ప్రాజెక్టుల అంచనా వ్యయంపై అనుమానాలు
ప్రాజెక్టులపై సాగునీటి రంగ నిపుణులతో బీజేపీ చర్చలు
సాక్షి, హైదరాబాద్: ప్రాజెక్టుల్లో అంచనా వ్యయం పెంపుపై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ప్రాజెక్టుల డీపీఆర్‌లను బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తోంది. సాగునీటి ప్రాజెక్టుల వ్యయం రూ. 41 వేల కోట్ల నుంచి రూ. 81 వేల కోట్లకు ఎలా పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి నదీజలాల వినియోగంపై బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం ఇక్కడ నిర్వహించిన వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో బీజేపీ ముఖ్యనేతలు జి.కిషన్‌రెడ్డి, ఎన్.వి.ఎస్.ప్రభాకర్, సాగునీటి రంగ నిపుణులు చంద్రమౌళి, శ్యాంప్రసాద్‌రెడ్డి, హన్మంతరెడ్డి, పర్యావరణవేత్త పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మణ్ మాట్లాడుతూ తమ్మిడిహెట్టి వద్ద 152 అడుగుల ఎత్తులో బ్యారేజీ నిర్మాణానికి అనుగుణంగా పునాదులు వేయాలని అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం రెట్టింపు, రీడైజన్లపై అందరిలోనూ చాలా అనుమానా లున్నాయన్నారు. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేన న్నారు. నీటిపారుదల ప్రాజెక్టుల రీడిజైనింగు పేరుతో నిర్వాసితులను చేయాలనే ప్రభుత్వ ఆలోచనను తిప్పికొట్టేవిధంగా సమగ్ర నివేదికను తయారు చేయాలని తీర్మానించింది.