
బాలుడిని బలిగొన్న డ్రెస్సింగ్ టేబుల్
రాంనగర్‌లో విషాదం
హైదరాబాద్: వినాయక చవితి పండుగకి సిద్ధమవుతున్న ఓ ఇంట డ్రెస్సింగ్ టేబుల్ రూపంలో మృత్యువు తరుముకొచ్చింది. డ్రెస్సింగ్ టేబుల్ మీద పడడంతో 9 నెలల బాలుడు మరణించాడు. హైదరాబాద్ రాంనగర్‌లో ఈ విషాదకర సంఘటన జరిగింది. రాంనగర్‌కు చెందిన ప్రవీణ్, అనూష దంపతులకు ఇద్దరు కుమారులు. అందులో చిన్నవాడైన 9 నెలల బాలుడు అయాన్‌ను హాల్‌లో పడుకోబెట్టారు.
వినాయక చవితి సందర్భంగా ఇంట్లో వస్తువులను సర్దుతున్న క్రమంలో డ్రెస్సింగ్ టేబుల్‌ను హాల్‌లో పెట్టి మరో రూంలోకి వెళ్లారు. ఈ క్రమంలో డ్రెస్సింగ్ టేబుల్ బ్యాలెన్స్ లేక పక్కనే పడుకుని ఉన్న బాలుని తలపై పడింది. తలకు తీవ్రమైన గాయం కావడంతో రాత్రి పలు ఆసుపత్రులకు తిప్పి చికిత్స చేయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు.