Irrigation works
-
ప్రాజెక్టు పనులకు పెద్దపీట
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో సాగునీటి పనులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. జీఎన్ఎస్ఎస్, తెలుగుగంగ పరిధిలోని ప్రాజెక్టులలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఆ పనులను పూర్తి చేసి ఆయా ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా 1.65 టీఎంసీల సామర్థ్యం కలిగిన వామికొండ సాగర్, 3.06 టీఎంసీల సామర్థ్యం కలిగిన సర్వరాయసాగర్ ప్రాజెక్టుల పరిధిలోని డిస్ట్రిబ్యూటరీ పనులతోపాటు కట్ట రివిట్మెంట్, లీకేజీ అరికట్టే పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి సూచనలతో ఇప్పటికే సదరు పనులను పూర్తి చేసేందుకు అధికారులు అంచనాలను సిద్ధం చేశారు. రూ. 212 కోట్లతో ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ పనులను పూర్తిచేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పనుల కోసం టెండరు ప్రక్రియ సాగుతోంది. నేడో, రేపో ఈ పనులకు ప్రభుత్వం టెండర్లు పిలువనుంది. టెండరు ప్రాసెస్ అయిన వెంటనే పనులు మొదలు పెట్టనున్నారు. జూన్ నాటికి 15 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అత్యంత వేగంగా పనులు చేపట్టి వచ్చే జూన్ నాటికి దాదాపుగా పనులు పూర్తి చేసి 15 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలుత రెండు ప్రాజెక్టుల పరిధిలోని డిస్ట్రిబ్యూటరీ పనులను పూర్తి చేయనున్నారు. దీంతోపాటు రెండు రిజర్వాయర్ల బండ్ (కట్ట)లో పెండింగ్‌లో ఉన్న రివిట్మెంట్ పనులను పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత వామికొండ పరిధిలోని ఒంటిగారిపల్లె, సర్వరాయసాగర్ పరిధిలో కట్ట లీకేజీలను అరికట్టే పనులను చేపట్టనున్నారు. ప్రస్తుతం రెండు రిజర్వాయర్ల కట్ట పరిధిలో నీరు లీక్ అవుతుండడంతో ఒంటిగారిపల్లె, ఇందుకూరు గ్రామాల పొలాల్లో నిత్యం నీరు నిల్వ ఉంటోంది. దీంతో ఆ భూముల్లో పంటలు వేసేందుకు వీలు లేకుండా పోయింది. నీటి లీకేజీని అరికడితే తప్ప ఆ ప్రాంతంలోని పొలాల్లో పంటల సాగుకు అవకాశం లేదు. తక్షణమే కట్ట లీకేజీ అరికట్టే పనులను రూ. 12 కోట్లతో చేపట్టాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వేగంగా భూ సేకరణ డిస్ట్రిబ్యూటరీ పనులు చేపట్టేందుకు వీలుగా 795 ఎకరాలను ప్రభుత్వం భూ సేకరణ కింద సేకరించాల్సి ఉంది. ఇప్పటికే 60 శాతం భూ సేకరణ పూర్తి కాగా, మిగిలిన 40 శాతం భూ సేకరణ చివరి దశలో ఉంది. టెండర్లు పూర్తయ్యే నాటికి భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. సాగులోకి 35 వేల ఎకరాల ఆయకట్టు డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తయితే వామికొండ పరిధిలో ముద్దనూరు, వీఎన్ పల్లె ప్రాంతాల్లో 10 వేల ఎకరాల ఆయకట్టుకు అలాగే సర్వరాయసాగర్ పరిధిలో కమలాపురం నియోజకవర్గంలో 25 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. రెండు ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 35 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అన్ని పనులను పూర్తి చేసి పై రెండు ప్రాజెక్టుల పరిధిలో పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ పెట్టాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే జూన్ నాటికి వీలైనంత వరకు పనులను పూర్తి చేసి 15–20 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాలని అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత మిగిలిన పనులు పూర్తి చేసి మొత్తం ఆయకట్టుకు నీటిని అందించనున్నారు. భూ సేకరణ పనులు దాదాపు పూర్తి వామికొండ, సర్వరాయసాగర్ పరిధిలో ఉన్న అసంపూర్తి పనులు పూర్తి చేసేందుకు రూ. 212 కోట్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. త్వరలోనే టెండరు ప్రక్రియ పూర్తి కానుంది. ఈ ప్రాజెక్టుల పరిధిలో డిస్ట్రిబ్యూటరీలు, ఇతర పనుల కోసం 795 ఎకరాల భూమి అవసరం ఉండగా, 60 శాతం భూ సేకరణకు సంబం«ధించి అవార్డు ప్రక్రియ పూర్తయింది. మిగిలిన 40 శాతం సేకరణకు సంబంధించి అవార్డు దశలో ఉంది. త్వరలోనే భూ సేకరణ ప్రక్రియ పూర్తి అవుతుంది. పనులు పూర్తయితే రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. – వి.విజయరామరాజు, కలెక్టర్, వైఎస్సార్ జిల్లా వామికొండ సర్వరాయసాగర్ పరిధిలో త్వరలో పెండింగ్ పనులు పూర్తి వామికొండ, సర్వరాయసాగర్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న డిస్ట్రిబ్యూటరీ, రివిట్మెంట్, కట్ట లీకేజీ అరికట్టే పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం రూ. 212 కోట్ల పనులకు అనుమతులు ఇచ్చింది. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి కానుంది. వెంటనే పనులు మొదలు పెట్టి వచ్చే ఏడాది జూన్ నాటికి 15 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ తర్వాత మిగిలిన పనులు పూర్తి చేసి మొత్తం 35 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నాం. – మల్లికార్జునరెడ్డి, ఎస్ఈ, జీఎన్ఎస్ఎస్, కడప -
సాగునీటి పనుల్లో స్పీడ్ పెరగాలి
సాక్షి, అమరావతి: ఎర్రబల్లి ఎత్తిపోతల పథకం, గాలేరు నగరి నుంచి హంద్రీనీవా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులను వేగవంతం చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. గండికోట నుంచి చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, గండికోట–పైడిపాలెం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులను త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. వేంపల్లి భూగర్భ డ్రైనేజీ పనుల కోసం రూ.92 కోట్లు వెంటనే మంజూరు చేయాలని ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. 2019, 2020ల్లో మైదుకూరు, రాయచోటి, కడప, పులివెందుల పర్యటనలో భాగంగా జిల్లాలో నిర్వహించిన శంకుస్థాపనలు, పనుల ప్రగతిని సీఎం పరిశీలించారు. పులివెందుల ఏరియా డెవలప్మెంట్ ఏజెన్సీ(పాడా)పై ముఖ్యమంత్రి జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సీఎం సమీక్ష వివరాలివీ.. ► పులివెందుల మెడికల్ కాలేజీకి ఈ వారంలో భూమి పూజ చేసి పనులు ప్రారంభించాలి. ► వేంపల్లి, పులివెందుల్లో ఒక్కొక్కటి రూ.కోటి వ్యయంతో మోడల్ రైతుబజార్ల మంజూరు. ► పులివెందులలో క్రికెట్ స్టేడియానికి 14 ఎకరాల భూమి ► పులివెందుల మోడల్ టౌన్ టెండర్లు ఈ నెల 25వతేదీలోగా పిలిచి ప్రక్రియ పూర్తి చేయడంతో పాటు పనులు ప్రారంభించాలి. ► పెన్నా నదిపై ఆర్టీపీపీ, కొత్తగా ఏర్పాటు చేయబోయే స్టీల్‌ప్లాంట్‌కు రహదారి, హైలెవల్ బ్రిడ్జ్ నిర్మాణానికి ఆదేశం. ► దీర్ఘకాలంగా ఆగిపోయిన వైఎస్సార్ ఇంజనీరింగ్ కాలేజీ కొత్త భవనాలకు రూ.66 కోట్లు మంజూరుకు ఆదేశం. ► కడప ఎయిర్‌పోర్ట్‌లో విమానాల నైట్ ల్యాండింగ్ కోసం భూసేకరణ నిధులు చెల్లించాలని ఆర్థిక శాఖకు ఆదేశం. ► బద్వేల్, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులపై కూడా సీఎం సమీక్షించారు. -
అదనపు ఆయ(కని)కట్టు
పాలకులు చెబుతున్న ఆయకట్టు మాటలు కనికట్టుగా మారిపోతున్నాయి. ఫలితంగా అన్నదాత ఆశలు ఆవిరవుతున్నాయి. పాలకుల మాటలపై ఆశలు పెంచుకొని రైతులు ఎదురు చూడడమే తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు. దీంతో పనుల అంచనా విలువ పెరిగి తడిపిమోపెడవుతుంది. అయినా పనులు జరిగిన పరిస్థితులు కనిపించడం లేదు. బొబ్బిలి: వెంగళరాయ సాగర్ జలాశయం ద్వారా 24వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందిస్తున్నా అంతకు మించి సాగునీరు ఇచ్చే సామర్ధ్యం ఉందని ఉన్నతాధికారులు గుర్తించారు. అప్పటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గొల్లపల్లి వద్ద శిలాఫలకం వేసి రూ.5 