అంచనాల మాయ
= అర్ధంతరంగా నిలిచిన సాగునీటి పనులు
= అంచనాలు పెంచుకునేందుకు అధికారులపై ఒత్తిడి
= సగంకూడా పూర్తి కాని పనులు
= అందిన కాడికి దండుకుని ఉడాయిస్తున్న కాంట్రాక్టర్లు
సాక్షి, నెల్లూరు: సాగునీటి పనులకు పాలకుల నిర్లక్ష్యం అడ్డంకిగా మారింది. అధికారం అండతో కోట్లాది రూపాయల పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు వాటిని అర్ధంతరంగా నిలిపేశారు. ఈ క్రమంలో జిల్లాలో చేపట్టిన సాగునీటి పారుదల అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఆగిపోయాయి. ఏళ్లు గడుస్తున్నా 40 శాతం పనులు కూడా పూర్తికాలేదని ఇరిగేషన్ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దీంతో రైతులకు ఏటా సాగునీటి కష్టాలు తప్పడం లేదు. మరోవైపు కాంట్రాక్టర్లు మాత్రం ఆర్థికంగా బలపడుతున్నారు. నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ పనుల కోసం 2005 నుంచి వందల కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిబంధనల మేరకు అగ్రిమెంట్ తేదీ నుంచి రెండేళ్లలో పూర్తి చేయాలి. అయితే లాభదాయకంగా ఉంటున్న కాలువల తవ్వకాలు, మట్టి కట్టల ఆధునికీకరణ తదితర పనులకు మాత్రం ప్రాధాన్యం ఇచ్చి బిల్లులు చేసుకుంటున్నారు.
కాంక్రీట్ పనులను మాత్రం గాలికి వదిలేస్తున్నారు. అగ్రిమెంట్ గడువు ముగిసినా అధికారులతో కుమ్మక్కై నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. పనులు కష్టంగా ఉన్నాయని, రేట్లు పెరిగాయని సాకులు చూపి అంచనాలు పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అధికార పార్టీ అండతో అంచనాలను ఇబ్బడిముబ్బడిగా పెంచుకుని కోట్లు దండుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీరికి కొందరు ఇరిగేషన్ అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నట్లు సమాచారం. సోమశిలతో పాటు రెగ్యులర్ ఇరిగేషన్, తెలుగుగంగ, జలయజ్ఞం తదితర పనులకు సంబంధించి జిల్లాకు రూ.1,500 కోట్లు మంజూరయ్యాయి. వైఎస్సార్ హయాంలో ఇరిగేషన్ పనులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లలో పలువురు వైఎస్సార్ మరణానంతరం సగంలోనే నిలిపేశారు.
అనేక పనుల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. కావలి కెనాల్ ఆధునికీకరణ పనులు కూడా అర్ధంతరంగా నిలిచిపోయాయి. దక్షిణ కాలువ కలువాయి చెరువు నుంచి పొదలకూరు వరకు చేపట్టిన పనులను కాంట్రాక్టర్లు నిలిపి వేశారు. కొత్త రేట్లు ఇచ్చేంత వరకు పనులు చేసేది లేదంటూ కాంట్రాక్టర్లు మొండికేస్తున్నట్లు సమాచారం. ఇక ఉత్తర కాలువ ఆధునికీకరణకు చిలకలమర్రి నుంచి గుడిపాడు వరకు చేపట్టిన పనులను ఏళ్లు గడుస్తున్నా నామమాత్రంగా సాగుతున్నాయి. రూ.104 కోట్లతో చేపట్టిన ఈ పనులు ఎప్పటికి పూర్తవుతాయో తెలియని పరిస్థితి. ఇక సోమశిల నుంచి చిలకలమర్రి వరకు చేపట్టిన ఉత్తర కాలువ ఆధునికీకరణ పనులదీ ఇదే పరిస్థితి. గుడిపాడు నుంచి ప్రకాశం జిల్లా రాళ్లపాడు రిజర్వాయర్ వరకు చేపట్టిన పనుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అగ్రిమెంట్ తర్వాత రెండేళ్లలో పూర్తికావాల్సిన పనులు ఐదు నుంచి 8 ఏళ్లు గడిచినా సగం కూడా పూర్తి కాలేదు.
నిబంధనలకు పాతర
నిబంధనల మేరకు గడువు పూర్తయినా పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్లపై అధికారులు చర్యలు తీసుకోవాలి. కానీ కొందరు అధికారులు వారితో కుమ్మక్కై నిబంధనలకు తూట్లు పొడుస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సకాలంలో పనులు పూర్తిచేయని కాంట్రాక్టర్లకు లిక్విడేటెడ్ డ్యామేజస్ ఫైన్ వేయాల్సి ఉంది. మూడు నెలల కాలాన్ని పరిగణనలోకి తీసుకుని, సంబంధిత కాంట్రాక్టర్ గడువులోపు పూర్తి చేయని పనులకు పది శాతానికి తగ్గకుండా ఫైన్ విధించాలి.
అయితే కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన అధికారులు ప్రకృతి వైపరీత్యాల కారణంగా పనులు ముందుకు సాగడం లేదని రాసి ఫైన్ లేకుండా చూస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. దీంతో నిబంధనలు ఉల్లంఘిస్తున్న కాంట్రాక్టర్లు ఎలాంటి చర్యలు లేకుండా తప్పించుకుంటున్నారు. రైతులు మాత్రం సాగునీరు అందక పంటలను ఎండబెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సంబంధిత కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవడంతో పాటు పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా రైతులు కోరుతున్నారు.