ఇరిగేషన్ పనుల్లో రూ.400 కోట్ల అవినీతి
-
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్‌రెడ్డి
ఇందుకూరుపేట:
జిల్లాలో నీటిపారుదల శాఖ పనుల్లో రూ.400 కోట్లు తెలుగుతమ్ముళ్లు, అధికారులు దిగమింగారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఆరోపించారు. మండలంలోని ముదివర్తిపాలెంలో సోమవారం గడగడపకు వైఎస్సార్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మట్లాడారు. ఒక్క కోవూరు నియోజవర్గంలోనే రూ.50 కోట్ల అవినీతి జరిగిందన్నారు. దీనికి ప్రధాన కారకులు కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అని విమర్శించారు. పనులు ఎక్కడా సక్రమంగా జరిగిన పాపాన పోలేదన్నారు. పది రోజుల నుంచి ఇరిగేషన్ అవినీతిపై అన్ని పత్రికల్లో పతాక స్థాయిలో శీర్షికలు ప్రచురితమవుతున్నాయన్నారు. ఎమ్మెల్యే పోలంరెడ్డి అనుచరులు, బంధువులు రూ.కోట్లు పనులు చేయకుండానే ఇరిగేషన్ డబ్బును డ్రా చేశారని వివరించారు. పోలంరెడ్డి బావ మాతూరు రామసుబ్బారెడ్డి, అయన సోదరడు దశరథరామిరెడి, సొంత తమ్ముడు నీటి సంఘం నాయకులు వెంకటేశ్వరరెడ్డి బినామీలుగా వ్యవహరిస్తున్నారన్నారు. చెముకుల చైతన్య, కోటంరెడ్డి అమరేంద్రనాథ్‌రెడ్డి అనేవారు ఎమ్మెల్యే అనుచరులు మాత్రమేనన్నారు. వీరికి ఇరిగేషన్ శాఖలో ఎలాంటి పదవి, హోదాలు లేవన్నారు. బ్యాంకుల నుంచి రూ.54 లక్షలు డ్రా చేశారని వీరి అవినీతికి నిదర్శననానికి ఇది ఒక శాంపిల్ మాత్రమేనని చెప్పారు. ఎమ్మెల్యే తిన్న డబ్బాంతా రికవరీ చేసి అధికారులు పర్సంటేజీలను రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మావులూరు శ్రీనివాసులురెడ్డి, బీసీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొల్లపల్లి విజయ్‌కుమార్, జెడ్పీటీసీ బీవీ రమణయ్య పాల్గొన్నారు.