
యథావిధిగా ఆరోగ్యశ్రీ శస్త్ర చికిత్సలు
ఆలమూరు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకానికి వచ్చిన ముప్పేమీ లేదని, యథావిధిగా ఈ పథకం కింద శస్త్ర చికిత్సలు నిర్వహిస్తామని ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ ప్రసన్న ఆంజనేయులు తెలిపారు. ఆయన గురువారం ఆలమూరులో విలేకరులతో మాట్లాడుతూ ఆర్టికల్ 10 ప్రకారం పదేళ్ల పాటు రాష్ట్రంలో ఎక్కడైనా, ఏఆస్పత్రుల్లోనైనా ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుందన్నారు. ఆస్పత్రులకు చెల్లింపులను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చూసుకుంటాయన్నారు.
జిల్లాలో ఆరోగ్యశ్రీ ప్రారంభమైన ఎనిమిదేళ్ల కాలంలో ఇప్పటి వరకూ 1,72,889 శస్త్రచికిత్సలు జరపగా రూ. 420.11 కోట్లు వ్యయం అయ్యిందన్నారు. ఆలమూరు మండలంలో 2,396 మందికి చికిత్స అందించగా ప్రభుత్వం రూ. 5.58 కోట్లు వ్యయం చేసిందన్నారు. రాష్ర్టంలోనే ఆరోగ్యశ్రీ పథకం అమలులో జిల్లా ప్రథమస్థానంలో నిలిచిందన్నారు.
ప్రస్తుతం ఈపథకం కింద 938 రకాల వ్యాధులకు చికిత్సను అందిస్తుండగా 138 వ్యాధులకు కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్సను అందిస్తున్నామన్నారు. రేషన్ కార్డుల్లోని డేటాను పౌరసరఫరాలశాఖతో సరిపోల్చడం వల్ల తలెత్తుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు చర్యలు చేపట్టినట్టు ప్రసన్న ఆంజనేయులు తెలిపారు.