
నియోజకవర్గ నిధులు అడగొద్దు: బాబు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యులు ఈ ఏడాది నియోజకవర్గ అభివృద్ధి నిధులు అడగొద్దని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కూడా పార్టీదే అంతిమ నిర్ణయమన్నారు. రైతు రుణ మాఫీని అమలు చేయటంలో ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. గురువారం టీడీఎల్‌పీ శాసనసభ కమిటీ హాలులో చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పేరును ఎన్‌టీఆర్ సేవగా మార్చాలని నిర్ణయించారు.
సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు తెలి పిన సమాచారం మేరకు.. పార్టీ కార్యకర్తలు కష్టపడితేనే ప్రజాప్రతినిధులమయ్యామని, నియోజకవర్గ స్థాయిలో నియమించే ప్రతి కమిటీలో వారి పేర్లు ఉండాలని, కార్యకర్తల ఆర్థిక పరిపుష్టి బాధ్యత ఎమ్మెల్యేలదేనని చంద్రబాబు పేర్కొన్నారు. నెలాఖరు వరకు రాష్ట్రంలో అన్ని స్థాయిల అధికారులను బదిలీ చేస్తామని చెప్పారు. ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా ప్రత్యేకంగా ఒక సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నామని, దీన్నీ ముఖ్యమంత్రి కార్యాలయం నేరుగా పర్యవేక్షిస్తుందని చెప్పారు. 104, 108 నంబర్ల మార్పుపైనా సమావేశంలో చర్చ జరిగింది.