Rajiv aarogyasri scheme
-
అంకుల్.. మీ వల్లే నేను బతికాను..
నివాళులర్పించిన సాయివర్షిణి అర్వపల్లి: వైఎస్సార్ అంకుల్.. మీవల్లే నేను బతికాను.. అంటూ ఓ విద్యార్థిని మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించింది. నల్లగొండ జిల్లా అర్వపల్లి మండలంలోని పర్సాయపల్లిలో శుక్రవారం వైఎస్సార్ వర్ధంతిని నిర్వహిస్తుండగా.. 9వ తరగతి చదువుతున్న జెట్టి సైదులు కుమార్తె సాయివర్షిణి (13) అక్కడకు వచ్చి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించింది. తనకు ఐదేళ్ల కిందట గుండెజబ్బు రాగా.. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో ఆపరేషన్ చేయించుకున్నానని.. వైఎస్సార్ అంకుల్ ప్రవేశపెట్టిన పథకం వల్లే తాను బతికానని చెప్పింది. ఈ సంఘటనతో అక్కడున్న వారంతా వైఎస్సార్ను గుర్తు చేసుకొని, కంటతడిపెట్టి ఆమెను అక్కున చేర్చుకున్నారు. -
నియోజకవర్గ నిధులు అడగొద్దు: బాబు
సాక్షి, హైదరాబాద్: శాసనసభ్యులు ఈ ఏడాది నియోజకవర్గ అభివృద్ధి నిధులు అడగొద్దని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టంచేశారు. నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కూడా పార్టీదే అంతిమ నిర్ణయమన్నారు. రైతు రుణ మాఫీని అమలు చేయటంలో ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ విషయాన్ని ఎమ్మెల్యేలు అర్థం చేసుకోవాలని పేర్కొన్నారు. గురువారం టీడీఎల్పీ శాసనసభ కమిటీ హాలులో చంద్రబాబు అధ్యక్షతన జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పేరును ఎన్టీఆర్ సేవగా మార్చాలని నిర్ణయించారు. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు తెలి పిన సమాచారం మేరకు.. పార్టీ కార్యకర్తలు కష్టపడితేనే ప్రజాప్రతినిధులమయ్యామని, నియోజకవర్గ స్థాయిలో నియమించే ప్రతి కమిటీలో వారి పేర్లు ఉండాలని, కార్యకర్తల ఆర్థిక పరిపుష్టి బాధ్యత ఎమ్మెల్యేలదేనని చంద్రబాబు పేర్కొన్నారు. నెలాఖరు వరకు రాష్ట్రంలో అన్ని స్థాయిల అధికారులను బదిలీ చేస్తామని చెప్పారు. ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా ప్రత్యేకంగా ఒక సాఫ్ట్వేర్ను రూపొందిస్తున్నామని, దీన్నీ ముఖ్యమంత్రి కార్యాలయం నేరుగా పర్యవేక్షిస్తుందని చెప్పారు. 104, 108 నంబర్ల మార్పుపైనా సమావేశంలో చర్చ జరిగింది. -
యథావిధిగా ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్సలు
ఆలమూరు, న్యూస్లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకానికి వచ్చిన ముప్పేమీ లేదని, యథావిధిగా ఈ పథకం కింద శస్త్ర చికిత్సలు నిర్వహిస్తామని ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసన్న ఆంజనేయులు తెలిపారు. ఆయన గురువారం ఆలమూరులో విలేకరులతో మాట్లాడుతూ ఆర్టికల్ 10 ప్రకారం పదేళ్ల పాటు రాష్ట్రంలో ఎక్కడైనా, ఏఆస్పత్రుల్లోనైనా ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందన్నారు. ఆస్పత్రులకు చెల్లింపులను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటాయన్నారు. జిల్లాలో ఆరోగ్యశ్రీ ప్రారంభమైన ఎనిమిదేళ్ల కాలంలో ఇప్పటి వరకూ 1,72,889 శస్త్రచికిత్సలు జరపగా రూ. 420.11 కోట్లు వ్యయం అయ్యిందన్నారు. ఆలమూరు మండలంలో 2,396 మందికి చికిత్స అందించగా ప్రభుత్వం రూ. 5.58 కోట్లు వ్యయం చేసిందన్నారు. రాష్ర్టంలోనే ఆరోగ్యశ్రీ పథకం అమలులో జిల్లా ప్రథమస్థానంలో నిలిచిందన్నారు. ప్రస్తుతం ఈపథకం కింద 938 రకాల వ్యాధులకు చికిత్సను అందిస్తుండగా 138 వ్యాధులకు కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్సను అందిస్తున్నామన్నారు. రేషన్ కార్డుల్లోని డేటాను పౌరసరఫరాలశాఖతో సరిపోల్చడం వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు చర్యలు చేపట్టినట్టు ప్రసన్న ఆంజనేయులు తెలిపారు.