కోట్లతో పనులు ప్రారంభించారు. గుత్తేదారులు, అధికారుల నిర్లక్ష్యంతో ఆ పనులు అంచనాలు పెరిగిపోయి పలుమార్లు నిలిచిపోయాయి. ఆ తరువాత 2013లో రూ.12.67 కోట్లతో ప్రారంభించిన పనులు కేవలం 18 నెలల్లో చేపడతామని చెప్పినా నత్తనడకన సాగుతున్నాయి. సీతానగరం మండలంలోని ఐదు గ్రామాలు, బొబ్బిలి మండలంలోని 13 గ్రామాల్లో 4,996 ఎకరాలకు సాగునీరందించేందుకు చేపట్టిన ఈ పనులకు సంబంధించి ఇంకా భూ సేకరణ కూడా పూర్తి కాలేదు. రాముడువలస, చింతాడ తదితర గ్రామాల్లో రైతులు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. ఇప్పటికి రెండుసార్లు గడువు పూర్తయినా కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. నేటికీ ఇంకా 25 శాతం కూడా పూర్తవని పనులు ఈ ఏడాది మార్చి నాటికి ఐదు వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉన్నా పనుల నత్తనడక కారణంగా సాధ్యమయ్యే పరిస్థితి కానరావడం లేదు. వెన్నెల బుచ్చెంపేట నుంచి కలువరాయి వరకూ గల 3.45 కిలోమీటర్ల మేర కాలు నిర్మాణం పూర్తయింది. అక్కడి నుంచి చింతాడ వరకూ గల కాలువ నిర్మాణం కోసం పది ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉంది. కానీ దీనికి పరిహారంపై రైతులు అభ్యంతరం చెబుతున్నారు. అటు కాంట్రాక్టర్ పనులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. అయితే బిల్లులు చెల్లింపుల్లో కూడా సాగదీత ఉన్నట్టు కనిపిస్తున్నది. ఇప్పటి వరకు కాంట్రాక్టర్‌కు రూ.2.43కోట్లు చెల్లించారు. బిల్లుల పెండింగ్‌తో పాటు భూ సేకరణ అడ్డంకిగా మారింది. ఇంకా రాముడువలస, చింతాడ, కలువరాయి గ్రామాలకు చెందిన 26 మంది రైతుల నుంచి 22 ఎకరాలు సేకరించాల్సి ఉంది. దీనిపై కనీసం కదలిక లేదు. మరో పక్క సీతానగరం మండలం ఎన్సీఎస్ సుగర్ ఫ్యాక్టరీ వద్ద రూ.3కోట్లతో అక్విడెక్ట్‌ను నిర్మించాల్సి ఉంది. ఈ నిర్మాణాలపై ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చలు జరుగుతున్నాయి. మరో పక్క అదనపు ఆయకట్టు సాధించామని అధికార పార్టీ నేతలు గొప్పలు చెప్పుకోవడం తప్ప ఎటువంటి పురోగతి లేదని, దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం మానేశారని రైతాంగం విమర్శిస్తున్నది. ఇప్పటికే వెంగళరాయ సాగర్ ఆయకట్టు చివరి భూములకు నీరందని పరిస్థితి నెలకొందని, దీనిని పక్కన పెట్టేసిన యంత్రాంగం అదనపు ఆయకట్టును కూడా నిదానంగా పర్యవేక్షిస్తోందని ఆరోపిస్తున్నారు. పనులు జరిపిస్తున్నాం... వెంగళరాయ సాగర్ అదనపు ఆయకట్టు పనులు జరిపిస్తున్నాం. కాంట్రాక్టర్‌కు పలుమార్లు నోటీసులు ఇచ్చాం. ప్రస్తుతం బొబ్బిలి శివారులో అక్విడెక్ట్ పనులు జరుగుతున్నాయి. మార్చి నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తెస్తున్నాం. –కె.బాలసూర్యం, డీఈఈ, బొబ్బిలి డివిజన్ -
సాగునీటి పనులు త్వరగా పూర్తి చేయాలి
సాక్షి, ఖమ్మం: ఖమ్మం,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో నిర్మాణంలో ఉన్న సాగునీటి పథకాలను పూర్తి చేయడంతోపాటు, కొత్తగా మరికొన్ని పథకాలు చేపడుతున్నట్టు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో ఇరిగేషన్ సబ్‌కమిటీ సమావేశం మంత్రి హరీష్ రావు అధ్యక్షతన జరిగింది. రెండు జిల్లాల్లో చేపడుతున్న సాగునీటి పథకాలను త్వరగా పూర్తి చేయాలని సమావేశంలో పాల్గొన్న సంబంధిత అధికారులను మంత్రులిద్దరూ ఆదేశించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి, సబ్ కమిటీ సభ్యుడు కడియం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. నూతన పథకాలపై చర్చ ► చర్ల మండలంలో వద్దిపేట చెక్‌డ్యామ్ మంజూరుపై చర్చించారు. ► టేకులపల్లి మండలంలో పరికెలవాగు చెక్‌డ్యామ్ మంజూరు. ► అశ్వారావుపేట మండలంలో అంకమ్మచెరువు దబ్బతోగు చెరువుకు మళ్లించే పథకం మంజూరు. ► సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో