జంట పండుగలు జిగేల్
రంజాన్, బోనాల ఏర్పాట్లకు భారీ కసరత్తు
ఒక్కో పండుగకురూ.10 కోట్ల చొప్పున నిధులు!
{పాథమికంగా అంచనా వేసినజీహెచ్‌ఎంసీ అధికారులు
అన్ని విభాగాలను సన్నద్ధం చేసిన ఉన్నతాధికారులు
సిటీబ్యూరో:
రంజాన్, బోనాల పండుగలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లను జీహెచ్‌ఎంసీ చేపట్టనుంది. ఈ మేరకు సదరు అధికారులు కసరత్తు ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక తొలిసారిగా జరుపుకోనున్న ఈ పండుగలను ఘనంగా నిర్వహించాలని, ఎంత ఖర్చయినా వెనుకాడేది లేదని సీఎం కేసీఆర్ ఆదేశించడంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఏర్పాట్లను మంత్రులు సైతం పర్యవేక్షించనుండడంతో రహదారుల మరమ్మతులు, పారిశుద్ధ్య పనులు, వీధి దీపాల ఏర్పాటు తదితర పనులపై అధికారులు ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. రంజాన్, బోనాల పండుగల ఏర్పాట్ల కోసం రూ.10 కోట్ల చొప్పున నిధులు వెచ్చించాలని ప్రాథమికంగా అంచనా వేశారు. రంజాన్ ఏర్పాట్లకు సంబంధించి వెంటనే అంచనాలు పంపించాలని జోనల్, సర్కిల్ అధికారులను ఆదేశించారు.
ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలు సాఫీగా సాగడంతోపాటు నడవడానికి వీలుగా ఫుట్‌పాత్‌ల ఏర్పాటు.. అవసరమైన చోట మర మ్మతులు, పాట్‌హోల్స్ పూడ్చివేత, డెబ్రిస్ తొలగింపు తదితర పనులు చేయాలని నిర్ణయించారు. అన్ని మసీదులు, ఆలయాల వద్ద ప్రత్యేక పారిశుద్ధ్య పనులు చేపట్టనున్నారు. రంజాన్ కోసం సర్కిల్ 4, 5, 7, 9లలో పారిశుద్ధ్య బృందాలను నియమించనున్నారు. మక్కామసీదు, మీరాలం ఈద్గా తదితర ప్రాంతాల్లో వ్యర్థాలను ఎప్పటికప్పుడు తరలించేందుకు రెండేసి బాబ్‌కాట్‌లు అందుబాటులో ఉంచనున్నారు. మసీదుల వద్ద రోజుకు రెండు పర్యాయాలు వ్యర్థాలను తొలగిస్తారు. అన్ని వార్డుల్లోనూ చెత్త తరలించేందుకు తగినన్ని వాహనాలను అందుబాటులో ఉంచుతారు. దోమల నివారణకు సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రార్థనాలయాల వద్ద ఫాగింగ్ చేయనున్నారు. 24 పోర్టబుల్ ఫాగింగ్ మెషిన్లతోపాటు వెహికల్ మౌంటెడ్ ఫాగింగ్
మెషిన్లను ఐదింటిని వినియోగించనున్నారు. యాంటీ లార్వల్ చర్యల కోసం వంద బృందాలను ఏర్పాటు చేయనున్నారు. రహదారులకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను నరికివేయనున్నారు. ప్రార్థనాలయాల మార్గాల్లో వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకుంటారు. హైమాస్ట్ లైట్లు కూడా తగినన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకుగాను దాదాపు రూ.40 లక్షలు ఖర్చు కాగలదని అంచనా వేశారు. విద్యుత్ చార్జీలకు ఏటా రూ.164 కోట్లు ఖర్చవుతున్నప్పటికీ, రాత్రిపూట వెలుతురు ఉండటం లేదనే ఫిర్యాదులున్నాయి. ఈసారి అలాంటి ఫిర్యాదులు రాకుండా జాగ్రత్తపడుతున్నారు.
నేడు రంజాన్ ఏర్పాట్లపై సమావేశం
మసీదుల వద్ద వ్యర్థాలను వేసేందుకు పాలిథిన్ బ్యాగ్‌లు అందుబాటులో ఉంచాల్సిందిగా మేయర్ మాజిద్ హుస్సేన్ ఆరోగ్యం-పారిశుద్ధ్య విభాగం అధికారులకు సూచించారు. రంజాన్ ఏర్పాట్లపై మంగళవారం అధికారులు, కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. డెబ్రిస్ తొలగింపు పనుల్లో స్థానిక కార్పొరేటర్ నుంచి సర్టిఫికెట్ లేకుంటే కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించేది లేదని స్పష్టం చేశారు.