హైదరాబాద్: ప్రముఖుల భద్రత, బందోబస్తు అంశాలతో పాటు కీలక సమయాల్లో ట్రాఫిక్ స్థితిగతుల్ని అధ్యయనం చేయడం కోసం సైబరాబాద్ పోలీసులు డ్రోన్ కెమెరా ఖరీదు చేశారు. రూ.7 లక్షలు వెచ్చించి సమీకరించుకున్న దీన్ని బుధవారం కమిషనరేట్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. ‘త్రీజీ’ పరిజ్ఞానంతో పని చేసే ఈ కెమెరా ఇటీవల ప్రారంభించిన సైబరాబాద్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో (సీసీసీ) అనుసంధానమై ఉండేలా చర్యలు తీసుకున్నారు. దీన్ని రిమోట్ కంట్రోల్ సాయంతో భూమి నుంచి గరిష్టంగా 800 మీటర్ల ఎత్తులో తిప్పే అవకాశం ఉంది.
దాదాపు కిలోమీటరు పరిధిలో ఉన్న ప్రాంతంలోని అంశాలను ఇది చిత్రీకరిస్తుంది. ఆ దృశ్యాలను ఎప్పటికప్పుడు (రియల్ టైమ్) సీసీసీలోని కంప్యూటర్లకు అందిస్తుంది. అక్కడ ఉండే సిబ్బంది, అధికారులు క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటికి అనుగుణంగా చర్యలు తీసుకునే ఆస్కారం ఏర్పడుతుంది. సీసీసీకి అనుసంధానించి ఉన్న ఇతర కెమెరాలు అందించే సమాచారం కంటే డ్రోన్ కెమెరా ద్వారా లభించే విజువల్స్ మరింత మెరుగైన ఫలితాలు ఇస్తాయని అధికారులు చెప్తున్నారు. ఈ డ్రోన్ కెమెరా పనితీరును సైబరాబాద్ అధికారులు బుధవారం గచ్చిబౌలి కమిషనరేట్‌లో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. దీని నిర్వహణపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు.