
బాచుపల్లి: పరీక్షకు అనుమతించకపోవడంతో రోదిస్తున్న విద్యార్థినిని ఓదారుస్తున్న తండ్రి
ఎంసెట్‌లో ‘ఒక్క నిమిషం’ నిబంధన ఎంతో మంది విద్యార్థులు...తల్లిదండ్రులకు శోకాన్ని మిగులుస్తోంది. కష్టపడి చదివి...పొరపాటున ఒక్క నిమిషం ఆలస్యమైన నేరానికి విద్యార్థులు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి రావడంపై సర్వత్రా నిరసన
వ్యక్తమవుతోంది.
సిటీబ్యూరో: నగరంలో 8 జోన్ల పరిధిలో గురువారం ఎంసెట్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. అయితే పరీక్ష కేంద్రాలకు చేరుకునే క్రమంలో విద్యార్థులకు పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్నిచోట్ల ట్రాఫిక్ తిప్పలు, మరికొన్నిచోట్ల పరీక్ష కేంద్రాల చిరునామా దొరకకపోవడం విద్యార్థులకు శాపంగా మారింది. ఈ కారణాలతో పలువురు విద్యార్థులు పరీక్షకు దూరమయ్యారు. మరికొందరు సుదూర ప్రాంతాల నుంచి పరీక్ష కేంద్రాలకు చేరుకునే క్రమంలో ఆలస్యం కావడంతో అధికారులు పరీక్షకు అనుమతించలేదు. మొత్తం మీద గ్రేటర్‌లో 90.11 శాతం విద్యార్థులు ఎంసెట్‌కు హాజరయ్యారు. మొత్తం 1,13,702 మంది దరఖాస్తు చేసుకోగా.. 1,02,459 మంది విద్యార్థులు హాజరయ్యారు. 11,243 మంది గైర్హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో 68,145 విద్యార్థులకు 90.39 శాతంతో 61,598 మంది, మెడికల్ అండ్ అగ్రికల్చర్‌లో 45,557 మందికి గాను...40,861(89.69 శాతం) మంది హాజరయ్యారు.
ట్రాఫిక్ ఇక్కట్లు
ఎంసెట్ విద్యార్థులకు కొన్ని చోట్ల ట్రాఫిక్ కష్టాలు తప్పలేదు. గంటపాటు ట్రాఫిక్ దిగ్బంధంలో చిక్కుకుని విద్యార్థులు నరకం చూశారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందు నుంచే పరీక్ష కేంద్రాల ముందు అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో వేచి ఉండటంతో తార్నాక చౌరస్తా నుంచి అటు ఓయూ క్యాంపస్ వరకు, ఇటు లాలాపేట వరకు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచి పోయింది. రోడ్డుపై వందల వాహనాలు నిలిచిపోవడంతో కొందరు విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోలేక పోయారు. కొందరు ఆశతో కేంద్రాల వద్దకు చేరుకున్నా... అప్పటికే పరీక్ష సమయం మించిపోవడంతో వారిని అధికారులు అనుమతించలేదు. నెలల కష్టం వృథా అయ్యిందని కన్నీళ్లతో విద్యార్థులు ఇంటికి వెనుదిరిగి పోయారు.
గంట ముందు నుంచే...
నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించని నిబంధనతో విద్యార్థులు ఉరుకు పరుగులు పెట్టారు. ఉదయం 8.30 గంటల లోపే పరీక్ష కేంద్రాల వద్ద బారులు తీరి కనిపించారు. ఉదయం 9 గంటల నుంచి పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులను అధికారులు అనుమతించారు. విద్యార్థుల వెంట వచ్చిన వారికి, తల్లిదండ్రులకు చాలా సెంటర్ల వద్ద కళాశాల యాజమాన్యాలు టెంట్లు ఏర్పాటు చేశాయి. ఎండ నుంచి సేదతీరడానికి వారికి ఇవి ఎంతో ఉపయోగపడ్డాయి. అంతేగాక కొన్ని కేంద్రాల వద్ద మజ్జిగ, నీళ్లు అందించారు. మధ్యాహ్నం అల్పాహారం కూడా సమకూర్చారు.
తికమక చిరునామా..
తార్నాక విజయపురి కాలనీలో ఇటీవల నూతనంగా ఏర్పాటైన సరోజినినాయుడు వనితా ఫార్మసీ మహావిద్యాలయ కళాశాల బోర్డుపై బతుకమ్మకుంట తార్నాక అని అడ్రస్ ఉంది. అభ్యర్థుల హాల్‌టికెట్లలో మాత్రం కళాశాల పేరుతో పాటు సౌత్‌లాలాగూడ తార్నాకగా పేర్కొన్నారు. అభ్యర్థులు అడ్రస్ వెతికే క్రమంలో పలుచోట్లకు తిరుగుతూ అయోమయానికి గురయ్యారు. చివరికి చిరునామా దొరికి అక్కడి వెళ్లేలోపే పరీక్ష ప్రారంభ సమయం ముగిసింది. ఫలితంగా ఇంజినీరింగ్ పరీక్షకు నలుగురు విద్యార్థులను అధికారులు అనుమతించలేదు. కళాశాల అడ్రస్ సరిగ్గా ఎందుకు ఇవ్వలేదని అధికారులతో వారు వాగ్వివాదానికి దిగారు. ఈ విద్యార్థుల్లో ఒకరు.. ఓ ఆర్మీ అధికారి కుమారుడు.