సాగునీటి పనులు చేపట్టొద్దు
పాలమూరుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్‌జీటీ ఆదేశం
⇒ తాగునీటి పనుల వరకే ప్రస్తుతం పరిమితం కండి
⇒ అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే సాగునీటి పనులు చేయండి
⇒ అంగీకరించిన తెలంగాణ సర్కారు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల కింద చేపట్టిన పనులను తాగునీటి అవసరాలకే పరిమితం చేయాలని, సాగునీటికి సంబంధించిన పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టరాదని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్‌జీటీ, చెన్నై) తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాగునీటి ప్రాజెక్టు కోసం అవసరమైన అన్ని అనుమతులు పొందేంత వరకు ఏ పని కూడా చేయరాదని ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. ఈ మేరకు నంబియార్, పీఎస్ రావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 15కు వాయిదా వేసింది. అటవీ, పర్యావరణ చట్ట నిబంధనలకు విరుద్ధంగా పాలమూరు ప్రాజెక్టు పనులను ప్రభుత్వం చేపట్టిందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని హైదరాబాద్‌కు చెందిన బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఎన్‌జీటీలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ పిటిషన్‌ను పలుమార్లు విచారించిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మోహన్ పరాశరన్, పిటిషనర్ తరఫున సంజయ్ ఉపాధ్యాయ్ వాదనలు వినిపించారు. సంజయ్ ఉపాధ్యాయ్ వాదనలు వినిపిస్తూ.. తాము ప్రాజెక్టును వ్యతిరేకించడం లేదని, కానీ చట్ట పరిధిలో తీసుకోవాల్సిన అన్ని అనుమతులు తీసుకోకపోవడాన్నే తాము ప్రశ్నిస్తున్నామన్నారు. ప్రభుత్వం దీనిని తాగునీటి ప్రాజెక్టుగా పేర్కొంటోందని, డీపీఆర్‌లో మాత్రం సాగునీటి ప్రాజెక్టుగా పేర్కొందని, అందుకు అనుగుణంగా భారీ యంత్రాలతో అడవులను ధ్వంసం చేస్తూ పనులు చేపట్టిందని చెపుతూ.. పలు డాక్యుమెంట్లను ధర్మాసనం ముందుంచారు. దీనిపై మోహన్ పరాశరన్ స్పందిస్తూ.. ప్రాజెక్టు పూర్తిగా తాగునీటికి ప్రాధాన్యమిస్తూ చేపట్టినదేనని, ఆ దిశగానే పనులు కొనసాగిస్తున్నామని వివరించారు.
ప్రాజెక్టు మొదటి దశలో తాగునీటిని , రెండో దశలో సాగునీటిని అందిస్తామని తెలిపారు. అయితే సాగునీటి సరఫరా జరిపే నాటికి పర్యావరణ మంత్రిత్వ శాఖ నుండి పర్యావరణ అనుమతి పొందుతామని తెలిపారు. పర్యావరణ అనుమతి వచ్చిన తర్వాతనే సాగునీటి ప్రాజెక్టు పనులను చేపడతామని తాము స్పష్టమైన హామీ ఇస్తున్నామని ధర్మాసనానికి నివేదించారు. దీంతో ధర్మాసనం పరాశరన్ ఇచ్చిన హామీని నమోదు చేసుకుంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
కొనసాగనున్న డిస్ట్రిబ్యూటరీ సర్వే..
ఇక పాలమూరు ప్రాజెక్టులో భాగంగా డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్(పిల్లకాల్వల వ్యవస్థ) సర్వేకు సంబంధించి పనులు యథావిధిగా కొనసాగుతాయని నీటిపారుదల వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే పిల్లకాల్వల సర్వేకు సంబంధించిన రూ.92 కోట్లు విలువ చేసే పనులను ఏడు ప్యాకేజీలుగా విభజించి గత ఏడాది అక్టోబర్‌లోనే టెండర్లు పిలిచి అర్హత సాధించిన ఏజెన్సీలకు సర్వే బాధ్యతలు కట్టబెట్టారు. ప్రస్తుతం సర్వే పనులు కొనసాగుతున్నాయి. ఇరిగేషన్‌కు సంబంధించిన పనులు చేయవద్దని చెప్పినా.. ప్రస్తుతం డిస్ట్రిబ్యూటరీల్లో సర్వే మాత్రమే కొనసాగుతుండటంతో దానికి ఎలాంటి ఆటంకం ఉండదని నీటి పారుదల వర్గాలు వెల్లడించాయి. సర్వే పూర్తయి డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టే నాటికి పర్యావరణ సహా ఇతర అన్ని రకాల అనుమతులు తెచ్చుకుంటామని స్పష్టం చేశాయి.
టెండర్ల విషయంలో లోపించిన స్పష్టత
కాగా, ప్రాజెక్టు టెండర్ల విషయంలో స్పష్టత లోపించింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇప్పటి వరకు బయటకు రాకపోవడంతో అటు ప్రభుత్వం, ఇటు పిటిషనర్ ఎవరి వాదన వారు చెబుతున్నారు. ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియను నిలిపేసిందని పిటిషనర్ చెబుతుంటే, అటువంటిదేమీ లేదని సాగునీటి అధికారులు చెబుతున్నారు. మధ్యంతర ఉత్తర్వుల కాపీ బయటకు వస్తే గానీ ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం లేదు. ట్రిబ్యునల్ ఆదేశాలతో ప్రాజెక్టు పనులు కొనసాగించేందుకు ఎలాంటి ఆటంకాలు లేవని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ లింగరాజు స్పష్టం చేశారు.