వెయిటేజీ తీర్పు అమలు నిలిపివేత...
- సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో వైద్యాధికారుల ప్రవేశాలన్నీ తుది తీర్పునకు లోబడే
- ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాలు, కష్టతర ప్రదేశాల్లో పనిచేసే ఇన్ సర్వీస్ వైద్య అధికారులకు సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో వెయిటేజీ ఇవ్వాల్సిందేనంటూ సింగిల్ జడ్జి సోమవారం ఇచ్చిన తీర్పు అమలును ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు ధర్మాసనం మంగళవారం నిలుపుదల చేసింది. సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలన్నీ కూడా ఈ కేసులో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
ఇన్ సర్వీసు కింద 30 శాతం మేర వెయిటేజీ మార్కులను ఇవ్వాలంటూ తాను పెట్టుకున్న వినతిపత్రాన్ని పట్టించుకోకపోవడాన్ని సవాలు చేస్తూ వరంగల్‌కు చెందిన డాక్టర్ డి.గోపాలరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ సురేశ్ కైత్..గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాలు, కష్టతర ప్రదేశాల్లో పనిచేసే ఇన్ సర్వీస్ వైద్యులకు సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ఏడాదికి 10 శాతం చొప్పున గరిష్టంగా 30 శాతం మార్కులను వెయిటేజీగా ఇవ్వాలని తీర్పునిచ్చారు. దీన్ని సవాలు చేస్తూ డాక్టర్ కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది.
సూపర్ స్పెషాలటీ కోర్సుల్లో వెయిటేజీ రిజర్వేషన్ల కిందకే వస్తుందని యూనివర్సిటీ తరఫు న్యాయవాది తెలిపారు. ఇందుకు నిబంధనలు, న్యాయస్థానాలు అనుమతించవని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం సూపర్ స్పెషాలిటీ కోర్సులు పీజీ కోర్సులు కావంది. వాటి ప్రవేశాలకు ప్రత్యేక నిబంధనలు ఉంటాయంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జరిగే సూపర్ స్పెషాలిటీ కోర్సుల ప్రవేశాలన్నీ తమ తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.