ప్రాజెక్టు పనులకు పెద్దపీట | AP Govt Likely To Start Irrigation Project Works Of Vamikonda and Sarvaraya Sagar | Sakshi
Sakshi News home page

ప్రాజెక్టు పనులకు పెద్దపీట

Published Thu, Nov 24 2022 11:06 PM | Last Updated on Thu, Nov 24 2022 11:54 PM

AP Govt Likely To Start Irrigation Project Works Of Vamikonda and Sarvaraya Sagar - Sakshi

వామికొండ రిజర్వాయర్‌

సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో సాగునీటి పనులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. జీఎన్‌ఎస్‌ఎస్, తెలుగుగంగ పరిధిలోని ప్రాజెక్టులలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఆ పనులను పూర్తి చేసి ఆయా ప్రాజెక్టుల పరిధిలో ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

ఇందులో భాగంగా 1.65 టీఎంసీల సామర్థ్యం కలిగిన వామికొండ సాగర్, 3.06 టీఎంసీల సామర్థ్యం  కలిగిన సర్వరాయసాగర్‌ ప్రాజెక్టుల పరిధిలోని డిస్ట్రిబ్యూటరీ పనులతోపాటు కట్ట రివిట్‌మెంట్, లీకేజీ అరికట్టే పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి సూచనలతో ఇప్పటికే సదరు పనులను పూర్తి చేసేందుకు అధికారులు అంచనాలను సిద్ధం చేశారు.

రూ. 212 కోట్లతో ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఈ పనులను పూర్తిచేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. పనుల కోసం టెండరు ప్రక్రియ సాగుతోంది. నేడో, రేపో ఈ పనులకు ప్రభుత్వం టెండర్లు పిలువనుంది. టెండరు ప్రాసెస్‌ అయిన వెంటనే పనులు మొదలు పెట్టనున్నారు.   

జూన్‌ నాటికి 15 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు 
అత్యంత వేగంగా పనులు చేపట్టి వచ్చే జూన్‌ నాటికి దాదాపుగా పనులు పూర్తి చేసి 15 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. తొలుత రెండు ప్రాజెక్టుల పరిధిలోని డిస్ట్రిబ్యూటరీ పనులను పూర్తి చేయనున్నారు. దీంతోపాటు రెండు రిజర్వాయర్ల బండ్‌ (కట్ట)లో పెండింగ్‌లో ఉన్న రివిట్‌మెంట్‌ పనులను పూర్తి చేయనున్నారు.

ఆ తర్వాత వామికొండ పరిధిలోని ఒంటిగారిపల్లె, సర్వరాయసాగర్‌ పరిధిలో కట్ట లీకేజీలను అరికట్టే పనులను చేపట్టనున్నారు. ప్రస్తుతం రెండు రిజర్వాయర్ల కట్ట పరిధిలో నీరు లీక్‌ అవుతుండడంతో ఒంటిగారిపల్లె,  ఇందుకూరు గ్రామాల పొలాల్లో నిత్యం నీరు నిల్వ ఉంటోంది. దీంతో ఆ భూముల్లో పంటలు వేసేందుకు వీలు లేకుండా పోయింది. నీటి లీకేజీని అరికడితే తప్ప ఆ ప్రాంతంలోని పొలాల్లో పంటల సాగుకు అవకాశం లేదు. తక్షణమే కట్ట లీకేజీ అరికట్టే పనులను రూ. 12 కోట్లతో చేపట్టాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.  

వేగంగా భూ సేకరణ
డిస్ట్రిబ్యూటరీ పనులు చేపట్టేందుకు వీలుగా 795 ఎకరాలను ప్రభుత్వం భూ సేకరణ కింద సేకరించాల్సి ఉంది. ఇప్పటికే 60 శాతం భూ సేకరణ  పూర్తి కాగా, మిగిలిన 40 శాతం భూ సేకరణ చివరి దశలో ఉంది. టెండర్లు పూర్తయ్యే నాటికి భూ సేకరణ ప్రక్రియ పూర్తి చేయనున్నారు.  

సాగులోకి 35 వేల ఎకరాల ఆయకట్టు 
డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తయితే వామికొండ పరిధిలో ముద్దనూరు, వీఎన్‌ పల్లె ప్రాంతాల్లో 10 వేల ఎకరాల ఆయకట్టుకు అలాగే సర్వరాయసాగర్‌ పరిధిలో కమలాపురం నియోజకవర్గంలో 25 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతుంది.

రెండు ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 35 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. అన్ని పనులను పూర్తి చేసి పై రెండు ప్రాజెక్టుల పరిధిలో పూర్తి స్థాయి సామర్థ్యం మేరకు నీటిని నిల్వ పెట్టాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. వచ్చే జూన్‌ నాటికి వీలైనంత వరకు పనులను పూర్తి చేసి 15–20 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందించాలని అధికారులు నిర్ణయించారు. ఆ తర్వాత మిగిలిన పనులు పూర్తి చేసి మొత్తం ఆయకట్టుకు నీటిని అందించనున్నారు. 

భూ సేకరణ పనులు దాదాపు పూర్తి 
వామికొండ, సర్వరాయసాగర్‌ పరిధిలో ఉన్న అసంపూర్తి పనులు పూర్తి చేసేందుకు రూ. 212 కోట్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. త్వరలోనే టెండరు ప్రక్రియ పూర్తి కానుంది. ఈ ప్రాజెక్టుల పరిధిలో డిస్ట్రిబ్యూటరీలు, ఇతర పనుల కోసం 795 ఎకరాల భూమి అవసరం ఉండగా, 60 శాతం భూ సేకరణకు సంబం«ధించి అవార్డు ప్రక్రియ పూర్తయింది. మిగిలిన 40 శాతం సేకరణకు సంబంధించి అవార్డు దశలో ఉంది. త్వరలోనే భూ సేకరణ ప్రక్రియ పూర్తి అవుతుంది. పనులు పూర్తయితే రైతులకు మరింత ప్రయోజనం చేకూరుతుంది. 
– వి.విజయరామరాజు, కలెక్టర్, వైఎస్సార్‌ జిల్లా  

వామికొండ సర్వరాయసాగర్‌ పరిధిలో త్వరలో పెండింగ్‌ పనులు పూర్తి 
వామికొండ, సర్వరాయసాగర్‌ పరిధిలో పెండింగ్‌లో ఉన్న డిస్ట్రిబ్యూటరీ, రివిట్‌మెంట్, కట్ట లీకేజీ అరికట్టే పనులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం రూ. 212 కోట్ల పనులకు అనుమతులు ఇచ్చింది. త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తి కానుంది. వెంటనే పనులు మొదలు పెట్టి వచ్చే ఏడాది జూన్‌ నాటికి 15 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలని లక్ష్యంగా  పెట్టుకున్నాం. ఆ తర్వాత మిగిలిన పనులు పూర్తి చేసి మొత్తం 35 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించనున్నాం. 
– మల్లికార్జునరెడ్డి, ఎస్‌ఈ, జీఎన్‌ఎస్‌ఎస్, కడప  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement