పాలకులు చెబుతున్న ఆయకట్టు మాటలు కనికట్టుగా మారిపోతున్నాయి. ఫలితంగా అన్నదాత ఆశలు ఆవిరవుతున్నాయి. పాలకుల మాటలపై ఆశలు పెంచుకొని రైతులు ఎదురు చూడడమే తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు. దీంతో పనుల అంచనా విలువ పెరిగి తడిపిమోపెడవుతుంది. అయినా పనులు జరిగిన పరిస్థితులు కనిపించడం లేదు.
బొబ్బిలి: వెంగళరాయ సాగర్ జలాశయం ద్వారా 24వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరందిస్తున్నా అంతకు మించి సాగునీరు ఇచ్చే సామర్ధ్యం ఉందని ఉన్నతాధికారులు గుర్తించారు. అప్పటి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గొల్లపల్లి వద్ద శిలాఫలకం వేసి రూ.5 కోట్లతో పనులు ప్రారంభించారు. గుత్తేదారులు, అధికారుల నిర్లక్ష్యంతో ఆ పనులు అంచనాలు పెరిగిపోయి పలుమార్లు నిలిచిపోయాయి. ఆ తరువాత 2013లో రూ.12.67 కోట్లతో ప్రారంభించిన పనులు కేవలం 18 నెలల్లో చేపడతామని చెప్పినా నత్తనడకన సాగుతున్నాయి. సీతానగరం మండలంలోని ఐదు గ్రామాలు, బొబ్బిలి మండలంలోని 13 గ్రామాల్లో 4,996 ఎకరాలకు సాగునీరందించేందుకు చేపట్టిన ఈ పనులకు సంబంధించి ఇంకా భూ సేకరణ కూడా పూర్తి కాలేదు. రాముడువలస, చింతాడ తదితర గ్రామాల్లో రైతులు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. ఇప్పటికి రెండుసార్లు గడువు పూర్తయినా కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు.
నేటికీ ఇంకా 25 శాతం కూడా పూర్తవని పనులు ఈ ఏడాది మార్చి నాటికి ఐదు వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉన్నా పనుల నత్తనడక కారణంగా సాధ్యమయ్యే పరిస్థితి కానరావడం లేదు. వెన్నెల బుచ్చెంపేట నుంచి కలువరాయి వరకూ గల 3.45 కిలోమీటర్ల మేర కాలు నిర్మాణం పూర్తయింది. అక్కడి నుంచి చింతాడ వరకూ గల కాలువ నిర్మాణం కోసం పది ఎకరాలు భూ సేకరణ చేయాల్సి ఉంది. కానీ దీనికి పరిహారంపై రైతులు అభ్యంతరం చెబుతున్నారు. అటు కాంట్రాక్టర్ పనులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. అయితే బిల్లులు చెల్లింపుల్లో కూడా సాగదీత ఉన్నట్టు కనిపిస్తున్నది. ఇప్పటి వరకు కాంట్రాక్టర్‌కు రూ.2.43కోట్లు చెల్లించారు. బిల్లుల పెండింగ్‌తో పాటు భూ సేకరణ అడ్డంకిగా మారింది.
ఇంకా రాముడువలస, చింతాడ, కలువరాయి గ్రామాలకు చెందిన 26 మంది రైతుల నుంచి 22 ఎకరాలు సేకరించాల్సి ఉంది. దీనిపై కనీసం కదలిక లేదు. మరో పక్క సీతానగరం మండలం ఎన్‌సీఎస్ సుగర్ ఫ్యాక్టరీ వద్ద రూ.3కోట్లతో అక్విడెక్ట్‌ను నిర్మించాల్సి ఉంది. ఈ నిర్మాణాలపై ఫ్యాక్టరీ యాజమాన్యంతో చర్చలు జరుగుతున్నాయి. మరో పక్క అదనపు ఆయకట్టు సాధించామని అధికార పార్టీ నేతలు గొప్పలు చెప్పుకోవడం తప్ప ఎటువంటి పురోగతి లేదని, దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం మానేశారని రైతాంగం విమర్శిస్తున్నది. ఇప్పటికే వెంగళరాయ సాగర్ ఆయకట్టు చివరి భూములకు నీరందని పరిస్థితి నెలకొందని, దీనిని పక్కన పెట్టేసిన యంత్రాంగం అదనపు ఆయకట్టును కూడా నిదానంగా పర్యవేక్షిస్తోందని ఆరోపిస్తున్నారు.
పనులు జరిపిస్తున్నాం...
వెంగళరాయ సాగర్ అదనపు ఆయకట్టు పనులు జరిపిస్తున్నాం. కాంట్రాక్టర్‌కు పలుమార్లు నోటీసులు ఇచ్చాం. ప్రస్తుతం బొబ్బిలి శివారులో అక్విడెక్ట్ పనులు జరుగుతున్నాయి. మార్చి నాటికి పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌పై ఒత్తిడి తెస్తున్నాం. –కె.బాలసూర్యం, డీఈఈ, బొబ్బిలి డివిజన్
Comments
Please login to add a commentAdd a comment