీదు చేశారు. దీన్ని చోరీ చేయడానికి వినియోగించిన దాదాపు రూ.5 లక్షలు ఖరీదు చేసే ఐ 20 కారును కూడా పోలీసులు స్వా«ధీనం చేసుకున్నారు. మరోపక్క చోరీ కేసులో అరెస్టైన నేపథ్యంలో ఫల్గుణ ప్రస్తుతం విదేశానికి వెళ్లడమూ కష్టమే. మొత్తమ్మీద ఓ కుక్క ముగ్గురు జీవితాల్ని మార్చేసింది.
Advertisement
Advertisement