Super-specialty course
-
వెయిటేజీ తీర్పు అమలు నిలిపివేత...
- సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో వైద్యాధికారుల ప్రవేశాలన్నీ తుది తీర్పునకు లోబడే - ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాలు, కష్టతర ప్రదేశాల్లో పనిచేసే ఇన్ సర్వీస్ వైద్య అధికారులకు సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో వెయిటేజీ ఇవ్వాల్సిందేనంటూ సింగిల్ జడ్జి సోమవారం ఇచ్చిన తీర్పు అమలును ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన హైకోర్టు ధర్మాసనం మంగళవారం నిలుపుదల చేసింది. సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలన్నీ కూడా ఈ కేసులో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయంది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావులతో కూడిన ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్ సర్వీసు కింద 30 శాతం మేర వెయిటేజీ మార్కులను ఇవ్వాలంటూ తాను పెట్టుకున్న వినతిపత్రాన్ని పట్టించుకోకపోవడాన్ని సవాలు చేస్తూ వరంగల్‌కు చెందిన డాక్టర్ డి.గోపాలరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి జస్టిస్ సురేశ్ కైత్..గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాలు, కష్టతర ప్రదేశాల్లో పనిచేసే ఇన్ సర్వీస్ వైద్యులకు సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ఏడాదికి 10 శాతం చొప్పున గరిష్టంగా 30 శాతం మార్కులను వెయిటేజీగా ఇవ్వాలని తీర్పునిచ్చారు. దీన్ని సవాలు చేస్తూ డాక్టర్ కాళోజీ వైద్య విశ్వవిద్యాలయం ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. సూపర్ స్పెషాలటీ కోర్సుల్లో వెయిటేజీ రిజర్వేషన్ల కిందకే వస్తుందని యూనివర్సిటీ తరఫు న్యాయవాది తెలిపారు. ఇందుకు నిబంధనలు, న్యాయస్థానాలు అనుమతించవని వివరించారు. వాదనలు విన్న ధర్మాసనం సూపర్ స్పెషాలిటీ కోర్సులు పీజీ కోర్సులు కావంది. వాటి ప్రవేశాలకు ప్రత్యేక నిబంధనలు ఉంటాయంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం జరిగే సూపర్ స్పెషాలిటీ కోర్సుల ప్రవేశాలన్నీ తమ తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. -
అక్కడ పనిచేసే అధికారులకు వెయిటేజీ ఇవ్వాల్సిందే
- గరిష్టంగా 30 శాతం వరకు వెయిటేజీ మార్కులివ్వొచ్చు - హైకోర్టు కీలక తీర్పు సాక్షి, హైదరాబాద్: గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాలు, కష్టతర ప్రదేశాల్లో పనిచేసే ఇన్ సర్వీస్ వైద్య అధికారులకు సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో వెయిటేజీ ఇవ్వాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. ఏడాదికి 10 శాతం చొప్పున గరిష్టంగా 30 శాతం మార్కులను వెయిటేజీగా ఇవ్వాలంది. ఈ సందర్భంగా వారు ఆయా ప్రాంతాల్లో ఎన్ని సంవత్సరాలు సేవలు అందించారో దానిని పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, డాక్టర్ కాళోజీ వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సురేశ్ కైత్ సోమవారం కీలక తీర్పు వెలువరించారు. ఇన్ సర్వీసు కింద 30 శాతం మేర వెయిటేజీ మార్కులను ఇవ్వాలంటూ తాను పెట్టుకున్న వినతిపత్రాన్ని పట్టించుకోకపోవడాన్ని సవాలు చేస్తూ వరంగల్‌కు చెందిన డాక్టర్ డి.గోపాలరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ సురేశ్ కైత్ విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున పి.శ్రీధర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) నిబంధనలు, స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ డాక్టర్ దినేశ్ సింగ్ చౌహాన్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఇన్ సర్వీసు వారికి సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో వెయిటేజీ ఇవ్వాల్సి ఉందని, అయితే ఈ తీర్పును తెలంగాణ ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. పిటిషనర్ సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేశారని తెలిపారు. అదేవిధంగా పలు మారుమూల ప్రాంతాల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారన్నారు. సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో ప్రవేశాలకు పిటిషనర్ దరఖాస్తు చేసుకుని, మెరిట్లో 19వ ర్యాంకు సాధించారని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి, విస్తృత ప్రజా ప్రయోజనాల మేరకు గ్రామీణ, గిరిజన, మారుమూల, కష్టతర ప్రాంతాలు, ప్రదేశాల్లో పనిచేసిన వైద్యులకు ప్రోత్సాహకం కింద సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో వెయిటేజీ మార్కులు ఇవ్వాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుత కేసులో కూడా పిటిషనర్ దాదాపు 20 ఏళ్ల పాటు పలు చోట్ల సేవలు అందించిన విషయాన్ని ఆయన తన తీర్పులో గుర్తు చేశారు.