బేతుపల్లి హైలెవల్ కెనాల్‌కు సంబంధించి పెండింగ్ పనుల మంజూరుపై మాట్లాడారు. ► తిరుమలాయపాలెం మండలంలోని తానంచెర్ల డైవర్షన్ స్కీం మంజూరుపై చర్చించారు. ► వైరా ప్రాజెక్టు పరిధిలో సిరిపురం వద్ద ఎడమ కాలువపై ఓటీ స్లూయీస్ మంజూరుపై మాట్లాడారు. కొనసాగుతున్న పథకాలపై సమీక్ష.. ► తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్ మండలాల్లో ఎస్సారెస్పీ స్టేజ్–2 పథకాన్ని త్వరితగతిన పూర్తి చేసి భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా అన్ని చెరువులకు సాగునీటిని అందించేలా తగు చర్యలు చేపట్టాలని సూచించారు. ► సింగరేణి మండలంలో గతంలో మంజూరైన బుగ్గవాగు చెక్‌డ్యామ్ నిర్మాణ పనులు వేగిరం చేయాలన్నారు. ► శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని పూర్తి ఆయకట్టు స్థిరీకరణ కోసం సప్లిమెంటేషన్ పథకాన్ని చేపట్టాలని ఇరిగేషన్ కేబినెట్ సబ్‌కమిటీ అభిప్రాయపడింది. ఎస్సారెస్పీ వరద కాలువపై కేబినెట్ సబ్ కమిటీలో సుదీర్ఘంగా సమీక్షించారు. -
సాగునీటి పనులు చేపట్టొద్దు
పాలమూరుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశం ⇒ తాగునీటి పనుల వరకే ప్రస్తుతం పరిమితం కండి ⇒ అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే సాగునీటి పనులు చేయండి ⇒ అంగీకరించిన తెలంగాణ సర్కారు సాక్షి, హైదరాబాద్: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల కింద చేపట్టిన పనులను తాగునీటి అవసరాలకే పరిమితం చేయాలని, సాగునీటికి సంబంధించిన పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేపట్టరాదని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ, చెన్నై) తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. సాగునీటి ప్రాజెక్టు కోసం అవసరమైన అన్ని అనుమతులు పొందేంత వరకు ఏ పని కూడా చేయరాదని ప్రభుత్వానికి తేల్చిచెప్పింది. ఈ మేరకు నంబియార్, పీఎస్ రావుతో కూడిన ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను మార్చి 15కు వాయిదా వేసింది. అటవీ, పర్యావరణ చట్ట నిబంధనలకు విరుద్ధంగా పాలమూరు ప్రాజెక్టు పనులను ప్రభుత్వం చేపట్టిందని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని హైదరాబాద్‌కు చెందిన బీరం హర్షవర్ధన్‌రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌ను పలుమార్లు విచారించిన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మోహన్ పరాశరన్, పిటిషనర్ తరఫున సంజయ్ ఉపాధ్యాయ్ వాదనలు వినిపించారు. సంజయ్ ఉపాధ్యాయ్ వాదనలు వినిపిస్తూ.. తాము ప్రాజెక్టును వ్యతిరేకించడం లేదని, కానీ చట్ట పరిధిలో తీసుకోవాల్సిన అన్ని అనుమతులు తీసుకోకపోవడాన్నే తాము ప్రశ్నిస్తున్నామన్నారు. ప్రభుత్వం దీనిని తాగునీటి ప్రాజెక్టుగా పేర్కొంటోందని, డీపీఆర్‌లో మాత్రం సాగునీటి ప్రాజెక్టుగా పేర్కొందని, అందుకు అనుగుణంగా భారీ యంత్రాలతో అడవులను ధ్వంసం చేస్తూ పనులు చేపట్టిందని చెపుతూ.. పలు డాక్యుమెంట్లను ధర్మాసనం ముందుంచారు. దీనిపై మోహన్ పరాశరన్ స్పందిస్తూ.. ప్రాజెక్టు పూర్తిగా తాగునీటికి ప్రాధాన్యమిస్తూ చేపట్టినదేనని, ఆ దిశగానే పనులు కొనసాగిస్తున్నామని వివరించారు. ప్రాజెక్టు మొదటి దశలో తాగునీటిని , రెండో దశలో సాగునీటిని అందిస్తామని తెలిపారు. అయితే సాగునీటి సరఫరా జరిపే నాటికి పర్యావరణ మంత్రిత్వ శాఖ నుండి పర్యావరణ అనుమతి పొందుతామని తెలిపారు. పర్యావరణ అనుమతి వచ్చిన తర్వాతనే సాగునీటి ప్రాజెక్టు పనులను చేపడతామని తాము స్పష్టమైన హామీ ఇస్తున్నామని ధర్మాసనానికి నివేదించారు. దీంతో ధర్మాసనం పరాశరన్ ఇచ్చిన హామీని నమోదు చేసుకుంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కొనసాగనున్న డిస్ట్రిబ్యూటరీ సర్వే.. ఇక పాలమూరు ప్రాజెక్టులో భాగంగా డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్(పిల్లకాల్వల వ్యవస్థ) సర్వేకు సంబంధించి పనులు యథావిధిగా కొనసాగుతాయని నీటిపారుదల వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే పిల్లకాల్వల సర్వేకు సంబంధించిన రూ.92 కోట్లు విలువ చేసే పనులను ఏడు ప్యాకేజీలుగా విభజించి గత ఏడాది అక్టోబర్‌లోనే టెండర్లు పిలిచి అర్హత సాధించిన ఏజెన్సీలకు సర్వే బాధ్యతలు కట్టబెట్టారు. ప్రస్తుతం సర్వే పనులు కొనసాగుతున్నాయి. ఇరిగేషన్‌కు సంబంధించిన పనులు చేయవద్దని చెప్పినా.. ప్రస్తుతం డిస్ట్రిబ్యూటరీల్లో సర్వే మాత్రమే కొనసాగుతుండటంతో దానికి ఎలాంటి ఆటంకం ఉండదని నీటి పారుదల వర్గాలు వెల్లడించాయి. సర్వే పూర్తయి డిస్ట్రిబ్యూటరీల పనులు చేపట్టే నాటికి పర్యావరణ సహా ఇతర అన్ని రకాల అనుమతులు తెచ్చుకుంటామని స్పష్టం చేశాయి. టెండర్ల విషయంలో లోపించిన స్పష్టత కాగా, ప్రాజెక్టు టెండర్ల విషయంలో స్పష్టత లోపించింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇప్పటి వరకు బయటకు రాకపోవడంతో అటు ప్రభుత్వం, ఇటు పిటిషనర్ ఎవరి వాదన వారు చెబుతున్నారు. ప్రాజెక్టు టెండర్ల ప్రక్రియను నిలిపేసిందని పిటిషనర్ చెబుతుంటే, అటువంటిదేమీ లేదని సాగునీటి అధికారులు చెబుతున్నారు. మధ్యంతర ఉత్తర్వుల కాపీ బయటకు వస్తే గానీ ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం లేదు. ట్రిబ్యునల్ ఆదేశాలతో ప్రాజెక్టు పనులు కొనసాగించేందుకు ఎలాంటి ఆటంకాలు లేవని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ లింగరాజు స్పష్టం చేశారు. -
ఇరిగేషన్ పనుల్లో రూ.400 కోట్ల అవినీతి
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇందుకూరుపేట: జిల్లాలో నీటిపారుదల శాఖ పనుల్లో రూ.400 కోట్లు తెలుగుతమ్ముళ్లు, అధికారులు దిగమింగారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోపించారు. మండలంలోని ముదివర్తిపాలెంలో సోమవారం గడగడపకు వైఎస్సార్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మట్లాడారు. ఒక్క కోవూరు నియోజవర్గంలోనే రూ.50 కోట్ల అవినీతి జరిగిందన్నారు. దీనికి ప్రధాన కారకులు కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అని విమర్శించారు. పనులు ఎక్కడా సక్రమంగా జరిగిన పాపాన పోలేదన్నారు. పది రోజుల నుంచి ఇరిగేషన్ అవినీతిపై అన్ని పత్రికల్లో పతాక స్థాయిలో శీర్షికలు ప్రచురితమవుతున్నాయన్నారు. ఎమ్మెల్యే పోలంరెడ్డి అనుచరులు, బంధువులు రూ.కోట్లు పనులు చేయకుండానే ఇరిగేషన్ డబ్బును డ్రా చేశారని వివరించారు. పోలంరెడ్డి బావ మాతూరు రామసుబ్బారెడ్డి, అయన సోదరడు దశరథరామిరెడి, సొంత తమ్ముడు నీటి సంఘం నాయకులు వెంకటేశ్వరరెడ్డి బినామీలుగా వ్యవహరిస్తున్నారన్నారు. చెముకుల చైతన్య, కోటంరెడ్డి అమరేంద్రనాథ్‌రెడ్డి అనేవారు ఎమ్మెల్యే అనుచరులు మాత్రమేనన్నారు. వీరికి ఇరిగేషన్ శాఖలో ఎలాంటి పదవి, హోదాలు లేవన్నారు. బ్యాంకుల నుంచి రూ.54 లక్షలు డ్రా చేశారని వీరి అవినీతికి నిదర్శననానికి ఇది ఒక శాంపిల్ మాత్రమేనని చెప్పారు. ఎమ్మెల్యే తిన్న డబ్బాంతా రికవరీ చేసి అధికారులు పర్సంటేజీలను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మావులూరు శ్రీనివాసులురెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి విజయ్‌కుమార్, జెడ్పీటీసీ బీవీ రమణయ్య పాల్గొన్నారు. -
ఇరిగేషన్ పనుల్లో అవినీతిపై హైకోర్టును ఆశ్రయించిన రైతులు
విడవలూరు: జిల్లాలో రెండేళ్లుగా నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో జరిగిన వివిధ పనుల్లో సుమారు రూ.300 కోట్ల అవినీతి జరిగినట్లు విడవలూరు మండలానికి చెందిన రైతులు బెజవాడ గోవర్ధన్‌రెడ్డి, అనపల్లి ఉదయ్‌భాస్కర్ హైకోర్టును ఆశ్రయించారు. స్పందించిన న్యాయస్థానం కేసును స్వీకరిస్తూ (డీడబ్ల్యూపీ నంబర్ 161672) నిర్ణయం తీసుకుంది. హైకోర్డులో రైతులు వేసిన పిటిషన్లో జిల్లాలో నీటిపారుదలశాఖ కింద జరిగిన పనుల్లోని అవినీతిని వెలికి తీయాలంటే తప్పక సీబీఐతో విచారణ చేయాలని రైతులు ప్రధానంగా పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో జిల్లాలో నీరు–చెట్టు, ఎఫ్డీఆర్, ఓఅండ్ఎం కింద జరిగిన వివిధ పనుల్లో భారీ అవినీతి చోటు చేసుకుందని తెలిపారు. ముఖ్యంగా కోవూరు నియోజకవర్గ ప్రజా ప్రతినిధి అండతో విడవలూరు, కొడవలూరు మండలాల్లో రూ.35 కోట్లతో నీటిపారుదల శాఖలో పనులు చేశారని పేర్కొన్నారు. ఇందులో నీరు–చెట్టు కింద చేసిన పనులను తిరిగి ఉపాధి హామీలో, ఎఫ్‌డీఆర్‌లో పనులు చేశారని తెలిపారు. ఈ పనుల్లో ఆ ప్రజాప్రతినిధి, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు భారీ అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ అవినీతిపై విచారణ చేసి అవినీతిని నిగ్గు తేల్చాలని లోకాయుక్తను ఆశ్రయించిన రైతులు అనంతరం క్వాలిటీ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అంతే కాకుండా కలెక్టర్, విజిలెన్స్ అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. తమ్ముళ్లలో గుబులు ఇరిగేషన్ పనులలో భారీ అవినీతిపై పెన్నాడెల్టా రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో పాటు సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేయడంతో కోవూరు నియోజకవర్గ పరిధిలోని తెలుగు -
పూతను కాపాడితేనే కాత
మంచిర్యాల రూరల్ : మామిడి సాగు చేసిన రైతుకు ముందు చూపు అవసరం. మామిడి తోటల్లో సరైన యాజమాన్యం పాటించి సాగు చేస్తూ, మామిడి పూత, కాత రాలిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటేనే మంచి దిగుబడి సా ధ్యం. మామిడి సాగులో తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందే చిట్కాలు, నవంబర్‌లో రైతులు పాటించాల్సిన పద్ధతులను మంచిర్యాల ఉద్యాన శాఖ అధికారి సౌమ్య వివరించారు. జిల్లాలో 25 వేల హెక్టార్లలో మామిడి తోటలు సాగవుతున్నాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులకు తోడు, చీడపీడలు ఆశించడం వల్ల దిగుబడుల్లో తగ్గుదల, నాణ్యత తగ్గి రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. రైతులు అవగాహన లేమితో తమకు తోచిన విధంగా సేద్యం పనులు చేస్తున్నారు. ఇలాంటి వాటిని ఉద్యాన శాఖ అధికారుల సూచనల మేరకు చేపడితే నాణ్యమైన దిగుబడులు పొందవచ్చు. నవంబర్‌లో మామిడి రైతులు చేపట్టాల్సిన, పాటించాల్సిన సస్యరక్షణ చర్యలు ఇవీ. చేయాల్సిన పని ఈ నెలలో చెట్లకు పూర్తి విశ్రాంతిని ఇవ్వాలి. సస్యరక్షణ చర్యలు తప్పితే మరే విధమైన సేద్యపు పనులు చేయరాదు. ముఖ్యంగా ఈ నెలలో రైతులు ఎలాంటి కత్తిరింపులు చేపట్టకూడదు. నీటిని కూడా వదలొద్దు. ఒక్కోసారి చలి వాతావరణం ఎక్కువగా ఉన్నప్పుడు మొగ్గలు ఆలస్యంగా కనిపిస్తాయి. వాటిని ఉత్తేజ పరిచి పూత త్వరగా రావడానికి డిసెంబర్ 15-20 తేదీల మధ్య ఈ కింది పద్ధతులు పాటించాలి. నీటి వసతి ఉన్న తోటల్లో తేలికపాటి తడి ఇవ్వడం లేదా లీటరు నీటిలో 10 గ్రాముల పొటాషియం, నైట్రేట్, 5 గ్రాముల యూరియా కలిపి చెట్టుపై పిచికారీ చేయడం వల్ల మొగ్గలు వస్తాయి. సస్యరక్షణ తప్పనిసరి మామిడి పూతకు ముందు, పూత సమయం, కాయ ఎదిగే దశలో అనేక రకాల పురగులు, తెగుళ్లు ఆశించి పంటకు అపార నష్టం కలుగజేస్తాయి. అలాగే సరైన నీటి యాజమాన్యం, పోషకాల యాజమాన్యం సరిగా చేపట్టని తోటల్లో పిందెలు ఎక్కువగా రాలిపోయి, కాయ సైజు తగ్గి నాణ్యత లోపిస్తుంది. దీని నివారణకు కింది జాగ్రత్తలు పాటించాలి. బూడిద తెగులు లేత ఆకులు, పూత, కాండాలను, పూల మీద, చిరుపిందెల మీద, తెల్లని పౌడరు లాంటి బూజు రాత్రిపూట చల్లని వాతావరణం, పగలు వెచ్చని వాతావరణం ఉన్నప్పుడు ఈ తెగులు ఆశిస్తుంది. దీనివల్ల పూత, పిందెలు రాలిపోతాయి. నివారణ మొగ్గలు కనిపించే దశలో లీటరు నీటికి 3 గ్రాముల గంధకం(నీటిలో కరిగే) కలిపి పిచికారీ చేయాలి పూత దశలో తెగులు కనిపించిన హెక్సాకోన జోల్ 2 మిల్లీలీటర్లు లేదా ప్రొపికోనజోల్ 1 మిల్లీలీటరు లేదా డినోకాప్ లేదా ట్రైడిమార్ఫ్ 1 మిల్లీలీటరు చొప్పున నీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుపచ్చ/పూతమాడు, నల్లమచ్చ తెగుళ్లు వర్షాలు/పొగమంచు అధికంగా ఉన్న సమయంలో ఈ తెగుళ్లు వ్యాపిస్తాయి. ఈ తెగులు లేత ఆకులు, పూలు, పండ్లను ఆశించి నష్టపరుస్తుంది. ఆకుల మీద గోధుమ రంగు మచ్చలు ఏర్పడి క్రమంగా మచ్చలు పోయి ఆకు త్వరగా పండుబారి రాలిపోతాయి. రెమ్మలపైనా నల్లని మచ్చలు ఏర్పడి పూలగుత్తులు, పూలు మాడిపోతాయి. కాయలు రాలిపోతాయి. నివారణ పూత దశకు ముందే ఎండిన కొమ్మలను కత్తిరించి తగుల బెట్టాలి. సూర్యరశ్మి సోకేలా కొమ్మలను జూన్, జూలై మాసంలో కత్తిరింపులు చేసి, లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సీ క్లోరైడ్ లేదా 1 శాతం బోర్డో మిశ్రమం కలిపి పిచికారీ చేయాలి. పూతకు ముందే 3 గ్రాముల కాపర్ ఆక్సీ ఫ్లోరైడ్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పచ్చి పూత మీద ఒక గ్రాము కార్బండిజమ్, ఒక గ్రాము థయోఫినేట్, మిథైల్‌ను లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. పిందె దశలో లీటరు నీటిలో 2.5 గ్రాముల మండోజెల్ లేదా రెండు గ్రాముల ఆంట్రాకాల్ కలిపి స్ప్రే చేయాలి. తేనె మంచు పురుగులు తల్లి, పిల్ల పురుగులు గుంపులుగా చేరి లేత ఆకులు, పూత కాండాలు, పూలు, లేత పిందెల నుంచి రసం పీలుస్తాయి. లేత ఆకులను ఆశించినప్పుడు ఆకుల చివర్లు, అంచులు, పూత మాడిపోతాయి. పిందెలు ఏర్పడవు, ఏర్పడినా బలహీనంగా ఉండి రాలి పోతాయి. అంతేకాకుండా తేనెలాంటి తియ్యటి పదార్థాన్ని విసర్జింజడం వల్ల ఆకులు, కాండాలు, కాయలపై మసి పొర ఏర్పడుతుంది. దీంతో ఆకుల్లో కిరణ జన్య సంయోజన క్రియ జరగక కాయలు చిన్నవై రాలిపోతాయి. పూత, పిందె సమయంలో ఈ పురుగుల ఉధృతి అధికంగా ఉంటుంది. మిగతా సమయంలో చెట్ల మొదలు, కొమ్మల బెరడులోని పగుళ్లలో ఉంటాయి. కాయలపై మసి ఏర్పడి, నాణ్యత కోల్పోతాయి. నివారణ పూత మొగ్గ దశలో : లీటరు నీటికి 1 మిల్లీలీటరు డైక్లోరోఫాస్ లేదా 3 గ్రాముల కార్బోరిల్ కలిపి చెట్టంతా తడిసే విధంగా పిచికారీ చేయాలి. పచ్చపూత దశ : పూత కాండలు బయటకు వచ్చి, పూలు వికసించకుండా ఇంకా మొగ్గ దశలో ఉన్నప్పుడు లీటరు నీటికి 2 మిల్లీలీటర్లు మోనోక్రోటోపాస్ లేదా డైమిథోయేట్ లేదా 3 మిల్లీలీటర్లు మిథైల్ డెమటాన్ లేదా 0.25 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ పిచికారీ చేయాలి. నల్లపూత దశ : ఈ దశలో పిందెలు బఠాణి గింజ నుంచి చింతగింజ సైజులో ఉంటాయి. లీటరు నీటికి ఒక మిల్లీలీటరు పాస్పోమిడాన్ లేదా 2 మిల్లీలీటర్లు మిథైల్ డెమటాన్ లేదా డైమిథోయేట్ లేదా గ్రాము ఎఫిసేట్ కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగులు ఈ పురుగులు కొత్త చిగురు వచ్చే దశలో ఆకులపై అసంఖ్యాకంగా చేరి, గోకి రసాన్ని పీల్చి వేస్తాయి. దీని వల్ల చిగురు ఆకులు చాలా చిన్నవిగా ఉండి, ఆ తర్వాత రాలిపోతాయి. పిందె ఏర్పడే దశలో కాయపై గోకి బయటకు వచ్చి రసాన్ని పీల్చేస్తాయి. ఈ పురుగు ఆశించిన కాయలపై రాతి మంగు లేదా ఏనుగు మంగు ఏర్పడి కాయ నాణ్యత కోల్పోతుంది. నివారణకు లీటరు నీటికి గ్రాము ఎఫిసేట్ లేదా 1 మిల్లీలీటరు పాసోమిడాన్ లేదా 2 మిల్లీలీటరు రిజెంటును కలిపి పిచికారీ చేయాలి. -
అంచనాల మాయ
= అర్ధంతరంగా నిలిచిన సాగునీటి పనులు = అంచనాలు పెంచుకునేందుకు అధికారులపై ఒత్తిడి = సగంకూడా పూర్తి కాని పనులు = అందిన కాడికి దండుకుని ఉడాయిస్తున్న కాంట్రాక్టర్లు సాక్షి, నెల్లూరు: సాగునీటి పనులకు పాలకుల నిర్లక్ష్యం అడ్డంకిగా మారింది. అధికారం అండతో కోట్లాది రూపాయల పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు వాటిని అర్ధంతరంగా నిలిపేశారు. ఈ క్రమంలో జిల్లాలో చేపట్టిన సాగునీటి పారుదల అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఆగిపోయాయి. ఏళ్లు గడుస్తున్నా 40 శాతం పనులు కూడా పూర్తికాలేదని ఇరిగేషన్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో రైతులకు ఏటా సాగునీటి కష్టాలు తప్పడం లేదు. మరోవైపు కాంట్రాక్టర్లు మాత్రం ఆర్థికంగా బలపడుతున్నారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పనుల కోసం 2005 నుంచి వందల కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిబంధనల మేరకు అగ్రిమెంట్ తేదీ నుంచి రెండేళ్లలో పూర్తి చేయాలి. అయితే లాభదాయకంగా ఉంటున్న కాలువల తవ్వకాలు, మట్టి కట్టల ఆధునికీకరణ తదితర పనులకు మాత్రం ప్రాధాన్యం ఇచ్చి బిల్లులు చేసుకుంటున్నారు. కాంక్రీట్ పనులను మాత్రం గాలికి వదిలేస్తున్నారు. అగ్రిమెంట్ గడువు ముగిసినా అధికారులతో కుమ్మక్కై నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. పనులు కష్టంగా ఉన్నాయని, రేట్లు పెరిగాయని సాకులు చూపి అంచనాలు పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అధికార పార్టీ అండతో అంచనాలను ఇబ్బడిముబ్బడిగా పెంచుకుని కోట్లు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీరికి కొందరు ఇరిగేషన్ అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నట్లు సమాచారం. సోమశిలతో పాటు రెగ్యులర్ ఇరిగేషన్, తెలుగుగంగ, జలయజ్ఞం తదితర పనులకు సంబంధించి జిల్లాకు రూ.1,500 కోట్లు మంజూరయ్యాయి. వైఎస్సార్ హయాంలో ఇరిగేషన్ పనులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లలో పలువురు వైఎస్సార్ మరణానంతరం సగంలోనే నిలిపేశారు. అనేక పనుల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కావలి కెనాల్ ఆధునికీకరణ పనులు కూడా అర్ధంతరంగా నిలిచిపోయాయి. దక్షిణ కాలువ కలువాయి చెరువు నుంచి పొదలకూరు వరకు చేపట్టిన పనులను కాంట్రాక్టర్లు నిలిపి వేశారు. కొత్త రేట్లు ఇచ్చేంత వరకు పనులు చేసేది లేదంటూ కాంట్రాక్టర్లు మొండికేస్తున్నట్లు సమాచారం. ఇక ఉత్తర కాలువ ఆధునికీకరణకు చిలకలమర్రి నుంచి గుడిపాడు వరకు చేపట్టిన పనులను ఏళ్లు గడుస్తున్నా నామమాత్రంగా సాగుతున్నాయి. రూ.104 కోట్లతో చేపట్టిన ఈ పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి. ఇక సోమశిల నుంచి చిలకలమర్రి వరకు చేపట్టిన ఉత్తర కాలువ ఆధునికీకరణ పనులదీ ఇదే పరిస్థితి. గుడిపాడు నుంచి ప్రకాశం జిల్లా రాళ్లపాడు రిజర్వాయర్ వరకు చేపట్టిన పనుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అగ్రిమెంట్ తర్వాత రెండేళ్లలో పూర్తికావాల్సిన పనులు ఐదు నుంచి 8 ఏళ్లు గడిచినా సగం కూడా పూర్తి కాలేదు. నిబంధనలకు పాతర నిబంధనల మేరకు గడువు పూర్తయినా పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లపై అధికారులు చర్యలు తీసుకోవాలి. కానీ కొందరు అధికారులు వారితో కుమ్మక్కై నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సకాలంలో పనులు పూర్తిచేయని కాంట్రాక్టర్లకు లిక్విడేటెడ్ డ్యామేజస్ ఫైన్ వేయాల్సి ఉంది. మూడు నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుని, సంబంధిత కాంట్రాక్టర్ గడువులోపు పూర్తి చేయని పనులకు పది శాతానికి తగ్గకుండా ఫైన్ విధించాలి. అయితే కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన అధికారులు ప్రకృతి వైపరీత్యాల కారణంగా పనులు ముందుకు సాగడం లేదని రాసి ఫైన్ లేకుండా చూస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిబంధనలు ఉల్లంఘిస్తున్న కాంట్రాక్టర్లు ఎలాంటి చర్యలు లేకుండా తప్పించుకుంటున్నారు. రైతులు మాత్రం సాగునీరు అందక పంటలను ఎండబెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడంతో పాటు పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రైతులు కోరుతున్నారు.