ఎయిర్‌పోర్టులో యువతి వీరంగం
హైదరాబాద్ : శంషాబాద్, న్యూస్‌లైన్: మద్యం మత్తులో ఓ యువతి శంషాబాద్ విమానాశ్రయంలో వీరంగం సృష్టించింది. ఆమెతో పాటు నలుగురు స్నేహితులు మడ్ రేసింగ్ గేమ్ షో సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ఆర్‌జీఐఏ సీఐ దుర్గాప్రసాద్, బాధితుల కథనం ప్రకారం.. విశాఖపట్నం ప్రాంతానికి చెందిన దీప్తి(25) కూకట్‌పల్లిలో నివాసముంటూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. ఆమెతో పాటు అదే ప్రాంతానికి చెందిన స్నేహితుడు ప్రసాద్ (27), స్వస్థలానికి చెందిన బంధువులు రాధాకృష్ణ (28), పృథ్వీరాజ్(28), కారు డ్రైవర్ చంద్రశేఖర్ (25) శనివారం రాత్రి బంజారాహిల్స్‌లో ఓ విందులో పాల్గొన్నారు.
అక్కడి నుంచి అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల సమయంలో విమానాశ్రయంలో ఉన్న మడ్ రేసింగ్ గేమ్ షోలో పాల్గొనేందుకు వచ్చారు. గేమ్ షోలో అక్కడే ఉన్న ఉద్యోగులకు సంబంధించిన కూర్చీలో దీప్తి కూర్చుంది. అందులో కూర్చోకూడదని ఉద్యోగి శివ ఆమెను వారించాడు. దీంతో ఆగ్రహంతో ఆ యువతి గొడవకు దిగింది. శివను దూషిస్తూ కుర్చీ ఖరీదు చెల్లిస్తానని వీరంగం సృష్టించింది. అంతటితో ఆగకుండా అతడిపై చేయి కూడా చేసుకుంది. ‘మీ బతుకులు ఇంతే’నంటూ దుర్భాషలాడింది. పరిస్థితిని గమనించిన గేమ్ షో సిబ్బంది దీప్తితో పాటు ఆమెతో ఉన్న వారికి నచ్చచెప్పే యత్నం చేశారు. వారు వినకుండా సిబ్బందితో గొడవకు దిగారు.
సిబ్బంది కి రణ్, విశాల్, శ్రీశైలంపై దీప్తితో పాటు మిగతా నలుగురు దాడి చేశారు. పరిస్థితి గమనించిన మిగతా ఉద్యోగులు విమానాశ్రయంలోని పోలీస్ ఔట్ పోస్టులో ఫిర్యాదు చేశారు. పోలీసులు యువతితో పాటు మిగతా నలుగురిని అదుపులోకి తీసుకుని ఆర్‌జీఐఏ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. మడ్ రేసింగ్ గేమ్‌షో నిర్వాహకుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేశారు. యువతితో పాటు మిగతా నలుగురిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.